పీసీసీ చీఫ్ పదవినివ్వండి. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తా – కోమటిరెడ్డి.

నల్లగొండ;
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తనకు అప్పగిస్తే పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని శాసనసభ్యుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని కూడా అన్నారు. జీవితాంతం పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. పార్టీ ఎక్కడ పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానని, పార్లమెంటుకు పోటీ చేయడానికి సైతం సిద్ధమని ఆయన అన్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తామంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. కేసీఆర్ ను గద్దె దింపాడమే తన లక్ష్యమని అయన శపథం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని సీట్లు కాంగ్రెసవేనని కోమటిరెడ్డి చెప్పారు. చైతన్యానికి మారుపేరైన నల్లగొండలో కేసీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేసినా ఓటమి తప్పదన్నారు. భువనగిరి, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపవలసిన అవసరం ఉందన్నారు.