ఎమ్మెల్యేలతో ఎంపి పొంగులేటికి అస్సలు పొసగడం లేదు. మంత్రి తుమ్కల ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు లో తన సామాజికవర్గాన్ని ఏకం చెయ్యాలని చూడటం, మంత్రికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చెయ్యడం తుమ్మలకు ఆగ్రహం తెప్పిస్త్ఘున్నది. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కు ఎంపి పొంగులేటికి కూడా పొసగడం లేదు. చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగి మంత్రి హవాకు చెక్ పెట్టడంతో ఈ జోడి సక్సెస్ అయ్యింది. కానీ కార్పోరేటర్ల హైదరాబాద్ తరలింపు, మేయర్, కమిషన్ మార్పు సహా మరికొన్ని అంశాల్లో వీరిద్దరిమధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. దీంతో అజయ్ కుమార్, పొంగులేటి ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు.
ఎస్.కె.జకీర్.
వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి అసెంబ్లీ కి గెలుపొంది, కాలం కలిసొస్తే క్యాబినెట్ మంత్రి కావాలని ఆశిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలోచనకు భిన్నంగా లోక్ సభ టికెట్టు ఖాయమైతే కష్టాలు ఎదురయ్యే ప్రమాదం కనబడుతున్నది. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ సారి ప్రతికూల వాతావరణంకనిపిస్తోంది. గత ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిగా గెలిచారు. మరో ముగ్గురిని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించి తిరుగులేని నాయకుడిగా ముద్రవేసుకున్నారు. తర్వాత ఆయన ఫిరాయించిన టీఆర్ఎస్ లో బహునాయకత్వం ఉండటం సమస్యగా మారింది. ఎం.పి వ్యవహార శైలి వివాదస్పదమైంది. పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. కొత్తగూడెం, అశ్యారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర, ఖమ్మం, పాలేరు నియోజికవర్గాలు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో వస్తాయి. అయితే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో ఎంపి పొంగులేటికి అస్సలు పొసగడం లేదని సమాచారం. పాలేరు లో మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ తన సామాజికవర్గాన్ని ఏకం చెయ్యాలని చూడటం, మంత్రికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చెయ్యడం తుమ్మలకు కోపం తెప్పించినట్టు తెలిసింది. దీంతో పొంగులేటి -తుమ్మల మధ్య పెద్ద సఖ్యత లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కు ఎంపి పొంగులేటికి కూడా పడటం లేదని సమాచారం. చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగి… మంత్రి హవాకు చెక్ పెట్టడంతో ఈ జోడి సక్సెస్ అయినట్టు జిల్లా నాయకుల టాక్ . కానీ కార్పోరేటర్ల హైదరాబాద్ తరలింపు, మేయర్, కమిషన్ మార్పు సహా మరికొన్ని అంశాల్లో వీరిద్దరిమధ్య చెడినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో అజయ్ కుమార్, పొంగులేటి ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. వైరా ఎమ్మెల్యే మదన్ లాల్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకరికొకరు ఆప్తులే. నిజానికి పొంగులేటి కృషి, సహాకారం వల్లే మదన్ లాల్ గెలిచారాని జిల్లాలో చెప్పుకుంటారు. అలాంటింది ఇపుడు ఉప్పూ-నిప్పూ అన్నట్టు తయారైంది వ్యవహారం. వైరాలో ఇపుడు టీఆర్ఎస్ రెండు గా చీలిపోయింది. మదన్ లాల్ కు వ్యతిరేకంగా ఎంపి పొంగులేటి క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు. అటు మదన్ లాల్ కూడా ఎంపిని ఢీకునేందుకు తన అనుచరులను రెడీ చేసుకున్నారు. దీంతో వైరాలో టీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతింటోంది. అటు సత్తుపల్లి నియోజివర్గంలోనూ అదే పరిస్థితి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు వేరుగా ఉంటాయి.. ఎంపి వర్గం టీఆర్ఎస్ కార్యాలయాలు వేరుగా ఉంటాయి. ఇందుకు తల్లాడ మెయిన్ సర్కిల్ లో ఎదురెదురుగా ఉన్న ఆఫీసులు మంచి ఉదాహారణగా చెప్పవచ్చు. సత్తుపల్లిలో టీఆర్ఎస్ ఇంచార్జ్ గా పిడిమర్తి రవి కొనసాగుతున్నారు. ఆయన ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ కూడా. కానీ ఎంపి , పిడమర్తికి పెద్దగా సఖ్యత లేదు. కారణంగా గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన తన అనుచరుడు మట్టా దయానంద్ ఎంపి పొంగులేటి ప్రోత్సహించడమేనంటున్నారు. మట్లాకు అండగా ఉంటూ, పిడమర్తి బలాన్ని తగ్గించేందుకు టీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలడానికి ఎంపినే కారణమని అక్కడి నాయకులు చెబుతున్నారు. సత్తుపల్లిలో మరో విషయంలో కూడా ఉన్నది. ఇక్కడ మంత్రి తుమ్మలకు బలమైన క్యాడర్ ఉన్నది. ఆయన మనుషులు కూడా మౌనముద్రలో ఉన్నారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యే గా ఉన్న జలగం వెంటకరావు కూడా ఇక్కడ విపరీమైన పట్టు ఉన్నది. వారి తండ్రి కాలం నుంచి ఉన్న క్యాడర్, అనచురులు కూడా గ్రూపు గందరగోళంలో సైలెంట్ అయ్యారని సమాచారం. రెండు గ్రూపులో బహిరంగ బాహాబాహికి దిగితే , మరో రెండు గ్రూపులు సత్తుపల్లిలో స్థబ్దుగా ఉన్నాయి. కొత్తగూడెం నియోజవర్గంలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. జలగం వెంకట్రావుకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నట్టు ఆయన వర్గం బహాటంగానే విమర్శిస్తున్నారు. ఎంపి పొంగులేటి కూడా అనుచరులును పెంచుకోవడం, ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా సభలు, సమావేశాలు, వింధులు ఏర్పాటు చెయ్యడం వివాదస్పదమైంది. అదొక్కటే కాదు, వచ్చే ఎన్నికల్లో ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యే గా పోటీ చేస్తారని, అది కూడా కొత్తగూడెం నుంచే అని ప్రచారం జరగడం కూడా అక్కడ పార్టీకి నష్టదాయకంగా మారింది. ఇద్దరు నేతల మధ్య మాటలు లేకుండా చేసింది. ఒక అశ్వారావు పేట మినహా ఎంపికి తోడువచ్చే నాయకుడు కనిపించడం లేదు. ఒకవేళ మళ్లీ ఆయన ఖమ్మం ఎంపిగానే పోటీ చేస్తే ఏడు నియోజవర్గాల్లో ఆరింట్లో వ్యతిరేక నాయకులుంటారు. అప్పుడు ఆయా వర్గాలు పరస్పరం సహకరించుకుంటాయా అనేది అనుమానమే. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే మాత్రం అధి పార్టీకి పెద్ద నష్టం తీసుకుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా. ఎంపి ఓడినా, మెజారిటీ అసెంబ్లీలు చే జారినా టీఆర్ఎస్ కు తీవ్ర నష్టం వాటిల్లవచ్చును.