నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. ఓపెన్ నాలాలో పడి ఒక వ్యక్తి మృతి.

హైదరాబాద్:
ప్రమాదం జరిగి 5 రోజులయ్యింది.చనిపోయి 36 గంటలు గడిచింది అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.అనాధ శవంగా గాంధీలో పడి ఉంది.మల్కాజిగిరి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాలా పనులు కాంట్రాక్టర్ మధ్యలో ఆపడం వలన ఓ నిండు ప్రాణం నాలాలో కలిసిపోయింది..
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. మల్కాజిగిరి మున్సిపల్ సర్కిల్ పరిధి, సత్యరాఘవేంద్ర నగర్ లోని ఓపెన్ నాలాలో గత సోమవారం రాత్రి సుమారు 9:45 గం. ల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిన్ రోడ్ నుంచి కాలనీలోకి నడుచుకుంటూ వెళుతున్నాడు. మురుగు నీటితో ఆ రోడ్డంతా ఇబ్బందిగా ఉండడంతో ఆ వ్యక్తితో పాటు కొంతమంది స్థానికులు నడుచుకుంటూ వెళ్తుండగా అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి కాలు జారీ వేగంగా ప్రవహిస్తున్న నాళాలో పడిపోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు 108కు, 100 కు ఫోన్ చేసి చెప్పగా అటు 108 సిబ్బంది ఇటు పోలీసులు వచ్చి చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయమే మృతి చెందినా శనివారం సాయంత్రం వరకు విషయం బయటకు రానివ్వలేదు. మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియనందున గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు. చనిపోయిన వ్యక్తి మృతదేహం గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే పడి ఉంది. కాగా ఆ రోడ్డు ఇటీవలే సగం మాత్రమే పూర్తి చేసి మధ్యలో పని వదిలేశారు. ఈ విషయంపై స్థానిక మున్సిపల్ అధికారులకు, ఇంజనీరింగ్ విభాగం వారికి ఎన్ని మార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ఇదే విషయం పై ఆంగ్ల, తెలుగు దిన పత్రికల్లో వార్తలు అనేకసార్లు వచ్చాయి. మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ పేషీ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి స్థానిక డిప్యూటీ కమిషనర్ కి ఆదేశాలు వచ్చినా పట్టించుకోలేదు. చివరకు స్థానికుల భయమే నిజమయ్యి ఓ వ్యక్తి నిండు ప్రాణం బలి అయింది. ప్రమాదం జరిగి 5 రోజులు అయినా, అతను చనిపోయి 36 గంటలు అయినా మున్సిపల్ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించకపోవడం కొసమెరుపు.