పోటెత్తుతున్న గోదావరి.

భద్రాచలం:
గోదావరి పోటెత్తుతున్నది. ఇరవై నాలుగు గంటల్లోనే నాలుగున్నర అడుగుల ఎత్తునకు నీటిమట్టం పెరిగింది. వరద గోదావరి ఉధృతి అంతకంతకూ పెరుగుతున్నది. మంగళవారం గోదావరి నీటిమట్టం 26 అడుగులు ఉండగా బుధవారం ఉదయానికి 30.6 అడుగులకు నీటి మట్టం పెరిగింది. పొరుగున మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరి పొంగింది. నీటిమట్టం బుధవారం రాత్రికి మరింతగా పెరుగుతుందని అధికారుల అంచనా. వరద ఉధృతి అంచనా ప్రకారం మరో నాలుగు అడుగులు పెరగవచ్చు. తెలంగాణ లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నవి. చిన్న చిన్న చెరువులు కూడా నిండుతున్నాయి. అలుగుల ద్వారా నీరు గోదారికి చేరుతోంది. భారీగా వరద వస్తుండటంతో తాలిపేరు ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.