నెల్లూరు సిటీ నుంచి నారాయణ.

నెల్లూరు;
నెల్లూరు జిల్లాలో సిటీ రాజకీయం వేడెక్కింది. సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగాలని మంత్రి నారాయణ భావిస్తున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని మొదటినుంచి తెలుగుదేశం పార్టీ అశ్రద్ధచేస్తూ ఉంది. జిల్లా కేంద్రంపై పట్టులేకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్ పాయింట్‌! 1983లో ఆనం రామనారాయణరెడ్డి, 1994లో తాళ్లపాక రమేశ్‌రెడ్డి మాత్రమే టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. 1994 తర్వాత టీడీపీకి ఇప్పటివరకూ ఇక్కడ విజయమే దక్కలేదు. బీజేపీ, వామపక్షాలతో పొత్తుపెట్టుకున్న ప్రతిసారీ టీడీపీ ఈ స్థానాన్ని మిత్ర పక్షాలకే కేటాయిస్తూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితికి ఇది కూడా ఒక కారణమట. పోనీ టీడీపీ పట్ల స్థానిక ప్రజల్లో వ్యతిరేకత ఉందా అంటే అదీలేదు. కేవలం ఆ పార్టీ ఈ స్థానం పట్ల మొదటినుంచి అశ్రద్ధ వహించడం వల్లే స్వపక్షంలోనే వెన్నుపోటుదారులు తయారయ్యారు. దీంతో ఇక్కడ ప్రత్యర్ధులకి విజయం సులభమయ్యింది. మంత్రి నారాయణ కన్ను ఈ స్థానంపై పడింది. నిజానికి నారాయణ మొదట్లో రాజకీయాల పట్ల ఆసక్తి చూపలేదు. గత ఎన్నికల సమయంలో మూడు జిల్లాల్లో టీడీపీకి వెన్నెముకగా పని చేశారు. విజయనగరం, ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లు రాబట్టడంలో కూడా ఆయనది కీలకపాత్ర. అందుకే నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి తన క్యాబినెట్‌లో చోటిచ్చారు. ఇదే జిల్లాకి చెందిన బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలకు కూడా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. “ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచి వస్తే తెలుస్తుంది రాజకీయం అంటే ఏంటో? ఎమ్మెల్సీలు తీసుకుంటే ఏమి తెలుస్తుంది?” అని తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానిస్తుంటారు. ఈ వ్యాఖ్యలు ప్రత్యేకించి నారాయణని ఉద్దేశించి అనకపోయినా.. ఆయన మాత్రం ఒకింత బాధపడుతుంటారని సమాచారం. అందుకే ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందాలని నారాయణ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి రంగం సిద్ధంచేసుకుంటున్నారు. గతంలో ఇక్కడినుంచి టీడీపీ తరఫున పోటీచేసిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి కూడా మార్పుకి అంగీకారం తెలిపారు . “సారే పోటీచేస్తామంటే ఇక ఇబ్బంది ఏముంది?” అంటున్నారు. జనసేన అగ్రనేతలతో ముంగమూరు సంప్రదింపులు జరుపుతున్నారనీ, ఆ పార్టీలోకి జంప్‌చేసే అవకాశాలు లేకపోలేదనీ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ముంగమూరుకి గతంలో చిరంజీవి ప్రజారాజ్యంలో టిక్కెట్టు ఇచ్చారు. అప్పట్లో ముక్కోణ పోటీ వల్ల ముంగమూరు గెలుపొందారు. కాబట్టి జనసేనలోకి ఆయన వెళ్లినా ఆశ్చర్యపోనక్కరలేదనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇక మేయర్ అబ్దుల్ అజీజ్ కూడా సిటీ లేదా రూరల్ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నారాయణ అజీజ్‌కి గురువు. ఆయన దగ్గరే చదువుకున్నాడు. సిటీలో నలభై వేలకి పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయనీ.. తనకు టిక్కెట్‌ ఇస్తే కచ్చితంగా గెలుపొందుతాననీ ఆయన . ఇప్పటికే అజీజ్‌ అనుచరులు సామాజిక మాధ్యమాల్లో ముస్లింలకి ప్రాధాన్యం కల్పించాలనీ, అబ్దుల్ అజీజ్‌కి టిక్కెట్‌ ఇవ్వాలనీ డిమాండ్ చేస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఒకవేళ సిటీ నుంచి నారాయణ పోటీకి దిగితే.. రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఎంపీగా పోటీకి దిగే అవకాశాలు ఉన్నవి. ఈ తరుణంలో రూరల్ టిక్కెట్టు అయినా దక్కించుకోవాలని మేయర్‌ అజీజ్‌ ఆలోచిస్తున్నారు. నెల్లూరు టీడీపీలోని ద్వితీయ, తృతీయశ్రేణి నేతలు గుర్రుగా ఉన్నారు. “పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి, పడరాని పాట్లు పడ్డాం. పార్టీ కోసం, ప్రజల కోసం పోరాటాలు చేశాం. తీరా అధికారంలోకి వచ్చాక మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేద”ని పార్టీ నేతలు అంతర్గతంగా ఆవేదన చెందుతోంది. ఈ పరిణామాలను గమనించిన వైసీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో తమకు అనుకూల గాలులు వీస్తాయని అంచనా వేసుకుంటున్నారు. మంత్రి నారాయణ ఇక్కడినుంచి పోటీచేసి గెలుపొందితే వచ్చే రోజుల్లో తమ ఉనికికి ప్రమాదం అన్న భావనతో కొందరు వెన్నుపోట్లకి దగవచ్చునన్నది విశ్లేషకుల అభిప్రాయం. నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌కి జగన్ దగ్గర మంచి ఇమేజే ఉంది. ఎన్‌టీఆర్ పక్కా గృహాల నిర్మాణంపైన, టీడీపీ చేపట్టిన అభివృద్ధి పనులపైనా ఆరోపణలు చేయడం ప్రజల్లో చర్చకి దారితీసింది. విజయవాడ- చెన్నై రూటులో మూడవ రైలుమార్గం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా నగరంలోని పడుగుపాడు, వెంకటేశ్వరపురం ప్రాంతంలో కొన్ని ఇళ్లు తొలగించాల్సిన పనిపడింది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు హడావుడిగా ఆ ఇళ్లు తొలగించాలని ప్రయత్నించారు. ఈ విషయం మంత్రి నారాయణ దృష్టికి రావడంతో వెంటనే రైల్వే ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ప్రస్తుతం ఎన్‌టీఆర్ ఇళ్లు నిర్మిస్తున్నామనీ, ఇక్కడి వారందరికీ ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఇళ్లు తొలగించాలని నచ్చచెప్పడంతో వారు ఓకే అన్నారు. ఇంతలో షడన్‌గా వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సీన్‌లోకి ఎంటరయ్యారు. తాను జిల్లా కలెక్టర్‌తో చర్చించ బట్టే.. ఇళ్లు కూల్చే పని ఆగిందని చెప్పుకోవడం మొదలుపెట్టారు . వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సీటీలో పరిస్థితి అధికారపక్షానికి అనుకూలంగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. పెన్నా బ్యారేజీ, ఎన్‌టీఆర్ ఇళ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ స్కీం, కార్పొరేట్ కాలేజీలు, ప్రీ ప్రైమరీ అంగన్‌వాడీ స్కూల్స్ వంటి అభివృద్ధి పనులు మంత్రి నారాయణ చేపట్టడంతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నది నేతల కథనం.