బీసీల రిజ‌ర్వేష‌న్లు @ 34 శాతం. -మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం.

హైదరాబాద్:
స్థానిక ఎన్నిక‌ల్లో 50 శాతం క‌న్నా రిజ‌ర్వేష‌న్లు మించ‌వ‌ద్ద‌ని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకు వెళ్లాల‌ని నిర్ణ‌యం.బీసీల గ‌ణ‌న‌, నెలాఖ‌రులో పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత ప్ర‌త్యేకాధికారి లేదా పాల‌క‌వ‌ర్గాల పొడిగింపుల‌పై కేబినెట్‌లో నిర్ణ‌యం తీసుకోవాల‌ని తీర్మాణం పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సచివాలయంలో మంత్రుల సబ్ కమిటీ భేటీ.
హాజరైన మంత్రులు ఈటల రాజేందర్, కేటిఆర్, తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేకంగా హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, సీఎస్ ఎస్కె జోషి, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు, న్యాయ కార్యదర్శి నిరంజన్ రావు.హైద‌రాబాద్‌-ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను 34 శాతం క‌న్నా త‌గ్గ‌కుండా చూడాల‌ని మంత్రుల సబ్ కమిటీ తీర్మాణించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ 50 శాతం క‌న్నా రిజ‌ర్వేష‌న్లు మించ‌వ‌ద్ద‌ని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన స‌చివాల‌యంలో బుధ‌వారం బేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది. ఈ స‌మావేశానికి స‌బ్ క‌మిటీ స‌భ్యులైన మంత్రులు ఈటల రాజేందర్, కేటిఆర్, తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ప్ర‌త్యేకంగా హాజ‌రయ్యారు. రిజ‌ర్వేష‌న్ల‌పై ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు…బీసీ గ‌ణ‌న‌, పంచాయ‌తీల పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎస్ ఎస్కె జోషి, పంచాయతీ రాజ్ శాఖ‌ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు, న్యాయ కార్యదర్శి నిరంజన్ రావుల‌తో మంత్రుల సబ్ క‌మిటీ చ‌ర్చించింది. స‌మావేశంలో క‌మిటీ చైర్మ‌న్ జూప‌ల్లి కృష్ణారావు మాట్లాడుతూ… స‌కాలంలో ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు త‌మ శాఖ ప‌రంగా అన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని… అయితే రిజ‌ర్వేష‌న్లు, బీసీ గ‌ణ‌న అంశాల‌పై కొంద‌రు కోర్టును ఆశ్ర‌యించ‌డం, దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను మంత్రివ‌ర్గ ఉప‌సంఘానికి వివ‌రించారు. అలాగే ఈ నెలాఖ‌రుతో పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగియ‌నున్న నేప‌థ్యంలో…ఈ లోపు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితుల్లో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కూడా మంత్రివ‌ర్గ ఉప‌సంఘం చ‌ర్చించింది. అనంత‌రం కేబినెట్ స‌బ్ క‌మిటీ చైర్మ‌న్ జూప‌ల్లి కృష్ణారావు, మంత్రులు ఈటెల రాజేంద‌ర్‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు, జోగు రామ‌న్న‌లు మీడియాతో మాట్లాడారు. గ‌త‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా 61 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింద‌ని…ఈ సారి కూడా 50 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను మించ‌కూడదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని నిర్ణయించిన‌ట్లు మంత్రి ఈటెల రాజేంద‌ర్ తెలిపారు. . ఇప్పటికే పంచాయితీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్ప‌ష్టం చేశారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను స‌కాలంలో నిర్వ‌హించ‌డం, స్థానిక సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. అయితే కొంతమంది పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై కేసులు వేయడం వల్ల చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతం బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ తగ్గకుండా చూడ‌టానికి సుప్రీం కోర్టును ఆశ్రయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. జూలై 31 తో సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తుంద‌ని…ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాలా లేక పాల‌క‌వ‌ర్గం పదవీకాలం పొడిగించాలా అన్నదానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. దీనితో పాటు బీసీ గ‌ణ‌న విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాల‌న్న‌ది కూడా కేబినెట్లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామ‌ని, దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాల‌ని స‌బ్ క‌మిటీ నిర్ణయించిన‌ట్లు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు.