పంటకు పెట్టుబడి ఎట్లా? మొన్న ఇచ్చింది ‘సాదర’ ఖర్చుకే పాయే..-సన్నకారు, చిన్నకారుల ఆవేదన

విశ్వనాథ్‌, కరీంనగర్‌ :
భగభగ ఎండలు మండుతుంటే సర్కార్‌ ఎకరాకు రూ.4వేలు ఇచ్చే… వచ్చిన సొమ్ము కాస్తా ఎండకాలం పూట సల్లటి బీర్లకే ఒడిసిపాయే… నెల తర్వాత పంటలు మొదలాయే… ఇప్పుడెలా పంట పెట్టుబడి అంటూ… మల్లయ్య అనే రైతు వాపోతున్నాడు. ఇది ఒక మల్లయ్య, ఎల్లయ్యలాంటి రైతుల కథ కాదు. ప్రతి గ్రామంలో గత నెలలోనే చెక్కు తీసుకున్న రైతులు ఇంటి ఖర్చుకు సాదర ఖర్చుకు పైసలన్నీ వాడుకున్నరు. ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఎకరాకు రూ.4వేల చొప్పున చెల్లిస్తే, సన్నకారు, చిన్నకారు రైతులకు రూ.2వేల నుంచి పదివేల వరకు దక్కాయి. ఇక పది గుంటల భూమి ఉన్న రైతుకు వెయ్యి, 20 గుంటలు ఉన్న రైతుకు రెండు వేలు… ఇలా గుంటకు వెయ్యి చొప్పున ప్రభుత్వం రైతుబంధు స్కీం ద్వారా పంపిణీ చేసింది. సర్కారిస్తే మాత్రం రూ.2వేలు కుండలో వేసి దాచిపెడతామా, అవసరానికి వాడుకోమా అని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. పంట సమయంలో ప్రతి ఎకరాకు పదివేల వరకు పెట్టబడి ఖర్చు అవసరమౌతుంది. ప్రభుత్వం ఇచ్చిన రూ.4వేలు నెల రోజులపాటు దాచిపెట్టడం సాధ్యమౌతుందా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక ధనవంతులైన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము ఏ బ్యాంకులోనో జమై పోయింది. వారికి ఇప్పుడు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. అసలు కష్టమంతా సన్నకారు, చిన్నకారు రైతులకే వచ్చేసింది. షావుకారు దగ్గరికెళితే మొన్ననే సర్కారు పంట సాయం చేసిందంటూ ప్రశ్నిస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. అయితే సర్కారిచ్చిన సొమ్ము కాస్తా జల్సాకే పోయాయంటూ చెబితే పరువుపోతుందని బాధపడుతున్నవారూ లేకపోలేదు. ఇకనైనా ప్రభుత్వం ఇవ్వాల్సిన సొమ్ము కాస్తా దుక్కి దున్ని విత్తనం నాటే సమయానికే అందిస్తే బాగుంటుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. ముందుగానే తమ ఖ్యాతి కోసం సర్కారు చెక్కులు పంపిణీ చేస్తే మాత్రం… పిల్లికి రొయ్యల మొతాడు ఎంతకాం ఉంటుందని పలువురు సామెతను గుర్తుచేస్తున్నారు.