హైదరాబాద్:
ప్రేమికుడితో ద్విచక్ర వాహనంపై వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన యువతిని వైద్యులు జీవన్మృతిగా ప్రకటించారు. ఇంత శోకసంద్రంలోనూ ఆమె తల్లిదండ్రులు కుమార్తె అవయవదానానికి అంగీకరించారు.
ఎస్సార్‌నగర్ పోలీసుల వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం, గీతానగర్‌కు చెందిన పి.భవాని(23) ఎస్సార్‌నగర్‌లోని ఎన్.ఎస్.ఆర్ మహిళల హాస్టల్లో ఉంటోంది. పంజాగుట్టలోని గోదావరి కన్స్ట్రక్షన్స్ సంస్థలో పనిచేస్తోంది. సంస్థ యజమాని మల్లేష్‌రెడ్డి మేనల్లుడైన శ్రీనాథ్(25)తో రెండేళ్ల కిందట ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మంగళవారం ఇద్దరూ మూసాపేటలోని ఓ హోటల్‌కు వెళ్లారు. బుధవారం ఉదయం 6.30 ప్రాంతంలో బైకుపై వస్తుండగా ఎర్రగడ్డలోని సెయింట్ థెరెసా ఆసుపత్రి వద్ద ఒక్కసారిగా ఆగిపోయిన కారును వెనుక నుంచి ఢీకొన్నారు. తలకు శిరస్త్రాణం ఉన్న శ్రీనాథ్ స్వల్పగాయాలతో బయటపడగా భవానీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన సెయింట్ థెరెసా ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. జీవన్మృతి అయినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో అవయవ దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకొచ్చారు. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి కుమార్తె బ్రెయిన్‌డెడ్‌కు కారణమైన శ్రీనాథ్‌పై చర్య తీసుకోవాలని భవానీ తల్లి బుధవారం ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.