‘బ్లాక్’ మ్యాజిక్.

న్యూఢిల్లీ:
విదేశాల్లో దాగి ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తాం.. ఆ డబ్బుతో దేశంలోని నిరుపేదల ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం.. గత ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ దేశప్రజలకు చేసిన వాగ్దానం ఇది. ఇంకేముంది మోడీ ప్రభుత్వం వస్తే లక్షాధికారులు అవుతామని ఆశించి గత మూడు దశాబ్దాలలో ఏ పార్టీకి ఇవ్వని విధంగా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు ఓటర్లు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయ్యాయి. మరో 10 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అంత కంటే ముందుగానే ఎన్నికలు జరపాలని ముచ్చటపడుతున్న మోడీ ప్రభుత్వానికి ఇంతలోనే ఊహించని విధంగా దెబ్బ తగిలింది. స్విస్ బ్యాంకుల్లో గత ఏడాది భారతీయులు దాచుకున్న సొమ్ము ఏకంగా 50 శాతం పెరిగిందన్న వార్త అందరికీ షాకిచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందంటూ అంతర్జాతీయ స్థాయిలో వెల్లువెత్తుతున్న అంచనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్న సమయంలో చిత్రంగా స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు అమాంతంగా పెరగడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లోని నల్లధనం తిరిగి రప్పించడానికి ముందు స్వదేశంలోని నల్లకుబేరుల ఆటకట్టిస్తానని దేశప్రధాని రెండేళ్ల క్రితం హఠాత్తుగా ఓ రాత్రి పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అవినీతి అంతమవుతుందనీ, తీవ్రవాదం అణిగిపోతుందని మోడీ హామీ ఇచ్చారు. ఎట్టకేలకు దేశంలో గుట్టలుగా పోగుపడ్డ నల్లధనం ఆటకట్టించే మొనగాడు వచ్చాడని అంతా అనుకున్నారు. కష్టమైనా నష్టమైనా రోజులు, నెలలు, ఏళ్లు భరించారు. పగలనక రాత్రనక బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలలో నిలబడ్డారు. అంతా మన మంచికేనని భావించారు. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం పెద్దనోట్లు రద్దయిన మరుసటి ఏడాదే స్విస్ బ్యాంకుల్లోకి అధిక మొత్తంలో డబ్బు వచ్చి చేరింది. స్విస్ బ్యాంకులు తమ దగ్గరున్న భారతీయుల సొమ్ము వివరాలు చెప్పడం ప్రారంభించిన తర్వాత డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి. 2015లో రూ. 8,000 కోట్లు ఉన్న డిపాజిట్లు 2016లో అత్యంత కనిష్ఠంగా రూ.4,500 వేల కోట్లకి చేరాయి. మూడేళ్లుగా స్విస్ బ్యాంకుల్లో తగ్గుతూ వస్తున్న భారతీయుల డిపాజిట్లు గత ఏడాది హఠాత్తుగా రూ.7,000 కోట్లు పెరిగాయి. గత ఎన్నికల్లో స్విస్ బ్యాంకుల్లో ఉన్నదంతా నల్లధనమే అని వాదించిన బీజేపీ నాయకులు ఇప్పుడు నాలిక మడతేశారు. అక్కడ ఉన్నదంతా నల్లధనమే కానక్కర్లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కొత్త వ్యాఖ్యానం చెబుతున్నారు. భారతీయులు అంటే దేశంలో ఉండేవారు మాత్రమే కారని..  ప్రవాస భారతీయులది కూడా కావచ్చని ఆయన కొత్త నిర్వచనం చెప్పారు. ‘అదంతా నల్లధనమేనని ఎందుకు అనుకోవాలి.?’ అని ప్రశ్నించారు మోడీ ప్రభుత్వంలోని మరో మంత్రి పీయూష్ గోయల్. స్విస్ ఖాతాదారుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉండగా విదేశాల్లో నల్లధనం దాచే ధైర్యం ఎవరు చేస్తారనేది ఆయన వాదన. స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు తమ సొమ్ముల్ని దాచుకోవడానికి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయని, చట్టబద్ధంగా దాచుకున్న సొమ్ము.. చట్ట విరుద్ధంగా దాచుకున్న సొమ్ము వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెబుతున్నారు. ఈ నాలుగేళ్లలో దేశీయంగా, విదేశాల్లోనూ నల్లధనాన్ని ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలేవీ సత్ఫలితాల నివ్వలేదనేది కఠోర వాస్తవం. పెద్ద నోట్ల రద్దుతో చలామణిలోని 86 శాతం కరెన్సీని చిత్తు కాగితాలుగా మార్చి సామాన్యులను ఇక్కట్లు పెట్టి ఆర్థిక రంగాన్ని చావుదెబ్బ తీశారు తప్ప రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాల్లోకి రంగు మార్చుకొని ప్రవహించిన, ప్రవహిస్తున్న నల్లధనాన్ని అరికట్టలేకపోయారు. ఆర్థిక నేరాలకి పాల్పడితే ప్రభుత్వం చర్యలు తీసుకొనడం నిజమే కానీ అడ్డదారులు అనేకం ఉండగా తమ అక్రమార్జన ఇదే మార్గంలో పెడతారనే గ్యారంటీ లేదు. స్విట్జర్లాండ్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం 2019 ఆర్థిక సంవత్సరం ముగియగానే స్విస్‌ బ్యాంకుల్లోకి భారతీయుల సొమ్ము ఎంత చేరిందో పూర్తి సమాచారం తమకు అందుతుందని చెబుతున్నా.. నల్లధనం వెలికి వస్తుందని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న దేశప్రజలు తాజా పరిణామాలతో నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు.