‘పూజ’కు పనికిరాని ‘పూలు’!!

ఐఏఎస్ అయిన ప్రతి ఒక్కరూ జిల్లా కలెక్టర్ గా పనిచేయాలన్న కోరిక ఉంటుందని,కానీ ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులను బట్టి ఆ కోరిక తీరకుండానే ‘అప్రాధాన్య’ పోస్టులోనే పదవీ విరమణ చేయవలసి రావచ్చునని కొందరు ఐ.ఏ.ఎస్ లు అంటున్నారు. సీనియారిటీ, అనుభవం ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్న ‘కొందరి’ వల్ల అనుభవం లేకపోయినా ఒక ‘సామాజిక వర్గానికి’ ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఎస్.సి, ఎస్.టిఐ.ఏ.ఎస్. లు ఆరోపిస్తున్నారు.ముఖ్యంగా పదవీ విరమణ పొందిన తర్వాత ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న సీనియర్ ఐ.ఏ.ఎస్.అధికారి ఒకరు పోస్టింగులలో ‘చక్రం’ తిప్పడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ప్రాధాన్యం’ ఉన్న శాఖల్లో ముఖ్యమైన పోస్టులలో అగ్రకుల ‘సామాజిక వర్గానికే ‘ పెద్దపీట వేస్తున్నట్టు సమావేశంలో చర్చకు వచ్చింది.

  • ఎస్.సి,ఎస్.టిఐ.ఏ.ఎస్. లలోఅసంతృప్తి జ్వాలలు.
  • హైదరాబాద్ హోటల్ లో రహస్య సమావేశం.
  • అప్రాధాన్య పోస్టింగులపై నిరసన.
  • ముందుగా చీఫ్సెక్రెటరీకినివేదన.
  • సి.ఎం.కేసీఆర్ లేదా కేటీఆర్లను కలవాలని నిర్ణయం.

ఎస్.కె.జకీర్.

