నాలుగేళ్లలో అభివృద్ది పథాన అటవీ అభివృద్ది కార్పోరేషన్.

హైదరాబాద్:
తెలంగాణ అటవీ అభివృద్ది కార్పోరేషన్ (TSFDC)లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. పాల్గొన్న చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎం.డీ. చందన్ మిత్రా, ఉద్యోగులు, సిబ్బంది. కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో ఎం.డీతో పాటు ఇతర ఉద్యోగుల సమక్షంలో చైర్మన్ జాతీయ జెండా ను ఎగురవేసి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అటవీ అభివృద్ది సంస్థ సాధించిన ప్రగతిని, విజయాలను చైర్మన్ బండా నరేందర్ రెడ్డి వివరించారు. 2017-18 సంవత్సరంలో యూకలిప్టస్ క్లోనల్ ప్లాంటేషన్స్ యొక్క ఉత్పాదకత అత్యంత ఉన్నత స్థాయి కి చేరుకున్నది. 2012-13 సంవత్సరం లో ఉత్పాదకత 44.92 MT/ Ha. ఉండగా అది 2017-18 సంవత్సరం కి 87.00 MT/ Ha గా చేరింది. ఇలా ఏకంగా వందశాతం అధిక దిగుబడిని సాధించి కార్పోరేషన్ రికార్డు సృష్టించింది. గత సంవత్సరంలో TSFDC నుండి 3 లక్షల టన్నుల పల్ప్ ఉడ్ ను పేపర్ మిల్లులకు సప్లయ్ చేయడం జరిగింది. ఇది గతంలో ఎన్నడూ, ఉమ్మడి రాష్ట్రంలో కూడా సాధించబడని రికార్డు. లాంగ్ వెదురు విక్రయం ద్వారా గత సంవత్సరం 9.06 కోట్ల ఆదాయం లక్ష్యాన్ని సాధించింది. లాంగ్ వెదురు సగటు ధర. 2012-13 సంవత్సరానికి 28.14 రూపాయలు కాగా 2017-18 లో సగటు ధర రూ. 42.80. ఇది 66% అధికం. 2016-17 సంవత్సరం లో వెదురు అమ్మకం ద్వారా సంస్థ కు సమకూరిన ఆదాయం రూ. 12.63 కోట్లు.ఎకో టూరిజం రంగంలోనూ అటవీ అభివృద్ది సంస్థ తనదైన ముద్రను వేస్తోందని చైర్మన్ తెలిపారు. గత ఏడాది పాల పిట్ట సైక్లింగ్ ఉద్యానవనం, బర్డ్ పార్కు కొండాపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. ఇది గతంలో స్థానికులు చెత్త వేసే ప్రాంతంగా ఉపయోగించేవారు. గత సీజన్ లో హరితహారంలో భాగంగా ఈ ప్రాంతంలో పిచ్చి మొక్కలు, ఎండిపోయిన చెట్లు తీసివేసి 40 రకాలకు చెందిన 7500 నూతన అటవీ జాతుల మొక్కలను నాటడం జరిగింది. దాదాపు వంద శాతం మొక్కలు బతికి ఇప్పుడు అహ్లాదాన్ని పంచుతున్నాయి. చక్కటి ప్రకృతి మధ్య ఏర్పాటుచేసిన 2.9 కి.మీ. సైకిల్ ట్రాక్ హైటెక్ సిటీ, పరిసర ప్రాంత ప్రజలకు కాలుష్యాన్ని నివారించి వినోదం, ఆరోగ్యాన్ని కల్పిస్తోంది. పిల్లలు, పెద్దలు సైక్లింగ్ కోసం ఈ ప్రాంతంలో సందడి చేస్తున్నారు. హైటెక్ సిటీ కారిడార్ లో నెటిజన్ల నుంచి మంచి ఆదరణ పొంది గూగుల్ రేటింగ్ లో 5 లో 4.7 పాయింట్ల రేటింగ్ సాధించింది. గత యేడాది కాలంగా బొటానికల్ గార్డెన్ లో వివిధ సౌకర్యాలను కల్పించటం ద్వారా విస్తృతంగా అభివృద్ధి చేయబడింది. యోగా హాల్, కెఫీటేరియా కమ్ రెస్టారెంట్, గజేబో, లాగ్ హట్, టెంట్ హట్, ట్రీ కాటేజ్, ఇంటర్ప్రెటేషన్ సెంటర్, పిల్లల ఆట స్థలం, కార్పొరేట్ అడ్వెంచర్ గేమ్స్, టిక్కెట్ కౌంటర్, సావనీర్ షాప్ మరియు స్కేటింగ్ రింగ్ అదనంగా ఏర్పాటయ్యాయి. మూడు కిలోమీటర్ల వాకర్ మార్గం కొత్త గా మట్టి, కంకరతో నిర్మాణమైంది. బోటానికల్ గార్డెన్ లో పూల తోటలు బాగా అబివృద్ది పరచబడ్డాయి. ఫలితంగా సందర్శకుల సంఖ్య అసాధారణంగా పెరిగింది. దీంతో సోషల్ మీడియాలోనూ అటవీ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలోని ఎకో టూరిజం స్పాట్ లకు విశేష ఆదరణ లభిస్తోంది. Google రేటింగ్ 3 నుండి 4 వరకు పెరిగింది. Facebook లో బొటానికల్ గార్డెన్ ప్రస్తుత రేటింగ్ 4.3.రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో రెండు చోట్ల పర్యావరణ పర్యాటక ప్రాజెక్టులు కార్పోరేషన్ చేపడుతోంది. కవాల్ టైగర్ రిజర్వు సమీపంలో మంచిర్యాల జిల్లా చింతగూడ గ్రామ సమీపంలో కొత్త పర్యావరణ, పర్యాటక ప్రాజెక్టు కోసం ఆరు ఎకరాల భూమి గోదావరి నది దగ్గర సేకరించబడింది. పర్యాటక స్థల అభివృద్ధి కోసం ఉత్తమ నిర్మాణ ప్రతిపాదనలు మరియు సౌకర్యాల కల్పన కోసం టెండర్ పిలువబడింది. మరొక ప్రాజెక్ట్ నల్గొండ జిల్లాలోని వైజాగ్ కాలనీలో నాగార్జునసాగర్ తీర ప్రాంతంలో (back waters) ప్రతిపాదించిన పర్యావరణ పర్యాటక ప్రాజెక్టు. ఇందు కోసం 15.00 యెకరాల భూమి గుర్తించబడింది. ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి . DPR యొక్క తయారీ పురోగతిలో ఉంది.వెదురు పరిశ్రమ (బాంబూ లంబర్ ఇండస్ట్రీ) ఏర్పాటు కోసం రూ.22.4 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి. ఇదివరకు కాగితం తయారీ కోసం పేపర్ మిల్లులు వెదురును కార్పోరేషన్ నుంచి కొనుగోలు చేసేవి. ప్రస్తుతం టెక్నాలజీ మార్పు కారణంగా వీటికి డిమాండ్ లేదు. బాంబూ లంబర్ ఇండస్ట్రీ ను స్థాపించితే TSFDC ప్లాంటేషన్ లలో లభించే వెదురును పూర్తిగా ఉపయోగించుకోగలము మరియు ఇది రైతులకు ఆదాయాన్ని పెంచుతుంది.సంక్షేమ చర్యల్లో భాగంగా కార్పోరేషన్ లో ప్రస్తుతం ఉన్న 77 మంది ఉద్యోగులు అందరికి ఎల్ఐసి పెన్షన్ సదుపాయాన్ని 70:30 నిష్పత్తిలో యజమాని, ఉద్యోగికి ప్రతిపాదించడం జరిగింది . ప్రభుత్వం యొక్క ఈ పథకం మంజూరు TSFDC ఉద్యోగులకు అత్యంత ఎక్కువ సంతృప్తి నిచ్చింది. ప్రభుత్వంలో చాలా కొద్ది సంస్థలు ఇలాంటి పధకాలను అమలుచేస్తున్నాయి. పదవీ విరమణ తర్వాత పెన్షన్ సదుపాయం పొందటం ఈ పథకం ప్రత్యేకత అని అటవీ కార్పేషన్ చైర్మన్, ఎం.డీ తెలిపారు.