పాలనలో వైఫల్యం. ‘ముందస్తు’ నాటకం.

  • కేసీఆర్ చేతకాని సి.ఎం.
    ప్రగతిభవన్ గడీ బద్దలు కొట్టడం ఖాయం.
    – కోదండరాంతో ‘ తెలంగాణ కమాండ్ డాట్ కామ్’ ప్రత్యేక ఇంటర్వ్యూ .

ప్రశ్న; ప్రగతిభవన్ గడీ ని పగులగొట్టే పని ఎంతవరకు వచ్చింది?
జవాబు; అప్రజాస్వామిక, నియంత పాలనకు చిహ్నమైన ప్రగతిభవన్ ‘గడీ’ ని బద్దలు కొట్టడం ఖాయం. ఆ రోజులు సమీపిస్తున్నవి. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ పరిపాలన నడుస్తున్నది. తెలంగాణ పౌర సమాజమంతా మా వైపే ఉంది. మా బలమేంటో చూపిస్తాం.ప్రజలు పెద్దఎత్తున కదిలినప్పుడు అది కార్యరూపం దాల్చక తప్పదు. ఆ దిశగా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలు బతకలేని పరిస్థితులు ఏర్పడినవి. రాష్ట్రాన్ని గందరగోళంలో కేసీఆర్ పడేశారు.

ప్రశ్న ; టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎవరు?
జవాబు ; ప్రజలే టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారుతున్నారు. ఆ మార్పు మాకు కనిపిస్తున్నది. ప్రజల మద్దతు ఉన్న తెలంగాణ జన సమితి టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుంది.

ప్రశ్న; కోదండరాం పనైపోయిందని అంటున్నారు. ‘టీజెఎస్’ పట్ల స్పందన లేదంటున్నారు.
జవాబు; ఇది దుష్ప్రచారం. వాస్తవం వేరు. ప్రధానస్రవంతి రాజకీయాలను చూసే దృక్కోణం వల్ల ఇలాంటి అనుమానాలు రావచ్చు. మా పంథా వేరు. ప్రజల్ని కూడగడుతున్నాం. చాపకింద నీరు వలె మా పార్టీ ప్రజల్లోకి వెళుతున్నది. ఇతర రాజకీయపార్టీల లాగా హంగూ, ఆర్భాటం మేము చేయడం లేదు. అలాంటి అవసరం కూడా లేదు.

ప్రశ్న; ముందస్తు ఎన్నికలు వస్తాయంటున్నారు. టిజెఎస్ అందుకు సిద్ధంగా ఉందా?
జవాబు; ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైంది. పరిపాలించడం చేత కాకపోవడంతో ‘ముందస్తు’ ఎన్నికల పేరిట ప్రజల దృష్టి మళ్లించే నాటకం ఇది. ముందస్తు వ్యవహారం పూర్తిగా పాలకుల బలహీనతలు, అసమర్ధత నుంచి వచ్చిన ఆక్రందన. గ్రామపంచాయతీ ఎన్నికలు జరిపితే మా ప్రిపరేషన్ బయటపడుతుంది. తమ సమస్యల కోసం గట్టిగా పోరాడే రాజకీయశక్తి గా టిజెఎస్ అవతరించినట్టు ప్రజలు భావిస్తున్నారు. మా నిబద్ధతను నమ్ముతున్నారు. ఎన్నికలు ముందస్తు వచ్చినా, రాకపోయినా టిఆర్ఎస్ చిత్తు కావడం తథ్యం.

ప్రశ్న; మీ పార్టీ నిర్మాణమే ఇంకా పూర్తి కాలేదు.
జవాబు ; ప్రజా సమస్యల అధ్యయనం, వాటి పరిష్కారానికి చేపట్టవలసిన కార్యాచరణ, పార్టీ నిర్మాణం… మూడూ సమాంతరంగా కొనసాగుతున్నవి. కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో నిజానికి ఏ పార్టీకి పునాదులు లేవు. కొందరు వ్యక్తులో , కొంత పరపతి కలిగిన మనుషులో ఆయా రాజకీయపక్షాల ప్రతినిధులుగా చెలామణి అవుతుండవచ్చు. అంతే. మా పార్టీ ఒక డెడ్ లైను తో వెడుతున్నది. జూలై 30 కల్లా గ్రామస్థాయిలో నిర్మాణాన్ని పటిష్టం చేస్తున్నాం.

ప్రశ్న; టిజెఎస్ కు ఎక్కువగా ఏ వర్గాల నుంచి స్పందన కనిపిస్తున్నది?
జవాబు ; అన్ని వర్గాల నుంచి మంచి స్పందన ఉంది. ముఖ్యంగా 30 సంవత్సరాలలోపు యువత, నిరుద్యోగులు, చదుకున్నవారు జనసమితికి మద్దతుగా నిలబడుతున్నారు.హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి చోట్ల ముఖ్యమైన కార్యకర్తల శిక్షణ శిబిరాలు నిర్వహించాం. గ్రామ, మండల స్థాయిలో టిజెఎస్ అనూహ్యంగా బలపడుతున్నది. ఇది కంటికి కనిపించదు. ఒక్క రోజులో ఏదీ జరగదు. గ్రౌండ్ వర్క్ పకడ్బందీగా జరపవలసి ఉంటుంది.

