నదులను రక్షించుకోవలసిన బాధ్యత అందరిదీ. – మంత్రి హరీశ్ రావు.

కృష్ణా నది పునర్జీవనం చేయడం శుభపరిణామం. మహారాష్ట్రలో విద్యుత్ ఉత్పత్తి చేసిన నీటిని ఆరేబియా సముద్రంలోకి వదులుతున్నది. ఆ నీటిని కృష్ణానీటిలోకి వదిలితే మన రాష్ట్రంలో ఐదు చోట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. నదులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. సీఎం కేసీఆర్‌కు నీటి విలువ తెలుసు కాబట్టే పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. వృథాగా సముద్రంలోకి వెళ్లే నీటిని ఉపయోగించుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని హరీష్ రావు పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడిన సమయంలో చెరువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరణ చేస్తున్నం. దీంతో గ్రౌండ్ వాటర్ పెరిగింది. హరితహారంతో చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టినం. మానేరు, మూసీనదుల పునర్జీవనం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. కృష్ణా బేసిన్‌లో వర్షపాతం తక్కువగా ఉండటం.. కృష్ణా నీటిని వాడుకోలేకపోవడంతో అక్కడి ప్రజలు గతంలో వలస వెళ్లారు. కృష్ణా నది నుంచి 6 లక్షల 50వేల ఎకరాలకు సాగునీటిని అందించాం. వలస వెళ్లిన వారు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లకా్ష్మరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్, జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.