పాతికేళ్ళ దండోరా ఇక ఓట్ల పోటెత్తాలి.

ఎమ్మార్పీయస్. ఈ సంస్థ జూలై 7, 2018 కి తన పాతికవ వత్సరం లోకి అడుగుపెట్టబోతుంది. బహుశా ఈ పేరు తెలియని వారు గత పాతికేళ్లలో ఎవరూ ఉండరేమో. ఈ సంస్థ ప్రస్తావన లేకుండా ఏ “క్యాబినెట్” మీటింగ్ జరిగి ఉండదేమో. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా ప్రసిద్ధిగాంచి, రిజర్వేషన్లలో దళితుల మధ్య సమాన ప్రాతినిధ్యం కోరుతూ 1994 జూలై 7 న మంద కృష్ణ మాదిగ గారి సారధ్యం లో తెలుగు నేల పై ఆవిర్భవించిన ఆత్మ గౌరవ పొలికేక ఈ ఉద్యమం .“బహుదేశంబుల బెర్వడసి మీసంబు దీటు భరతఖండంబు నా పాటశాల” అన్న జాషువా పద్యంలాగా , ఆంధ్ర ప్రదేశ్ పునాదిగా, దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరించి పేరు గడించిన “పేదోళ్ళ ఉద్యమం” దండోరా.
మాదిగ దండోరా పుట్టుక సందర్భం దేశమంతా ఒక అల్లకల్లోలంలో ఉన్న నేపధ్యం . బాబ్రీ మసీదు సంఘటన, ముంబాయి అల్లర్ల సంఘటనలతో దేశమంతా మత చర్చ జరుగుతున్నప్పుడు ,ప్రపంచీకరణ వంటి కార్పోరేట్ స్టైల్ దేశానికి అప్పుడే పరిచయం అవుతున్నప్పుడు , మండల్ కమీషన్ రిపోర్ట్ తో రిజర్వేషన్ల సమర్ధన , వ్యతిరేక వాతావరణం నడుస్తున్నప్పుడు , వీటన్నిటినీ దాటుకుంటూ రిజర్వేషన్లలో సమాన వాటా కోసం సమరశంఖం పూరించింది ఎమ్మార్పీయస్. దళితుల మధ్య రాజ్యాంగ ఫలాల సమ పంపిణీ కి సంబంధించిన ఈ అంశం అన్ని రాజకీయ పార్టీల మద్దత్తు కూడగట్టింది , కానీ దళితుల్లో అప్పటిదాకా రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారి నుండి మాత్రం వ్యతిరేక ఉద్యమానికి దారి తీసింది.వాస్తవాలు నివేదికలు అన్నీ పరిశీలన జరిగిన మేర చివరికి “వర్గీకరణ” న్యాయం అని నివేదికలు రావడం దండోరా ఉద్యమానికి నైతిక బలాన్ని పెంచడమే కాక , సామాజిక మద్దత్తు కూడా లభించడానికి కారణమైంది . 2000 లో వర్గీకరణ అంశం తాత్కాలికంగా పరిష్కారమయ్యాక ఈ రెండు కులాల మధ్య నెమ్మదిగా మొదలైన రాజకీయ చర్చల నేపధ్యంలో , వీరి మధ్య శాశ్వత వివాదాలకు మరలా నిప్పు రాజేయాలని , వర్గీకరణ ను వ్యతిరేకించే అతి కొద్ది మంది తో కల్సి పాలక పక్షాలు చేసిన కుట్రల ఫలితమే వర్గీకరణ కోల్పోవడం , ఆ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం .2004 లో వర్గీకరణ కోల్పోయినప్పటి నుండి ఇప్పటిదాకా మాల మాదిగల మధ్య నడుస్తున్న సామాజిక యుద్ద్ధమే.దీనికి ఉదాహరణ.2004 నుండి వర్గీకరణ కోల్పోయాక మాదిగ ఉద్యమ ప్రయాణం పొగడ్తలూ సంపాదించింది , విమర్శలకు లోనైంది . ఆరోగ్యశ్రీ, వృద్ధ్హులు వితంతవుల వికలాంగుల పెన్షన్ వంటి పధకాల రూపకల్పనకు ఎమ్మార్పీయస్ పోరాటమే భూమిక అని వేరే చెప్పక్కర్లేదు . ఈ క్రమంలో సమయం గడిచింది కానీ, వర్గీకరణ ఫలితం రాలేదనే నిరాశ మాదిగల్లో పూర్తిగా కూరుకుపోయింది. 2009 ఎన్నికల తర్వాత తెలంగాణా ఉద్యమం ఊపందుకున్న నేపధ్యం లో తెలంగాణా కోరికను సమర్ధించింది ఎమ్మార్పీయస్. అది కూడా అంబేద్కర్ గారి చిన్న రాష్ట్రాల ప్రతిపాదన ప్రభావమే . దీనితో ప్రాంతీయ వాద ప్రభావాన్ని ఎదుర్కొక తప్పలేదు ఎమ్మార్పీయస్ నాయకత్వానికి . ఉదాహరణకు పెద్ద మాదిగ అవుతానన్న చంద్రబాబును తెలంగాణా మొత్తం మాదిగ దండోరా, తెలంగాణా ఉద్యమ సెగ తగలకుండా తిప్పి ఆంధ్రాలో చంద్రబాబు గారి కోసం ప్రచారం చేసినా, ఆంధ్రాలో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారు “ కృష్ణ మాదిగ” గారిని తెలంగాణా వాడికి ఇక్కడేం పని అంటూ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు వర్గీకరణ విషయంలో ఎంతో చొరవచూపారు .కానీ వర్గీకరణ మీద కేంద్రం నిర్ణయం తీసుకునేలా చేయడంలో ఆయన కూడా విఫలమయ్యారు .
