నేను తప్పేమీ చెప్పలేదే?: కిషన్ రెడ్డి.

నేను తప్పేమీ చెప్పలేదే?:
కిషన్ రెడ్డి.

న్యూఢిల్లీ:

ఉగ్రవాద మూలాలు హైదరాబాద్‌లో ఉన్నాయంటూ తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు. దేశంలో పలుచోట్ల ఉగ్రవాద కార్యలాపాలు పెరుగుతున్న విషయాన్నే తాను చెప్పానని శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. బెంగళూరు, భోపాల్‌ ఇలా ఎక్కడ ఉగ్ర ఘటనలు జరిగినప్పుడు అందుకు మూలాలు హైదరాబాద్‌లో కనబడుతున్నాయని, హైదరాబాద్‌లో ప్రతి 2-3 నెలలకు ఉగ్రవాదులను రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ అరెస్టు చేస్తున్నారని చెప్పారు. ఇందులో తాను తప్పేమీ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదులకు మతం లేదని, పార్టీ అభిప్రాయం కూడా ఇదేనని కిషన్ రెడ్డి చెప్పారు. అయితే ముస్లింలను తాను ఉగ్రవాదులుగా ఎప్పుడూ పేర్కొనలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ సేఫ్ జోన్ అంటూ అమిత్‌షా సహాయ మంత్రి బాధ్యతలేని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఒవైసీ మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకిగా కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. కాగా, దీనికి ముందు ఉగ్రవాదానికి హైదరాబాద్ సేఫ్ జోన్ అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడంపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదానికి హైదరాబాద్ సేఫ్ జోన్ అని ఎన్ఐఏ, ఐబీ, రా ఎన్నిసార్లు లిఖిత పూర్వకంగా చెప్పాయని మంత్రిని ప్రశ్నించారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధికి, ముస్లింలకు వ్యతిరేకంగానే కిషన్ రెడ్డి వ్యాఖ్యలున్నాయంటూ ఆయన మండిపడ్డారు.