నల్లగొండ గ్రూపులు సల్లంగుండ!!

ఎస్.కె.జకీర్.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నవి. అధికారపక్షంలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. పోటాపోటీ రాజకీయాలతో రక్తికట్టిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా గతంలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలకు నిలయం. ఇప్పుడు ఆ పేరును టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌ గ్రూపు రాజకీయాలను మరపించే స్థాయిలో టీఆర్‌ఎస్‌ దూసుకుపోతున్నది. ఉమ్మడి నల్లగొండ లోని 12 అసెంబ్లీ స్థానాలలో దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నవి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అవి ముదిరి పాకాన పడుతున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి. తమ ఆధిపత్యం కోసం నాయకులు క్యాడర్‌ను గందరగోళపరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్‌ అంటూ ఎవరికివారు చెప్పుకుని తిరుగుతున్నారు. వేరువేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే నల్లగొండ, నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు, కోదాడ, తుంగతుర్తి, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలలో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నియోజకవర్గాలలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కుతోంది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఇద్దరు నేతల విభేదాలు వీధిపోరాటాల వరకు వెళ్లాయి. రెండు వర్గాల వారు కొట్టుకునేంత పనిచేశారు. ఇది పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఈ పరిస్థితులలో ఉత్తమ్‌ను వచ్చే ఎన్నికలలో ఓడించాలంటే అందుకు టీఆర్‌ఎస్‌ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేయాలి. గత ఎన్నికలలో స్థానికేతరురాలు అయినప్పటికీ తెలంగాణ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్‌ ఇచ్చింది టీఆర్‌ఎస్‌. ఉత్తమ్‌ చేతిలో ఆమె ఓడిపోయారు. ఓటమి తర్వాత ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా శంకరమ్మనే కేసీఆర్ కొనసాగించారు . ఎన్నికల నాటి నుంచి శంకరమ్మ హుజూర్‌నగర్‌ను అంటిపెట్టుకుని పనిచేస్తున్నారు. అయితే కొంతకాలం తర్వాత శంకరమ్మ వ్యవహారశైలిపై స్థానిక నేతలు గుర్రుమనడం మొదలయ్యింది. దాంతో పాటే గ్రూపులూ మొదలయ్యాయి. మండలాల వారీగా శంకరమ్మ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ విడిపోయింది. పలుమార్లు శంకరమ్మకు, స్థానిక నేతలకు మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల వ్యాపారవేత్త అయిన ఎన్‌ఆర్‌ఐ శానంపూడి సైదిరెడ్డి రంగంలోకి దిగారు. అధికారపార్టీ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో వివాదం మొదలయ్యింది.మఠంపల్లికి చెందిన ఈయన టీఆర్‌ఎస్‌ టికెట్‌ రేసులో ఉన్నారు. గత ఏడాది కాలంగా నియోజకవర్గంలో చాపకింద నీరులా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డితో సైదిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మంత్రి అండదండలతో శానంపూడి సైదిరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా తన కార్యచరణను అమలు చేస్తూ వస్తున్నారు. పార్టీతో పాటు ముఖ్య నేతల కార్యక్రమాలలోనూ పాలుపంచుకుంటున్నారు. ‘సై’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇదే సమయంలో మండలాలలో ఉండే స్థానిక టీఆర్‌ఎస్‌ క్యాడర్‌తో సైదిరెడ్డి సాన్నిహిత్యం పెంచుకున్నారు. శంకరమ్మకు వ్యతిరేకంగా ఉన్న ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు సైదిరెడ్డికి అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో హుజూర్‌నగర్‌ టికెట్‌ తనదేనంటూ సైదిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య నేతల భేటీలోనూ ఎమ్మెల్యే అభ్యర్థిగా సైదిరెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తున్నది. ఈ పరిణామాలను శంకరమ్మ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె తన శైలిలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. ఈమధ్యనే మఠంపల్లిలో సై కార్యక్రమాన్ని తలపెట్టిన సైదిరెడ్డి తన అనుచరులతో కలిసి హుజూర్‌నగర్‌ నుంచి భారీ బైక్‌ ర్యాలీకి సన్నాహాలు చేశారు. ఇది తెలిసిన శంకరమ్మ తన అనుచరులతో కలిసి హుజూర్‌నగర్‌ చేరుకున్నారు. మఠంపల్లిలో కార్యక్రమం అయితే హుజూర్‌నగర్‌ నుంచి ర్యాలీ ఎందుకు..? అంటూ రోడ్డెక్కారు. సైదిరెడ్డి బైక్‌ర్యాలీకి అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. ఇక్కడ ర్యాలీ తీయడానికి ఎవడు వాడంటూ పోలీసులతో వాదనకు దిగారు. నియోజకవర్గంలోనే తిరగడానికి వీలులేదంటూ సుమారు రెండు గంటలపాటు రోడ్డుపైన ధర్నా చేశారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారిపైనా తిరగబడ్డారు. చివరకు పోలీసులు సైదిరెడ్డి బైక్‌ ర్యాలీకి అనుమతి లేదని పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఆ సమయంలో శంకరమ్మ చేసిన ఆరోపణలు మాత్రం టీఆర్‌ఎస్‌ ఇంకా కలకలం రేపుతూనే ఉన్నాయి. జగదీశ్‌రెడ్డి స్వయంగా సైదిరెడ్డిని తనకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.. అమరుడి తల్లిని ఇబ్బంది పెట్టడం మంత్రికి తగునా అని ప్రశ్నించారు. హుజూర్‌నగర్‌లో తనకు కాదని రాజకీయం ఎవరు ఎలా చేస్తారో చూస్తానని హెచ్చరించారు. ఇవన్నీ హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ వివాదం పార్టీ శ్రేణులను మరింత గందరగోళంలో పడేసేలా కనిపిస్తోంది.నాగార్జునసాగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. కొంత కాలంగా ఎంసీ కోటిరెడ్డి, నోముల నర్సింహయ్య అనుచరులు వేర్వేరుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల ఒక సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్యను వేదికపైకి పిలవలేదని ఆయన అనుచరులు గొడవకు దిగారు. అదే క్రమంలో ఎంసీ వర్గీయులు అడ్డుకున్నారు. నల్లగొండ రాజకీయాలలో ఒకప్పటి శత్రువులు మిత్రులవుతున్నారు. మిత్రులు శత్రువులవుతున్నారు. అలాగే పార్టీలో వలసలు పెరిగే కొద్దీ గ్రూపులు పెరిగిపోతున్నాయి. నల్లగొండ జిల్లాలో పార్టీల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ గుత్తాకు పొసగని కంచర్ల భూపాల రెడ్డి ని కేసీఆర్ చేర్చుకున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లు రెండు గ్రూపులుగా నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ ను చీల్చేశారు. నల్లగొండ తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డి సోదరులను మంత్రి జగదీశ్ పార్టీలోకి తీసుకొచ్చారు. వెంటనే భూపాల్ రెడ్డికి నల్లగొండ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కేసీఆర్ నియమించారు. కంచర్ల, గుత్తా బ్రదర్స్ మధ్య చాలా కాలంగా రాజకీయ వైరం ఉన్నది. టీడీపీని వదిలి గుత్తా కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. కంచర్ల బ్రదర్స్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. గత ఎన్నికల్లో నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కంచర్ల చుక్కలు చూపించారు. స్వల్ప ఓట్ల మెజారిటీతోనే కంచర్ల ఓటమి పాలయ్యారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెక్ పెట్టడానికే కంచర్ల ను టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చారు. అయితే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి స్వయానా బావమరిది అయిన దుబ్బాక నరసింహారెడ్డిని తప్పించి కంచర్లకు నల్లగొండ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ టిఆర్ఎస్ నాయకుడు అనిల్ చకిలం ఇటీవల ఆరోపించారు. పార్టీని నమ్ముకొని ఉన్నవారికి అన్యాయం జరుగుతున్నట్టు ఆయన అన్నారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు 2001 లో తాను టిఆర్ఎస్ లో చేరానని కానీ తనలాంటి వారికీ ఇంతవరకు న్యాయం జరగడం లేదన్నారు. టిఆర్ఎస్ జెండా పట్టుకున్న వాళ్లను, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు.