నవంబర్ లో లోక్ సభకు ఎన్నికలు! ‘జమిలి’ లాభనష్టాలపై కెసిఆర్ తర్జనభర్జన

ఎస్.కె.జకీర్.

2018 నవంబర్ లోగా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని భారతీయ జనతా పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. కర్ణాటక రాష్ట్ర పరిణామాల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ”మాయోపాయాలు” చేసి కర్ణాటకలో అధికారం జారిపోకుండా చేసుకోగలిగిన అవకాశాలు ఉన్నా తాము ‘నీతి’కి కట్టుబడి ఉన్నామనే సంకేతాలు ఇచ్చినట్టు బిజెపి చెప్పుకుంటున్నది. వచ్చే నవంబర్ లో లోక్ సభ ఎన్నికలపై ‘మచ్చ’ లేకుండా చేసుకోవడానికే కర్ణాటకను ‘విడిచి’పెట్టినట్టు ఆ పార్టీ వర్గాలంటున్నాయి.జమిలి ఎన్నికలపై కెసిఆర్ తర్జనభర్జన చేస్తున్నట్టు తెలుస్తోంది.వెల్లువెత్తుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల ‘ వేడి’ చల్లారక ముందే అసెంబ్లీ ఎన్నికలకు బరిలో దిగితే ప్రజలు టిఆర్ ఎస్ కు తిరుగులేని మెజారిటీతో అధికారం కట్టబెట్టవచ్చునని ముఖ్యమంత్రి ఆలోచన.అలాగే ప్రతిపక్షాలు కూడా కూటములు కట్టే వ్యవధి, అధికార పక్షం పై దండెత్తే వ్యూహరచన చేసే సమయం ఇవ్వకుండా ఎన్నికలను షెడ్యూలు కన్నా ముందే జరపడంపై కెసిఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది చివర్లో లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపితే మేలని కొన్ని నెలలుగా  బీజేపీ ఆలోచిస్తున్నది. సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేల్లో జరగాల్సి ఉంది. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకూ అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉన్నది. మరో మూడు పెద్ద రాష్ట్రాలైన  రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల కాలపరిమితి 2019 జనవరిలో ముగుస్తుంది. సిక్కిం అసెంబ్లీ పదవీకాలం 2019 మే లోను, అరుణాచల్‌ ప్రదేశ్‌ది జూన్‌ 1న పూర్తవుతుంది.  ఏపీ, తెలంగాణ, ఒడిశా, అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలనూ కూడా  ఓ నాలుగైదు నెలలు ముందుకు జరిపి మొత్తం ఎనిమిది రాష్ట్రాలకూ ఒకేసారి ఎన్నికలు జరిపిస్తే తమకు రాజకీయంగా ప్రయోజనమని  బిజెపి అధిష్టానం భావిస్తున్నది.

జమిలి  ఎన్నికలకు వీలుపడని పక్షంలో నవంబరులో ఎన్నికలు జరగనున్న   బీజేపీ పాలిత రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లతో కలిపి లోక్ సభ ఎన్నికలకు పోవాలన్నది బిజెపి ఆలోచన.ఈ మూడు రాష్ట్రాలూ  రాజకీయంగా ఆ పార్టీకి అత్యంత కీలకం. కాల వ్యవధి పూర్తికాకుండా ఎన్నికలు నిర్వహించరాదని కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం స్పష్టం చేశాయి.తెలంగాణా రాష్ట్ర సమితి అభిప్రాయం ఇంకా స్పష్టం కాలేదు.2019 షెడ్యూలు ప్రకారమే  అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి కెసిఆర్ పలు మార్లు చెబుతున్నా జాతీయ రాజకీయ పరిణామాలను ఔపోసన పట్టిన ఆయన సందర్భాన్ని బట్టి ఎన్నికలను ముందుకు జరిపినా ఆశ్చర్యపోనవసరం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.