ప్రశ్న ; ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు కదా?
జవాబు ; ప్రభుత్వం, ప్రభుత్వ భజనపరులు అలాగే చెబుతారు. మీరు వెళ్లి చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో,ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్ధమవుతుంది. అవినీతి పెరిగిపోయింది. ఎక్కడికక్కడ ‘మాఫియా’ ముఠాలు తయారైనవి. అధికారపార్టీ ఆయా ముఠాలకు అండగా ఉంటోంది.

ప్రశ్న; రైతుబంధు, రైతుబీమా సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ చేపట్టారు.అవేమీ టిఆర్ఎస్ కు సానుకూల వాతావరణం తీసుకు రాలేదా?
జవాబు ; ప్రభుత్వం చేపట్టిన, అమలుచేస్తున్న పథకాలన్నీ నీరు గారాయి. ఏ పథకంపైన కూడా ప్రజల్లో సంతృప్తి లేదు. ప్రభుత్వం పట్ల సానుకూలత లేదు. చిన్న, సన్నకారు, కౌలు రైతులకోసం ఈ ప్రభుత్వం ఏమి చేసింది.సంక్షేమకార్యక్రమాలకు సంబంధించి జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. గతంలో ఏ ప్రభుత్వమూ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం పేరుతో అడ్వర్టయిజ్మెంట్ల కోసం ఇంత భారీగా ఖర్చు చేయలేదు.

ప్రశ్న ; ఏ ప్రభుత్వమూ చేయని భూ రికార్డుల ప్రక్షాళన జరగలేద ? అది రైతుల మేలు కోసమే కదా.
జవాబు; దాదాపు 75 నుంచి 80 శాతం రికార్డులు గల్లంతైనవి. గ్రామీణ వాతావరణంమంతా చిన్నాభిన్నం చేశారు. మండల ఆఫీసుల్లో సిబ్బంది లేరు. చాలా చోట్ల తక్కువ మంది పనిచేస్తున్నారు. భూముల రికార్డులలో జరిగిన అవకతవకలను సరిదిద్దడానికి కనీసం ఇరవై ఏళ్ళు పట్టినా ఆశ్చర్యపోనక్కర లేదు. ప్రక్షాళన పేరిట మరింత ‘చిక్కుముడి’ గా మార్చిన ఘనత ప్రస్తుత పాలకులదే.

ప్రశ్న; గ్రామాల్లో కేసీఆర్ పాలనకు రైతాంగం హారతులు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
జవాబు ; రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. తమ భూములు రికార్డుల్లో గల్లంతయినందుకు కోపంగా ఉన్నారు. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో మీరే చెప్పాలి. తెలంగాణ రైతాంగం అస్తిత్వం ప్రమాదంలో పడింది. రైతుల అస్థిత్వాన్ని కాపాడవలసిన బాధ్యత మాపై ఉన్నది. రైతులు అప్పుల పాలైపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులలో మార్పు కావాలి.

ప్రశ్న; టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏయే రాజకీయపార్టీలు కూటమిగా ఏర్పడవచ్చు.
జవాబు ; మేం ఒంటరిగానే పోటీ చేయబోతున్నాం. అయితే ప్రజాసమస్యలపై కలిసి పని చేయడం లో మాకు అభ్యంతరం లేదు.రైతుల సమస్యలపై, భూమి హక్కుల రక్షణకు సంబంధించి కాంగ్రెస్ తదితర పార్టీలతో ఐక్య కార్యాచరణ కోసం ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించాలనుకుంటున్నాం.

ప్రశ్న; మీ పార్టీ ఎజండా ఏమిటి?
జవాబు; త్వరలోనే ప్రకటిస్తాం. సమగ్రంగా రూపుదిద్దబోతున్నాం. రైతాంగాన్ని బతికించే వ్యవసాయ విధానం తెలంగాణాకు కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వృత్తులను కాపాడుకోవాలి. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. విద్య, వైద్యం ప్రజలందరికీ ఉచితంగా అందాలి. ముఖ్యంగా 2. 50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించవలసి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 22 వేలమందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. టిఎస్పిఎస్సి, ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, పరీక్షలు, నియామకాలు…. దేనికీ లెక్కలలో పొంతన కుదరవు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి ఒక ప్రణాళిక, దానికి కమిట్ మెంటు అవసరం.

ప్రశ్న; కొన్ని జిల్లాల్లో మళ్ళీ భూస్వామ్య వాతావరణం నెలకొంటున్నదనే విమర్శలకు మీ స్పందన?
జవాబు ; భూస్వామ్య ధోరణులు మళ్ళీ మొగ్గ తడుగుతున్న మాట నిజం. కొన్ని ప్రాంతాల్లో అవి బలంగానూ కనిపిస్తున్నవి. అయితే ఫ్యూడల్ వ్యవస్థ పునరుద్ధరణ జరిగిందని అనలేం. భూముల పరాయీకరణ జరుగుతున్నది. కండబలం ఉన్నవాడికే అధికారపార్టీ వత్తాసు పలుకుతున్నది. చాలా చోట్ల అధికారపార్టీ నాయకుల అండ దండలతో భూ కబ్జాలు జరుగుతున్నట్టు సమాచారం ఉన్నది.