‘బతుకమ్మ’ దాకా ‘విస్తరణ’ లేనట్టే !!

by zakeer.sk :

తెలంగాణ మంత్రి మండలి విస్తరణ ఈ నెలాఖరులో జరగవచ్చు.లేదా ఒక వేళ ఏవైనా కారణాలతో జూన్ దాటితే, వాయిదా పడితే దసరా వరకు ఇక ‘విస్తరణ ‘ లేనట్లే.జూన్ 28,29,30 తేదీలలో ‘విస్తరణ’కు ముహుర్తాలు చూస్తున్నారని ఒక ప్రచారం ఉన్నది . మంచిరోజులు,శుభ ముహూర్తాలు గడచిపోతే దసరా పండుగ వరకు ‘విస్తరణ ‘ ఉండకపోవచ్చునని ఖచ్చితంగా తెలుస్తున్నది. ప్రస్తుతం మంచిరోజులు కొనసాగుతున్నందున ఈ నెల 27 లోగా పలు శుభకార్యాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారు. 27 లోగా ఉద్యోగ సంఘాల సమస్యలకు పరిష్కారం కనుగొంటారని కూడా తెలుస్తున్నది. 27 న నూతన సెక్రెటేరియేట్,శాసన సభ భవనాల నిర్మాణానికి భూమిపూజ తలపెట్టారు.అదే రోజు రెండు రాష్ట్రాల నదీ జలాల సమస్యలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగే కీలక సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ పాల్గొంటారు. కాగా రెండో సారి అదికారం చేపట్టినపుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్,హోమ్ మంత్రిగా మహమూద్ అలీ మొదట ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 10 మందిని ఫిబ్రవరి 18 న
కేబినెట్ లోకి తీసుకున్నారు. నాలుగు నెలలు గడచినా పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేయలేదు. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఈటల రాజేందర్‌, వి.శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చేమకూర మల్లారెడ్డిలకు చోటు దక్కింది. కేసీఆర్ కేబినెట్‌లోని మొత్తం మంత్రుల సంఖ్య 12కి చేరింది. కేసీఆర్ కేబినెట్ విస్తరణలో మహిళలు ఎవరికీ ప్రాతినిధ్యం దక్కలేదు.లోక్‌సభ ఎన్నికల తరవాత మిగిలిన 6 ఖాళీల భర్తీకి అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతూ వస్తున్నది. రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎమ్మెల్యేల్లో 15 శాతం అంటే 120 మందిలో సీఎంతో కలిపి 18 మందికి క్యాబినెట్‌లో చోటు కల్పించే ఛాన్స్ ఉంటుంది. మంత్రివర్గంలో మొత్తం 12 మంది ఉన్నందున ఇంకో 6 ఖాళీలు ఉన్నాయి. ఎస్టీలకు, మహిళలకు క్యాబినెట్‌లో చోటు కల్పించడం లాంటి సామాజిక సమీకరణాలపై కసరత్తు పూర్తి కాలేదని టిఆర్ ఎస్ వర్గాలు అంటున్నవి. కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని అధికారపార్టీ వర్గాలు చెబుతున్నవి.దసరా పండుగ తర్వాత జరగనున్నట్టు భావిస్తున్న మంత్రివర్గ విస్తరణలోనూ కేటీఆర్,హరీశ్ లకు ప్రాతినిధ్యం లభించకపోవచ్చునని అనుకుంటున్నారు. వారి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ వినోద్ కు కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలియవచ్చింది. వినోద్ ఇటీవల ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఓడిపోయారు. ఆయనను శాసనమండలికి తీసుకొని కేబినెట్ మంత్రిగా బాధ్యతలు ఇవ్వాలని ముఖ్యమంత్రి తలపోస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుకు కేబినెట్లో బెర్త్ ఖాయమంటూ జరుగుతున్న ప్రచారానికి దాదాపు తెర పడినట్లేనని తెలిసింది. మంత్రుల అసమర్థత, సొంత మనుషులనే గెలిపించుకోలేక పోయారనే ఆరోపణలతో ‘గ్రేట‌ర్’ కు సంబంధించి మంత్రి త‌ల‌సాని, మ‌ల్లారెడ్డిలకు స్థాన భ్రంశం తప్పదంటూ మీడియాలో ప్రచారం జరిగినా వారిని కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు శూన్యమేనని సమాచారం అందుతున్నది.వారిని కొనసాగిస్తూనే వెలమ సామాజికవర్గానికి, ఎస్.టీ, మహిళలకు కలిపి 6 ఖాళీలు భర్తీ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.