నరేంద్రమోదీ నాలుగేళ్ల పాలనపై బీజేపీ ప్రచారం

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 26 వ తేదీతో నాలుగేళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మే 24 నుంచి 28 వరకు ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నలుగురు కేంద్ర మంత్రులు ఈ నాలుగు రోజుల్లో ఢిల్లీలో మీడియా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాల గురించి వివరిస్తారు. అలాగే మే 29 నుంచి జూన్ 3 వరకు దేశంలోని 40 నగరాల్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తారు. గ్రామీణులు, పేదల సంక్షేమం కోసం చేపట్టిన ఉజ్వల యోజన, సౌభాగ్య యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాల గురించి ఎక్కువగా ప్రచారం చేయనున్నారు.
ఇదిలా వుండగా..బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూడా ప్రచారం నిర్వహిస్తుంది. ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మే 26ను ‘‘విశ్వాసఘాత్ దినోత్సవం’’గా నిర్వహిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ‘‘విశ్వాస ఘాత్ దినోత్సవం’’ కు సంబంధించిన పోస్టర్లను ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ అశోక్ గెహ్లాట్, రణ్ దీప్ సూర్జేవాల విడుదల చేశారు. పోస్టర్ విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన అశోక్ గెహ్లాట్..అవినీతి, మతతత్వ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఓడించడానికి కాంగ్రెస్ తో ఇతర భావసారూప్యం గల పార్టీలన్నీ ఏకమవుతాయని అన్నారు.