ఏళ్ల తరబడి ‘లూప్ లైను’ పోస్టులలో తాము మగ్గిపోవలసిందేనా? అనిఎస్.సి,ఎస్.టి. ఐ.ఏ.ఎస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమకు న్యాయం జరగకపోగా ‘వివక్ష’ మరింత పెరిగిపోవడం పట్ల వారు ఆసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ సాధక,బాధలపై చర్చించుకోవడానికి ఆదివారం నాడు హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై వారు చర్చించారు. ముందుగా తమ ఆవేదనను ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.జోషీ దృష్టికి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్, లేదా మంత్రి కేటీఆర్ తో సమావేశమై తమకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దాలని కోరేందుకు నిర్ణయించుకున్నారు.దళితులు,మైనారిటీలతో పాటు కొందరు బిసి ఐ.ఏ.ఎస్ అధికారులకు కూడా పోస్టింగులలో అన్యాయం జరుగుతున్నట్టు ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. గత నాలుగేళ్లుగా జరుగుతున్న పరిణామాలు తమను కలవరపెడుతున్నట్టు చెబుతున్నారు.ఇక తమ సహనం నశించిందని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లక తప్పదన్న నిర్ధారణకు వచ్చారు. ఎస్.సి, ఎస్.టి.ఐ.ఏ.ఎస్. అధికారుల సమావేశం ప్రభుత్వంలో ప్రకంపనలు పుట్టించే అవకాశాలు ఉన్నవి.ఒక హోటల్ లో రహస్యంగా జరిగిన ఈ సమావేశం గురించిన సమాచారం ఆలస్యంగా అందుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి వివరాలకోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఐఏఎస్ అయిన ప్రతి ఒక్కరూ జిల్లా కలెక్టర్ గా పనిచేయాలన్న కోరిక ఉంటుందని,కానీ ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులను బట్టి ఆ కోరిక తీరకుండానే ‘అప్రాధాన్య’ పోస్టులోనే పదవీ విరమణ చేయవలసి రావచ్చునని కొందరు ఐ.ఏ.ఎస్ లు అంటున్నారు. సీనియారిటీ, అనుభవం ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్న ‘కొందరి’ వల్ల అనుభవం లేకపోయినా ఒక ‘సామాజిక వర్గానికి’ ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఎస్.సి, ఎస్.టిఐ.ఏ.ఎస్. లు ఆరోపిస్తున్నారు.ముఖ్యంగా పదవీ విరమణ పొందిన తర్వాత ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న సీనియర్ ఐ.ఏ.ఎస్.అధికారి ఒకరు పోస్టింగులలో ‘చక్రం’ తిప్పడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ప్రాధాన్యం’ ఉన్న శాఖల్లో ముఖ్యమైన పోస్టులలో అగ్రకుల ‘సామాజిక వర్గానికే ‘ పెద్దపీట వేస్తున్నట్టు సమావేశంలో చర్చకు వచ్చింది. చిన్న, చిన్న పొరపాట్లు, తప్పులకు దళితులు, ఎస్.టి. ఐ.ఏ.ఎస్ అధికారులను ‘బలి’ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. అగ్రకులాలు, ముఖ్యంగా ‘ఒక సామాజిక’ వర్గం ఐ.ఏ. ఎస్. లు పెద్ద, పెద్ద తప్పులు చేసినా వారిని ‘క్షమించి’ మంచి పోస్టింగులు ఇవ్వడంలో వివక్ష స్పష్టంగా కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. ఐ.ఏ.ఎస్.పోస్టు అవసరం లేని చోట కూడా ‘ఉద్దేశపూర్వకంగా’ ఎస్.టి,ఎస్.సి. అధికారులను నియమించడాన్ని వారు తప్పుబడుతున్నారు. సీనియర్ ఐ.ఏ.ఎస్.అధికారి, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ హోదాలో ఉన్న బి.ఆర్.మీనా ను ఎస్.సి.కమిషన్ కు కార్యదర్శిగా నియమించడాన్ని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ లో బాల మాయాదేవి చీఫ్ రేషనింగ్ అధికారిగా పనిచేస్తున్నారని తెలిపారు.శర్మన్ (ఎస్.టి)ను గత మూడున్నరేళ్లుగా పురపాలక శాఖలో జాయింట్ సెక్రెటరీగా కొనసాగిస్తున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన చంపాలాల్(ఎస్.టి) ను అక్కడి నుంచి తప్పించి హోమ్ శాఖ లో జాయింట్ సెక్రెటరీగా నియమించారని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఆకునూరి మురళి ని ‘పనిష్మెంటు’ కింద పురావస్తు శాఖలో నియమించారని అంటున్నారు. అడవిపంది మాంసం తినడం గురించి మురళి చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయని చెబుతున్నారు. తన కూతుర్నిభూపాలపల్లిప్రభుత్వాస్పత్రి లో ‘కాన్పు’ చేయించడం ద్వారా ఎందరో ఉన్నతాధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి మురళి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేస్తున్నారు. భారతి లక్పతి నాయక్ ను పబ్లిక్ ఎంటర్ ప్రయిజెస్ లో జాయింట్ సెక్రెటరీగా నియమించారని తెలిపారు.కె. యాకూబ్ నాయక్ ను ఉపాధి,శిక్షణ సంస్థ లో డైరెక్టర్ గ నియమించినట్టు చెబుతున్నారు. జిఏడి లో లూప్ లైను పోస్టులో అరవింద్ సింగ్ (మైనారిటీ) ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్టు చెబుతున్నారు. జె.శివకుమార్ (ఎస్.సి.) ప్రణాళికా విభాగంలో పనిచేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం భూసేకరణ వ్యవహారంలో ‘ప్రభుత్వం మాట’ వినలేదన్న సాకుతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలుగు వర్షిణి ని అక్కడి నుంచి తప్పించి వేరే లూప్ లైను పోస్టులో నియమించినట్టు చెబుతున్నారు. కె.కాళీచరణ్(ఎస్.సి.)ను ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గా నియమించినట్టు తెలిపారు.టి.విజయకుమార్ ను విద్యాశాఖలో పోస్టింగ్ ఇచ్చారని చెప్పారు. తెలంగాణా ప్రభుత్వంలో చీఫ్ సెక్రెటరీ గా పనిచేసి రిటైర్ అయి సలహాదారుగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొన్ని పోస్టింగులలో ‘తప్పుదోవ’ పట్టిస్తున్నారన్న ఆరోపణలు దళిత ఐ.ఏ.ఎస్.అధికారుల నుంచి వినిపిస్తున్నవి.అయితే పోస్టింగులలో జరుగుతున్న ‘కులవివక్ష’ కేసీఆర్ నోటీసు లో ఉండకపోవచ్చునని, ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు న్యాయం చేయగలరన్న ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.