ప్రభుత్వాస్పత్రులపై పెరిగిన నమ్మకం -మంత్రి లక్షమారెడ్డి.

హైదరాబాద్:
ప్రభుత్వ డెంటల్ కాలేజీలో నియమితులైన 20 మంది డాక్టర్లు మంత్రి డాక్టర్ లక్ష్మరెడ్డి ని కలిశారు. ఈ మధ్యే ప్రభుత్వ డెంటల్ కాలేజీకి 20 మంది డెంటల్ డాక్టర్లు నియమితులయ్యారు. డెంటల్ డాక్టర్ల తో కొద్దిసేపు మంత్రి మాట్లాడారు. డాక్టర్లుగా సేవలు అందిస్తూ, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ వైద్యులుగా అవకాశం రావడం అదృష్టమని అన్నారు. ప్రజాసేవకు మంచి అవకాశం ప్రభుత్వ ఉద్యోగం అని మంత్రి చెప్పారు. డాక్టర్లని ప్రజలు ప్రత్యక్ష దైవంగా చూస్తారని గుర్తు చేశారు.
అందుకు తగ్గట్లుగా వాళ్ళకి వైద్య సేవలు అందించి డాక్టర్లు, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సర్కార్ దవాఖానాల్లో వైద్య సదుపాయాలు పెంచిందన్నారు. ఆధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. 10 వేల మంది డాక్టర్లు, సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఆయా నియామకాల ప్రక్రియలు వివిధ స్థాయిల్లో ఉన్నాయని చెప్పారు. త్వరలోనే అన్ని నియామకాలు పూర్తి అవుతాయన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో మందుల కొరత లేకుండా చేశామని చెప్పారు. అదనంగా శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ సర్వీస్ కేర్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రయివేటు కు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను తీర్చిదిద్దుతున్నామని వైద్య, ఆరోగ్య మంత్రి వివరించారు. icu లు, సింగల్ used ఫిల్టర్ల డియాలసిస్ సెంటర్స్ పెట్టామని తెలిపారు. అనేక దవాఖానాలను అప్గ్రేడ్ చేశామని అన్నారు. కేసీఆర్ కిట్ల ప్రారంభంతో రాష్ట్రం మొత్తంలో జరిగే ప్రసూతిల్లో 50 శాతం సర్కార్ దవాఖానాల్లోనే జరుగుతున్నాయని తెలియజేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా గర్భిణీలు, బాలింతలకు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానాల మీద ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. సర్కార్ హాస్పిటల్స్ కి ఓపి, ఐపీ లు పెరిగాయన్నారు.
సర్కార్ దవాఖానాల కు పెరుగుతున్న డిమాండ్ల కు అనుగుణంగా డాక్టర్లు, సిబ్బంది పని చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలని డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ప్రతిష్ట, డాక్టర్ల విలువలు పెంచేలా పని చేస్తామని డెంటల్ డాక్టర్లు మంత్రికి హామీ ఇచ్చారు. వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్, తదితరులు ఉన్నారు.