పుస్తకాల గురించి వరవరరావు!

N.Venugopal:

మిత్రులారా, గత ఏడునెలల ఒక వారం రోజులుగా, యరవాడ జైలులో వరవరరావు గారు విపరీతంగా చదువుతున్నారు. బైట ఉన్నప్పుడు ఉండిన విస్తారమైన సామాజిక సంబంధాలు, ప్రతిరోజూ ఎందరెందరో కలవడం లేని ప్రస్తుత స్థితిలో పుస్తకాలే ఆయన సహచరులు. బైట ఉన్నప్పుడు కూడ ఆయనకు విశాలమైన పఠన, అధ్యయన ఆసక్తులుండేవి గాని అప్పుడు సమయం దొరికేది కాదు. జైలులో ఎక్కువగా చదువుతున్నారు గాని ఒక సమస్య ఏమంటే అక్కడి సెన్సార్ అధికారులకు మరాఠీ, ఇంగ్లిష్ మాత్రమే వచ్చుగనుక ఆయన ఇంగ్లిష్ పుస్తకాలు చదవడానికి మాత్రమే అనుమతి ఉంది. చివరికి ఉత్తరాలు కూడ ఇంగ్లిష్ లోనే రాయవలసి ఉంటుంది. తెలుగు చదువూ రాతా నిషేధం. తన ప్రస్తుత పుస్తక పఠనం గురించి ఆయన తాజా ఉత్తరంలో రాసిన నాలుగు మాటలు మీతో పంచుకోవాలని అనిపించింది.
“… నాలుగురోజులుగా ఉత్తరం కోసం ఎదురుచూస్తుండగా, నిన్ననే ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం నిండా నిరాశ, నిస్పృహ, నిస్సహాయత. ఫలితాలు వెలువడి రెండువారాల తర్వాత కూడ. కాని నేనో, వార్తాపత్రికల్లో, పుస్తకాల్లో నిండా మునిగి ఉన్నాను. చదవడానికి ఏది దొరికితే అది, ఏది నాకందితే అది చదువుతున్నాను. ఆసక్తితో, ఉత్కంఠతో చదువుతున్నాను. పుస్తకాలే, పుస్తకాలే, పుస్తకాలే చదవాలన్న ఈ దాహాన్ని తీర్చుకోవడానికి మరింత సుదీర్ఘకాలం జీవించాలన్న ఆర్తి, తపన కలుగుతున్నాయి. ఏ కొత్త స్థలానికి వెళ్లినా అక్కడ పుస్తకాల దుకాణం కోసం వెతుకుతానని రాసావు గదా, పుస్తకాల కోసం అంతగా ఎందుకు వెంపరలాడతావో నాకిప్పుడు అర్థమవుతున్నది. 1985-89 కాలంలో జైలు జీవితంలో నా అనుభవమూ అదే. కాని ఒకసారి విడుదలై బైటికి వచ్చానా, చదవడానికి సమయమే దొరకలేదు. జైలులో ఉన్నప్పుడు ఎట్లా పొద్దు పోయేదని చలసాని అడిగినప్పుడు పుస్తకాలే నా సహచరులు అని చెప్పాను. ‘జీవం లేని పుస్తకాలు మనుషులకు ప్రత్యామ్నాయం కాగలవా, మనుషులు లేని లోటు తీర్చగలవా’ అని చలసాని ప్రశ్నించాడు. నిజమే, ఆప్తుల, ఆత్మీయుల కౌగిలింతనూ, చిరునవ్వునూ, మాటనూ ఒక పుస్తకం స్పర్శ, అది ఎంత కొత్త పుస్తకమైనా కానీ, ఇవ్వగలదా? అనుమానమే….”