బురారీ ఆత్మహత్యలకు ప్రేరేపించిన తాంత్రికురాలు.

న్యూ ఢిల్లీ:
సంచలనం సృష్టించిన ఢిల్లీ బురారీలో జరిగిన సామూహిక ఆత్మహత్యల కేసు రోజుకో అనూహ్యమైన మలుపు తిరుగుతోంది. ఆ 11 మందిని ఆత్మహత్యలకు ప్రేరేపించింది తానేనని గీతా మాత అనే తాంత్రికురాలు ముందుకొచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న ఆమె, విచారణ సందర్భంగా వారందరినీ ఆత్మహత్యలు చేసుకోవాలని సూచించినట్టు అంగీకరించింది. గీతా మాత అనే ఓ మంత్రగత్తె ఓ వార్తాఛానెల్ తో మాట్లాడుతూ అలా చేయమని చెప్పింది తానేనని తెలిపింది. ఈమె భాటియా కుటుంబం ఇంటిని నిర్మించిన డెవలపర్ కుమార్తె అని ఆ ఛానెల్ పేర్కొంది. దీంతో కేసు దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. వారి విచారణలో ఆ కుటుంబాన్ని సామూహిక ఆత్మహత్యలకు ప్రేరేపించినట్టు ఒప్పుకొంది. జూలై 1 ఉదయం వెలుగు చూసిన ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారి ఆత్మహత్యలకు మూఢనమ్మకమే కారణమని ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా విచారణ సంస్థలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. ఇంటి సోదాలలో బయటపడ్డ డైరీలు, సీసీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత ఈ ఆత్మహత్యలు ఓ ప్రణాళిక ప్రకారం జరిగాయనే నిర్ణయానికొచ్చారు పోలీసులు. తాము చనిపోయే సమయానికి చనిపోయిన ఆ కుటుంబ పెద్ద.. లలిత్ తండ్రి ఆత్మ తమని కాపాడుతుందని భ్రమించారు తప్ప నిజానికి ఆత్మహత్య చేసుకోవాలన్నది వారి ఉద్దేశం కాకపోవచ్చని భావిస్తున్నారు.