నాయిని వాక్ ‘దానం’ ఏమైనట్టు ? ‘భూకబ్జా’ కేసులు గల్లంతు!! అసలు కేసులు ఉన్నాయా!లేవా !!

హైదరాబాద్;
కాంగ్రెస్ మాజీ నాయకుడు దానం నాగేందర్ ‘భూకబ్జాకోరు’ అని, ఆయనను వదిలిపెట్టబోమని, చౌరస్తాలో నిలబెడతామని ప్రభుత్వం చేసిన వాక్ ‘దానం’ బహుశా ఇక అమలు కాకపోవచ్చును. దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరడమే ఇందుకు కారణమని రాజకీయవర్గాలలో చెప్పుకుంటున్నారు. దానం నాగేందర్ టిఆర్ఎస్ లో ఆదివారం లాంఛనంగా చేరారు. కానీ అంతకుముందే చాలారోజుల క్రితమే దానికి ఏర్పాట్లు జరిగాయి. ఆయన చేరిక జాప్యానికి గల కారణాలు కేసీఆర్ కు, దానం కు, కొందరు టిఆర్ఎస్ ముఖ్యులకు మాత్రమే తెలుసు. రాజకీయాల్లో ప్రత్యర్థులు శాశ్వతం కాదని, తమ గూటికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని తెలియక కొందరు ‘బోళా శంకరులు’ ఉచితంగా దుమ్మెత్తి పోస్తారు. దానం చేరిక గురించిన సన్నాహాలు గతంలో జరిగినప్పటికీ ‘కేసీఆర్ సమక్షంలోనే చేరతా’ నని దానం షరతు పెట్టడం వల్ల ఆ ఫిరాయింపు ప్రక్రియ వాయిదా పడింది. సాక్షాత్తు తెలంగాణ హోమ్ మంత్రి,ముక్కుసూటి మనిషిగా పేరు పొందిన నాయిని నరసింహారెడ్డి ఆ సందర్భంలో ఒక సభలో మాట్లాడిన వీడియో సామాజిక మాథ్యమాల్లో ‘వైరల్’ అవుతున్నది. అయితే దానం నాగేందర్ పై నిజంగానే ‘భూ కబ్జా’ కేసులున్నాయా? ఆయన భూ కుంభకోణాలకు పాల్పడ్డారా? ఒక వేళ అటువంటి కేసులుంటే అవి ఏమవుతాయి? లేక ఆ కేసులు బూటకమా? తప్పుడు కేసులా ? అసలు కేసులే లేవా? అధికారపార్టీలో చేరినందున అవి కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయినట్లేనా? దానం నాగేందర్ నిష్కళంక నాయకుడిగా మారిపోయారా? హోమ్ మంత్రి నాయిని నరసింహారెడ్డి బహుశా ఈ ప్రశ్నలకు జవాబివ్వలేకపోవచ్చును. గతంలో తాను చేసి వ్యాఖ్యలకు ఆయన తీరిగ్గా చింతిస్తుండవచ్చును కూడా.
” వాడు దానం కేటీఆర్ దగ్గరికి వచ్చిండు. నీ పార్టీలోకి వస్త. నీ పార్టీ లోకి వస్త అని బతిమిలాడిండు. సరే రార అన్నం. నిర్ణయం తీసుకున్నడు. కేసీఆర్ వస్తెనే మీటింగుకు వస్తనన్నడు. కేసీఆర్ వస్తె చేరతడంట వాడు. నీ యమ్మ, థర్డ్ క్లాస్ గానివి. నీ కోసం కేసీఆర్ వస్తాడు. నీకు కేసీఆర్ వస్తడా!! బిడ్డా, నీ కుంభకోణాలన్ని బయటపెడతం. నువ్వు ల్యాన్డ్ గ్రాబర్ వి. నిన్ను చౌరస్తల నిలబెడతం. బిడ్డా, నిన్ను వదిలిపెట్టే సమస్యే లేదు.” అని హొమ్ మంత్రి నాయిని అన్నారు. ఆయన తన కడుపులో ఏదీ దాచుకునే రకం మనిషి గాదు. కనుక అవి నిజాలు అని ఈ వీడియో క్లిప్పు చూసిన వాళ్ళు అనుకుంటున్నారు.
సీన్ కట్ చేస్తే కేసీఆర్ సమక్షంలోనే దానం నాగేందర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ వేదికపై ఉప ముఖ్యమంత్రి మెహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, హైదరాబాద్ నగర మంత్రులు పద్మారావు,తలసాని శ్రీనివాసయాదవ్ తదితర అధికారపక్షం ప్రముఖులు ఉన్నారు.
” దానం నాగేందర్ సేవలు హైదరాబాద్ నగరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. దానం పాజిటివ్ నిర్ణయం తీసుకున్నారు. దానం నాగేందర్ టిఆర్ఎస్ లో సుఖపడడం కోసం చేరలేదు. కష్టపడి పనిచేసేవారందరికీ టిఆర్ఎస్ లో సముచిత గౌరవం ఉంటుంది. దానం కు మంచి భవిష్యత్తు ఉన్నది. కార్యకర్త స్థాయి నుంచి ప్రజల మధ్యలో ఎదిగిన నాయకుడు నాగేందర్. దానం టిఆర్ఎస్ లో చేరడమంటే బండను నెత్తికెత్తుకున్నట్టే.” అని దానం గురించి ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.