ఉద్యమం మొదలైన రోజు నుండి చూసుకుంటే నేటి దాక ప్రతి ప్రభుత్వం లో మాదిగలు ప్రాణాలు కోల్పోయారు . ప్రతి ప్రభుత్వం నుండి అక్రమ కేసులు ఎదుర్కున్నారు. సహకరిస్తాం అన్న ప్రతి పార్టీని నమ్మారు. ప్రతీ పార్టీ మోసం చేసింది . చంద్రబాబు గారు పెద్ద మాదిగ అవుతానని మేలు చేయకపోగా కురుక్షేత్రం సభ సందర్భంగా ఆంధ్రా లో మాదిగలను నిర్దాక్షిణ్యంగా అణచివేసే ప్రయత్నం చేసారు.ఈ సుదీర్ఘ ఉద్యమంలో మాదిగ దండోరా వర్గీకరణ ను తాత్కాలికంగా సాధిస్తే , మిగతా సమాజం కోసం చేసిన పోరాటాలలో అన్నిటిని శాశ్వతం చేసింది.. వేల కోట్ల ఖర్చయ్యే సంక్షేమ పధకాలను సాగిస్తున్న ప్రభుత్వాలు , పైసా ఖర్చు లేని వర్గీకరణ బిల్లుని మాత్రం చేయడం లేదంటే అసలు మతలబు ని వర్గీకరణ వ్యతిరేక సంఘాలు గుర్తించాలి.
తాత్కాలిక పరిష్కారానికే రాజ్యం అనే చర్చలు చేసిన దళిత సమాజం , అదే శాశ్వతంగా వర్గీకరణ చట్టబద్ధం చేయబడితే ఈ కులాలలో ఎదిగిన నాయకత్వం రాజ్యం వైపు గురి పెడుతుందని పాలకులకు తెలియదా ! అందుకే ఈ తాత్సారం . వారికి ఊతం వర్గీకరణ వ్యతిరేకత మీద పబ్బం గడుపుకునే సంఘాలు . ఇది అంతర్గతంగా.కానీ బహిరంగంగా మాత్రం పార్టీలు వర్గీకరనకు అనుకూలమే . ఈ దళిత కులాల మధ్య సామరస్య చర్చల పరిష్కారం రానంత కాలం, ఈ నాటకం ఇంకా చానాళ్లు సాగుతుంది. ఇంత సుదీర్ఘ ఉద్యమంలో , ఉద్యమ నాయకత్వాన్ని విమర్శించి వెళ్ళిన వారు లెక్కకు మిక్కిలి . కానీ వారంతా ఎదోక పార్టీలో చేరడం లేదా జన మద్దతు కూడగట్టడం లో విఫలమైనందున వారి కధలన్నీ సమాజం ముందు కనీసం చర్చకు కూడా రాలేదు .మాదిగ ఉద్యమంలో ఎదిగి రాజకీయ అవకాశాలు చేజిక్కించుకున్న వారు కూడా నేడు పాలకుల తొత్తులుగా మారడంతో , మాదిగల చిరకాల కోరిక ఇంకా కలగానే మిగిలిపోయింది .
