బెట్టింగ్, జూదం.. ఇక చట్టబద్ధం.

న్యూఢిల్లీ;
బెట్టింగ్ పెట్టాలంటే ఇక చాటుమాటు వ్యవహారం కాదు… జూదం కూడా దర్జాగా ఆడుకోవచ్చు… బెట్టింగ్ రాయుళ్లపై రైడ్స్ జరగవు… జూదం ఆడినా చట్టవ్యతిరేకం కాదు…! క్రికెట్‌తో సహా అన్ని రకాల క్రీడల్లో జరిగే బెట్టింగ్‌ను, జూదాన్ని చట్టబద్ధ కార్యకలాపంగా క్రమబద్ధీకరించి, ప్రభుత్వ ఖజానాను నింపుకోవాలని లా కమిషన్ సిఫార్సుచేసింది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల పరిధిలోకి వీటిని తీసుకువచ్చి పన్నులు విధించాలని సూచించింది. తద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించాలని పేర్కొన్నది. లీగల్ ఫ్రేమ్‌వర్క్: గ్యాంబ్లింగ్ అండ్ స్పోర్ట్స్ బెట్టింగ్ ఇన్‌క్లూడింగ్ క్రికెట్ ఇన్ ఇండియా పేరుతో లా కమిషన్ ఒక నివేదికను రూపొందించింది. బెట్టింగ్‌ను క్రమబద్ధీకరించి, తద్వారా పన్ను ఆదాయాన్ని సమకూర్చుకోవటం కోసం సంబంధిత చట్టాల్లో చేపట్టాల్సిన సవరణల గురించి లా కమిషన్ ఈ నివేదికలో పలు సూచనలు చేసింది. కొన్ని నియంత్రణలు విధించి క్రీడారంగంలో బెట్టింగ్‌, జూదానికి సంబంధించిన వివిధ కార్యకలాపాల్ని అనుమతించవచ్చు… వీటిని నిషేధించడం వల్ల మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతోంది… నల్లధనం పెరిగి చలామణీ అవుతోంది. కావున వీటిని అనుమతించడం మంచిదని లా కమిషన్‌ కేంద్రానికి చేసిన సిఫారసులో పేర్కొంది. తన నిర్ణయాన్ని సమర్థించుకోవడమే కాదు… మహాభారతాన్ని ఉదాహరణగా చూపింది. మహాభారత దృష్టాంతాన్ని ఉటంకించడం! ఆనాడు ధర్మరాజు జూదంలో భార్యా సోదరుల్ని పణంగా పెట్టాడు. ఎందుకంటే జూదంపై అప్పట్లో నియంత్రణలు లేవు. ఉండుంటే అంతటి మహాభారత కథ ఉండదు అని పేర్కొంది. జూదం ఆడితే ఆదాయం పెరగుతుంది. దానిపై పన్నూ విధించవచ్చు. ప్రభుత్వానికీ ఆదాయం సమకూరుతుంది అని మరో ఉచిత సలహా కూడా విసిరింది. లీగల్‌ ఫ్రేమ్‌వర్క్‌: గేంబ్లింగ్‌ అండ్‌ స్పోర్ట్స్‌ బెట్టింగ్‌ ఇన్‌క్లూడింగ్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా పేరిట జస్టిస్‌ బీఎస్‌ చౌహాన్‌ కమిటీ రూపొందించిన నివేదికలో చట్టంలో చేయాల్సిన మార్పులను సూచించింది. బిహార్‌, ఒడిషా క్రికెట్‌ సంఘాలకు, బీసీసీఐకి మధ్య సాగుతున్న ఓ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడం సాధ్యమా అన్న అంశంపై పరిశీలన జరపాలని చేసిన ఆదేశాల మేరకు కమిటీ ఈ నివేదిక రూపొందించింది. విద్యార్థులు, నిపుణులు, ప్రముఖుల, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న మీదట బెట్టింగ్‌ను నిషేధించడం కన్నా నియంత్రించడం మేలన్న తుది నిర్ణయానికి వచ్చింది. నల్లధనం విపరీతంగా చలామణీ అవుతున్న ప్రస్తుత తరుణంలో మనమే చట్టబద్ధం చేసేస్తే ఆ వచ్చే డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది అని వింత వాదన వినిపిస్తోంది. నైపుణ్యం గల క్రీడలు చాలానే ఉన్నాయని పేర్కొన్న కమిషన్… వాటన్నింటినీ గ్యాంబ్లింగ్‌-నిషేధ చట్ట పరిధి నుంచి తప్పించి చట్టబద్ధత కల్పించవచ్చు అని సూచించింది.