పెప్సికో నుంచి వైదొలుగుతున్న ఇంద్రానూయి

ఆహార పదార్థాలు, శీతల పానీయాల దిగ్గజ సంస్థ పెప్సికో సీఈవో పదవి నుంచి ఇంద్రానూయి వైదొలగుతున్నారు. అయితే 2019 ఆరంభం వరకు ఆమె కంపెనీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ప్రెసిడెంట్ రామన్ లాగార్టా అక్టోబర్ 3 నుంచి సీఈవో బాధ్యతలు చేపడతారని పెప్సికో ప్రకటించింది. ఇంద్రానూయి వారసుడిగా లాగార్టాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంపిక చేసినట్టు పెప్సికో తెలిపింది. 12 ఏళ్ల పాటు సీఈవోగా పనిచేసిన ఇంద్రానూయి పెప్సికో వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో కీలకపాత్ర పోషించింది. 24 ఏళ్లపాటు పెప్సికోలో వివిధ హోదాలలో పనిచేసిన ఇంద్రానూయి కంపెనీలో నిర్ణయాత్మక స్థానాన్ని చేరుకొంది. ఇంద్రానూయి వైదొలుగుతున్న ప్రకటనతో పెప్సికో స్టాక్ ధర స్వల్పంగా తగ్గింది.