ఏ రాజకీయ పార్టీకైనా , ఉద్యమ సంస్థకైనా ఎన్నికలే కీలకం . రాజకీయ పార్టీలు నిరంతరం ఓట్ల కోసం తాపత్రయ పడితే ఉద్యమ సంస్థలు సామాజిక అంశాల మీద పోరు చేస్తూ చివరాఖరిలో ఎన్నికల సమరం లో దిగుతాయి . ఎమ్మార్పీయస్ కూడా దీనికి అతీతమేమీ కాదు .
2009 ఎన్నికలు వర్గీకరణ కోల్పోయాక వచ్చిన తొలి ఎన్నికలు .అప్పుడు కాంగ్రెస్ వర్గీకరణ చేయడం ఖాయం అనుకున్న నేపధ్యంలో ఎదురు చూసి చూసి మాదిగ బిడ్డల ప్రాణాలు కూడా కోల్పోయిన దండోరా , అకస్మాత్తుగా రాజకీయం గా పోటీ చేసి అనూహ్య రీతిలో ఓట్లు కూడా సాధించింది. కానీ ఆ ఒరవడిని కొనసాగించడంలో విఫలమైంది . కారణం ఎన్నికలు ముగిసాక మరలా ఎవరైనా పోరాట బాటనే ఎంచుకోవాలి కాబట్టి . 2014 లో చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఆంధ్రాలో , తెలంగాణా ఉద్యమ సెంటిమెంట్ తో ఆ ప్రాంతం లో ఎన్నికల సమరాన్ని తారాస్థాయికి తీసుకేల్లలేకపోయింది.వాస్తవానికి రాజకీయ పార్టీలు చూపే ఆశలో మాదిగ సమాజం పడిపోయింది అని చెప్పాలి . పాలకులు కూడా రేపో మాపో అంటున్నప్పుడు ఆశ ఉన్న ప్రాణాలు ఓట్లు వేయకుండా ఎలా ఉంటాయి . ఈ కారణంతోనే రాష్ట్రం లో, కేంద్రంలో అన్ని పార్టీలు మాదిగలను మోసం చేసాయి బీజేపీతో సహా . మరలా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కూడా. ఇక ఇప్పుడేంటి అన్న ప్రశ్న మాదిగ సమాజం వేసుకోవాలి. వర్గీకరణ అంశం రాజకీయ పార్టీల చర్చలోనే లేకుండా పోయింది . మంద కృష్ణ మాదిగ గారు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం మీద పని చేస్తున్నారు . ముందస్తు ఎన్నికలు అనే చర్చ నడుస్తుంది . మాదిగలింకా స్థబ్డుగానే ఉన్నారు.వర్గీకరణకు రాజకీయ పరిష్కారమే మార్గం. రాజకీయ పక్షాలన్నీ మోసం చేసాయి . ఇప్పుడు మరలా ఆ పక్షాలకే ఒట్లేయడంలో అర్ధం లేదు . అయితే ఏమి చేయాలి . 2014 ఎన్నికల తరువాత దాదాపుగా మాదిగ ఉద్యమం పతనం అనుకుంటున్న నేపధ్యంలో కృష్ణ మాదిగ గారు శాయశక్తులా ప్రయత్నించి మరలా ఉద్యమానికి ఊపిరి పోశారు . సోషల్ మీడియా ద్వారా , సోషల్ మీడియా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఆయన ఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ రోజూ ప్రజలకు సందేశాన్ని చేరవేస్తున్నాడు . ఈ క్రమంలోనే నేటి తరం యువత ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. గతం లో ఉద్యమానికి దూరమైన కార్యకర్తలు ఉద్యోగులు కూడా ఇది చివరి అవకాశం మనకు అన్నట్టు చేదోడు వాదోడు గా నిలిచారు . ఇప్పుడు వీరంతా కోరుకుంటుంది ఒక్కటే .
వర్గీకరణ పై రాజకీయ పక్షాలన్నీ మోసం చేసాయి కాబట్టి కృష్ణ మాదిగ గారు వర్గీకరణ ప్రధాన అంశం గా స్వతంత్ర రాజకీయ శక్తి గా ఉండాలనేది నేటి తరం కోరిక.గతంలో కుల సంఘంగా పోటీ చేసి ఎదురైన చేదు అనుభవాల రీత్యా ఏదోక రాజకీయ పార్టీలో చేరడం మంచిది అనేది కొందరి అభిప్రాయం.సొంత రాజకీయ వేదికగా , పార్టీలతో పొత్తుల్లో సీట్లు అడగాలనేది రాజకీయం తెలిసిన మెజారిటీ అభిప్రాయం .
అయితే కృష్ణ మాదిగ ఇటీవల మీటింగుల్లో తరచూ రాజకీయ శక్తిగా మారాలి అని చేస్తున్న ప్రసంగాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టం నిర్వీర్యం అవుతున్న నేపధ్యంలో ఈ చట్టం కాపాడుకోవడం లో భాగంగా జూన్ 10 న వరంగల్ లో దళిత గిరిజన సింహగర్జన నిర్వహించిన కృష్ణ మాదిగ గారు , ఈ నెల 25 డిల్లీలో దీనికి కొనసాగింపుగా మరో సింహగర్జన చేపట్టబోతున్నారు.దళిత గిరిజన సింహగర్జన ద్వారా ఎప్పటినుండో విడివిడిగా ఉన్న మాల మాదిగలను . ఆదీవాసీ లంబాడీలను ఇతర దళిత గిరిజన కులాలను ఒక్క తాటికి చేర్చిన కృష్ణ మాదిగ గారు రాజకీయం నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న చర్చతో పాటు , ఆ మీటింగ్ నిర్వహణలో అత్యధిక భాగం కాంగ్రెస్ శ్రేణులకు ఆహ్వానం పలకడంతో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ఊహాగానాలు కూడా వినిపించాయి.సమాజంలో తిరుగుతున్న వ్యక్తుల మీద , వారి పనుల మీద ఊహాగానాలు సహజం . అయితే వీటికి కాలమే సమాధానం చెబుతుంది.దళిత గిరిజన సింహగర్జన ద్వారా మాలలను కూడా వర్గీకరణ వైపు నడిపించే మార్గం పడుతుంది అనుకున్న నేపధ్యం. కానీ అటువంటి సూచనలు తెలంగాణా నుండి తప్ప ఆంధ్రా నుండి కనబడటం లేదు .
పైగా ఉన్న విమర్శలకు ఆజ్యం పోస్తున్నారు వర్గీకరణ వ్యతిరేకించే సంఘాలపై ఆధారపడి జీవించే వారు . వారికి వర్గీకరణ పరిష్కారం ఇష్టమే లేదు.
ఇంకోవైపు కాలం కరిగిపోతుంది .
మాదిగ సమాజం అధినాయకత్వం నుండి ఏమి నిర్ణయం రాబోతుందో అని ఆలోచిస్తుంది .
రాజకీయ నిర్ణయం కోసం ఊవిళ్లురుతుంది.ఇన్నాళ్లు చేసిన ఆలస్యం ఇంకోసారి జరగకూడదని కోరుకుంటుంది .
త్వరగా నిర్ణయమోస్తేనే కాడి మోసే వాడిని, కాడి వదిలేసే వాడిని వేరు చెయ్యొచ్చు. అప్పుడే పోరాటం సులువవుతుంది, ఎందుకంటే ఎమ్మార్పీయస్ పేరు మీద రాజకీయ పార్టీలకోసం, పని చేస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు .
స్వతంత్ర రాజకీయ వేదిక గా మారకున్న, ఆ స్వతంత్ర రాజకీయ వేదిక కి ఓట్లుగా మారకున్నా మాదిగలు శాశ్వత ఓటమికి అంగీకరిస్తున్నట్టే.
నిర్ణయం ఆలస్యమయ్యే కొద్దీ ఆశలు కరిగిపోతాయి , ఓట్లు తరిగిపోతాయనేది స్పష్టం .
మాదిగలకు ఈ సమయం ఎంతో ప్రత్యేకం .
వర్గీకరణ కు మార్గం సూచించిన ఉషా మెహర కమీషన్ వచ్చి పదేళ్ళయిన సందర్భం .
మాదిగలను ఊతకోచ కోసిన కారంచేడు జరిగిన సందర్భం,మాదిగలకు ప్రాణం పోసిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పురుడు పోసుకొని 25 వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భం .
పార్టీలన్నీ మోసం చేసి మాదిగలు కసిగా ఉన్న సందర్భం.ఇదే అనుకూల సమయం రాజకీయ నిర్ణయాలకు.దండోరా సమాజంలోనే కాదు చట్ట సభల్లోనూ మోగాలి. ఇప్పుడు మాదిగలంతా ఓట్లుగా పోటెత్తాలి. ఓట్ల ఉప్పెనవ్వాలి. ఇదే ఈ ఇరవై ఐదేళ్ళ ఉద్యమం లో అత్యంత కీలక ఘట్టం.
ఆఖరి ఘట్టం .
బెజ్జంకి అనిల్ మాదిగ.