పిట్ట కనుగుడ్డును చూసిన కెసిఆర్.

ఎస్.కె.జకీర్.

ఆయన నినాదం ‘జై తెలంగాణ నుంచి జై భారత్‌’కు మారింది. వేల కోట్లతో చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నిస్సందేహంగా పటిష్టమైన ఓటుబ్యాంకు గా మారగలదని  కెసిఆర్ మనసా వాచా నమ్ముతున్నారు.

‘చెట్టు కనిపిస్తోందా’ ? అని ఆర్జునుడిని  ద్రోణాచార్యుడు అడుగుతాడు. కనిపించడం లేదని అర్జునుడు జవాబిస్తాడు. ‘కొమ్మ కనిపిస్తోందా’ ? అంటాడు ద్రోణాచార్యుడు. లేదని అర్జునుడి జవాబు.’రెమ్మ కనిపిస్తోందా’ ? ‘ పిట్ట కనిపిస్తోందా’ ?అని ఆయన మళ్ళీ , మళ్ళీ, పదే పదే అడుగుతాడు.’ లేదు’, ’లేదు’, ‘లేదు’ అని అర్జునుడు జవాబిస్తాడు.అయితే చివరగా, కొసమెరుపుగా ‘పిట్ట కనుగుడ్డు మాత్రమే కన్పిస్తున్నద’ని  అర్జునుడు అంటాడు.అర్జునుడికి చెట్టు,కొమ్మ,రెమ్మ, చివరికి పిట్ట  ఏదీ కనిపించలేదు.కానీ పిట్ట కనుగుడ్డు మాత్రమే కనిపించింది.కెసిఆర్ కూడా అంతే. తెలంగాణాలోని ఓటర్లు మాత్రమె కనిపిస్తున్నారు.అలాగే జాతీయ రాజకీయాల్లో ‘ఖాళీ’ ఆయనకు కనిపించింది.దాన్నెలా పూరించాలన్న అంశంపైనే  కెసిఆర్ మేధోమథనం చేస్తున్నారు.ఆయనకు జాతీయ రాజకీయాల్లో  ‘పిట్ట కనుగుడ్డు ‘ మాత్రమె కన్పిస్తున్నది.

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్  తెలివైన నేత. మంచి భాష, తెలంగాణ మాండలికం నిండిన యాసతో జనాన్ని ముగ్ధుల్ని చేయగల మాటల మాంత్రికుడు. రాజకీయ వ్యూహరచనా దురంధరుడు. ఎన్నిసార్లు దెబ్బతిన్నా, సహజ సిద్ధమైన నేర్పరితనంతో మళ్లీ లేచి నిలబడగలిగిన సమర్థుడు. అందువల్లే తెలంగాణవాదాన్ని కేసీఆర్‌ గతంలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో  సుదీర్ఘ కాలం ఒడిసిపట్టుకొని ప్రత్యెక తెలంగాణా రాష్ట్రాన్ని సాధించారు. ‘ప్రజాస్వామ్యంలో రా

జకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షిస్తాయన్న సీఎం ఓట్లను ఆకర్షించడమే రాజకీయ పార్టీల పని . అన్ని రాజకీయ పార్టీలు చేసేది అదే పని. ఓట్లు ఆకర్షించపోతే రాజకీయ పార్టీ ఎందుకు’  అని ఆయన  అసెంబ్లీ సాక్షిగా అన్నారు. ఈ దేశాన్ని సాకే 7 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి అని ఆయన స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో సెంటిమెంట్‌ పూర్తిగా ‘వర్కవుట్‌’  కానందున  టిఆర్‌ఎస్‌కి ఏకపక్ష విజయం దక్కలేదు.కనుక  విపక్షాల్ని నిర్వీర్యం చేయడంలో ఆయన  సక్సెస్ అయ్యారు. రాజకీయాల్లోనూ అదృష్టం ఎప్పుడూ ఏకపక్షంగా ఉండదని కెసిఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అతి సంక్లిష్టమైన అన్ని అంశాలతో ఏకకాలంలో గేమ్‌ ఆడడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైన క్రీడ. తెలంగాణవాదంతో, మిత్రపక్షాలతో, మీడియాతో ఒకేసమయంలో ఆటాడగలరు. ‘రోజు మొత్తంలో కేసీఆర్‌ గంటసేపు మాత్రమే ఆలోచిస్తారు. మిగతా నాయకుల వలె  రోజంతా ఆలోచిస్తే పరిస్థితి ఇంకెట్లా ఉండేదో!’  అన్న అభిప్రాయం ఉన్నది. విద్యావంతులు, మేధావులు 2001 కి ముందు సమాంతర తెలంగాణ ఉద్యమానికి పెద్దఎత్తున రంగం సిద్ధం చేశారు. ఈ తరుణంలో తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకొని బయటకు వచ్చిన కేసీఆర్‌, 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించి తెలంగాణవాదాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. క్రమంగా దాన్నొక రాజకీయ ఉద్యమ స్థాయికి తీసుకువెళ్లారు. తెలంగాణకు ఆయనే పర్యాయపదంగా నిలిచారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ వ్యవహారశైలిలో గుణాత్మక మార్పు కనిపిస్తున్నది.ఆయన తప్పులను ఎండగట్టే, ఎత్తిచూపే బలమైన ప్రత్యామ్నాయ శక్తులు కరవయ్యాయి. కాలం తనదైనపుడు చంద్రబాబు కూడా ప్రస్తుతం కేసీఆర్‌లాగే ఎంతో అహంకార పూరితంగా వ్యవహరించి సహచర పార్టీలను దారుణంగా అవమానించారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదన్న సాంకేతిక కారణంతో జాతీయ పార్టీ అయిన సీపీఐని అఖిలపక్ష సమావేశాలకు పిలవలేదు. నాటి చంద్రబాబులాగే నేడు కేసీఆర్‌ కూడా చెలరేగిపోతున్నారు. తాను ఫెడరల్  ఫ్రంట్ అని ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటున్నారు. ఆయన నినాదం ‘జై తెలంగాణ నుంచి జై భారత్‌’కు మారింది.వేల కోట్లతో చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నిసందేహంగా పటిష్టమైన ఓటుబ్యాంకు గా మారగలదని  కెసిఆర్ మనసా వాచా నమ్ముతున్నారు.