నోయిడాలో అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీ.

న్యూఢిల్లీ:
ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ ఫ్యాక్టరీని శాంసంగ్ సంస్థ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రారంభించింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాంసంగ్ మొబైల్ యూనిట్ ప్రారంభించారు. నోయిడా సెక్టార్ 81లో గల 35 ఎకరాల ఎలక్ట్రానిక్స్ ఫెసిలిటీ సెంటర్లో ఇకపై నెలకు 1.2 కోట్ల ఫోన్లు తయారు చేయనున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ నెలకు 50 లక్షల ఫోన్లు తయారయ్యేవి. ఈ ఏడాది చివరికల్లా దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు 340 మిలియన్లకు చేరనున్నారన్న అంచనాల మధ్య శాంసంగ్ తన ఉత్పాదకతను రెట్టింపు చేయాలని నిర్ణయించింది.

దేశంలో శాంసంగ్ సంస్థ తొలి ప్లాంట్ 1996లో నోయిడాలో ప్రారంభమైంది. 1997లో ఇక్కడి నుంచి టీవీలు తయారు చేయడం ప్రారంభించింది. 2005లో భారత్ లో తన మొదటి మొబైల్ ఫోన్ తయారీ యూనిట్‌ ప్రారంభించింది. 2018లో అతి పెద్ద మొబైల్ ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టింది. 2012లో శాంసంగ్ భారత్ మొబైల్ మార్కెట్లో తిరుగులేని దిగ్గజంగా ఆవిర్భవించింది. 2017లో తొలిసారిగా శాంసంగ్ నోయిడాలోని స్మార్ట్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్ల యూనిట్లలో తయారీ ఉత్పత్తిని పెంచడానికి దాదాపు రూ.4,915 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీంతో 5000 కొత్త ఉద్యోగాలు వస్తాయని సంస్థ తెలిపింది.

శాంసంగ్ సంస్థకి నోయిడా ప్రధాన కేంద్రం. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో తయారీ యూనిట్ ఒకటి ఉంది. భారతదేశంలో దాదాపు 70,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా శాంసంగ్ సంస్థ ఉపాధి కల్పిస్తోంది. ఇటీవలే యూపీ ప్రభుత్వపు మెగా పాలసీలో భాగంగా శాంసంగ్ కంపెనీకి చెందిన పెట్టుబడి ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది.