ప్రతిపక్షాల గుండెల్లో గుబులు.- ఎంపి క‌విత‌.

జగిత్యాల:
ముఖ్య‌మంత్రి కెసిఆర్ నాయ‌క‌త్వాన్ని మెచ్చిన ఇత‌ర పార్టీల నాయ‌కులు పెద్ద ఎత్తున టిఆర్ఎస్‌లో చేరుతున్నార‌ని, ఈ ప‌రిణామంతో ప్ర‌తిప‌క్షాల నేత‌ల గుండెల్లో గుబులు మొద‌ల‌య్యింద‌న్నారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. సోమ‌వారం జ‌గిత్యాల‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో జ‌గిత్యాల మండ‌లం ధ‌రూర్ గ్రామమంతా టిఆర్ఎస్‌లో చేరింది. అలాగే రాయిక‌ల్ మండ‌లంలోని ప‌లువురు కాంగ్రెస్, టిడిపి నేత‌లు కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, జ‌గిత్యాల మార్కెట్ క‌మిటీ మాజీ ఛైర్మ‌న్ దామోద‌ర్ రావు త‌న అనుచ‌రుల‌తో క‌ల‌సి ఆర్థిక శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, ఎంపి క‌విత స‌మ‌క్షంలో టిఆర్ఎస్ లో చేరారు. అలాగే ధ‌రూర్‌ స‌ర్పంచ్ జ‌ల‌జ‌, సింగిల్ విండో వైస్ చైర్మ‌న్ చొక్కారావు, ఎంపిటిసి సురేంద‌ర్‌, జ‌గిత్యాల ప‌ట్ట‌ణానికి చెందిన డాక్ట‌ర్ పెద్ది మ‌ల్లేశం చంద్రావ‌తి, బండారి న‌రేంద‌ర్, ర‌ఘుప‌తి, చిట్ల ర‌మ‌ణ త‌దిత‌రులు కూడా టిఆర్ ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారంద‌రికీ మంత్రి ఈట‌ల‌, ఎంపి క‌విత గులాబి కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఎంపి క‌విత మాట్లాడుతూ స‌బ్బండ వ‌ర్గాల‌కు సిఎం కెసిఆర్ న్యాయం చేస్తున్నార‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్ నాయ‌క‌త్వంలోనే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు బాగుప‌డ‌తార‌నే భావ‌న అంద‌రిలో నెల‌కొంద‌ని, ఈ నేప‌థ్యంలోనే టిఆర్ఎస్ పార్టీలోకి ఇత‌ర పార్టీలు నేత‌లు చేరుతున్నార‌ని ఎంపి క‌విత వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా టిఆర్ఎస్ పార్టీలో చేరిన నేత‌ల‌ను అభినందించారు.
ఈ కార్య‌క్ర‌మంలో టిఆర్ఎస్ జ‌గిత్యాల నియోజ‌క వ‌ర్గం ఇంఛార్జి డాక్ట‌ర్ సంజ‌య్ కుమార్‌, ఎమ్మెల్సీ నార‌దాసు ల‌క్ష్మ‌ణ్‌, కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగ‌ర్ రావు, రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ రాజేశం గౌడ్‌, మార్క్ ఫెడ్ ఛైర్మ‌న్ లోక బాపురెడ్డి, మైనార్టీ నాయ‌కులు అఫ్స‌ర్‌, టిఆర్ఎస్ నాయ‌కులు బోగ వెంక‌టేశ్వ‌ర్లు, జిల్లా గ్రంథాల‌య సంస్థ అధ్య‌క్షులు చంద్ర‌శేఖ‌ర్ రావు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.