పౌర‌స‌ర‌ఫ‌రాల వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసిన కేసిఆర్‌. -పొన్నం ప్ర‌భాక‌ర్‌.

హైదరాబాద్:
ఎన్నో రోజులుగా న్యాయ‌మైన డిమాండ్ల సాధ‌న‌కు రేష‌న్ డీల‌ర్లు పోరాటాలు చేస్తున్నా ప్ర‌భుత్వం వారి ప‌ట్ల నిర్ల‌క్ష్య దోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని స‌మ్మె చేస్తామ‌ని వారి నిర‌స‌న హ‌క్కుల‌ను వాడుకుంటే రేష‌న్ షాపులను తొల‌గిస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని, రాష్ట్రంలో ఒక అరాచ‌క పాల‌న సాగుతుంద‌ని టిపిసిసి ఉపాధ్య‌క్షులు పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. శుక్ర‌వారం నాడు గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 17 వేల మంది రేష‌న్ డీల‌ర్లు వారు పేద ప్ర‌జ‌ల‌కు చౌక ధ‌ర‌ల‌కు వ‌స్తువుల‌ను స‌ర‌ఫ‌రా చేస్తు క‌మీష‌న్లు తీసుకొని జీవ‌నం సాగిస్తున్నార‌ని వారి బ‌కాయిలు ఇవ్వాల‌ని, వారికి క‌మీష‌న్లు పెంచాల‌ని డిమాండ్ చేస్తే వాటిని తీర్చ‌క‌పోగా వారిపై వేధింపుల‌కు పాల్ప‌డ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్ర‌బుత్వ హ‌యాంలో 9 నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు అమ్మ హ‌స్తం పేరుతో అందించి పౌర స‌ర‌ఫ‌రాల వ్య‌వ‌స్థ‌ను ఎంతో ప‌టిష్టం చేశామ‌ని, కానీ తెలంగాణ వ‌చ్చిన త‌రువాత అన్ని వస్తువుల‌లో కోత విధించి చివ‌ర‌కు ఒక్క బియ్యం మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేస్తు రేష‌న్ వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. 17 వేల కుటుంబాల‌కు సంబంధించిన అంశాన్ని ముఖ్య‌మంత్రి ఎలాంటి చిత్త‌శుద్దితో తీసుకోవ‌డం లేద‌ని, ఉద్య‌మాలు చేసిన వారి పట్ల తీవ్రంగా స్పందిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఆర్‌టిసి కార్మికులు ఉద్య‌మిస్తే వారిపై కేసులు పెట్టి వేధించార‌ని, ఇప్ప‌డు రేష‌న్ డీల‌ర్ల‌పైనా అలాగే చేస్తున్నార‌ని, రాష్ట్రంలో రేష‌న్ డీల‌ర్లు మొద‌లుకొని జ‌ర్న‌లిస్టుల వ‌ర‌కు అన్ని వ‌ర్గాలు ఉద్య‌మాలు చేస్తున్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అణ‌చివేత‌తో, అప్ర‌జాస్వామ్యంగా ప్ర‌జ‌ల‌పైన ఉక్కుపాదం మోపి పాల‌న సాగిస్తున్నార‌ని, ఆలంపూర్ ఎం.ఎల్‌.ఎ సంప‌త్‌ను కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో గృహ నిర్బంధం చేసి ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న చేయడం రాష్ట్రంలో అణ‌చివేత‌కు ప‌రాకాష్ట అని ఆయన అన్నారు. రేష‌న్ డీల‌ర్లు హ‌క్కుల సాధ‌న కోసం మ‌రో 9 నెల‌లు ఉద్య‌మించాల‌ని త‌రువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అప్ప‌డు రేష‌న్ డీల‌ర్ల న్యాయ‌మైన కోరిక‌లు తీర్చి ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తామ‌ని ఆయ‌న అన్నారు.