భారత్ పై అమెరికా ఆంక్షలు?

ప్రకాశ్, న్యూఢిల్లీ:

రష్యాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకొంటే ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించినప్పటికీ భారత్ 5 బిలియన్ డాలర్ల ఆయుధాల డీల్ కుదుర్చుకుంది. రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో భారత్ పై అమెరికా వ్యతిరేకులను ఆంక్షల ద్వారా అడ్డుకొనే చట్టం (సీఏఏటీఎస్ఏ) ద్వారా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అమెరికా భారత్ పై ఆంక్షలు విధిస్తే అది వాషింగ్టన్ కే తలనొప్పిగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. హానికర కార్యకలాపాలు చేపడుతున్నందుకు రష్యాను శిక్షిస్తూ ఆగస్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చట్టంపై సంతకం చేశారు. గత నెలలో ఎస్-400 సహా రష్యా రక్షణ సామాగ్రిని కొనుగోలు చేసినందుకు సీఏఏటీఎస్ఏ చట్టం కింద చైనాపై ఆంక్షలు విధించారు. అమెరికాకు చైనా ప్రత్యర్థి శక్తిగా ఆవిర్భస్తోంది. కానీ భారత్ ను అగ్రరాజ్యం తన కీలక వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తోంది. కొన్నేళ్లుగా అమెరికా రక్షణ అధికారులు ఢిల్లీతో సహకారం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక విస్తరణ చేపట్టడంతో అమెరికాకు భారత్ తో సత్సంబంధాలు అత్యంత కీలకంగా మారాయి. ఇప్పుడు రష్యా ఆయుధ వ్యవస్థను కొనుగోలు చేయడంతో ట్రంప్ ప్రభుత్వం భారత్ ని శిక్షించాలా? వద్దా? అనే మీమాంస తలెత్తనుంది. రక్షణ బంధాన్ని తెగతెంపులు చేసుకొని ఆంక్షలు విధించాలా? లేకపోతే ఢిల్లీకి మినహాయింపు ఇవ్వడమా అనే అయోమయ స్థితి ఎదురు కానుంది. మినహాయింపు ఇస్తే ఆంక్షల తీవ్రత బలహీన పడుతుంది. అంతే కాకుండా కొన్ని దేశాలపై అమెరికా ప్రత్యేకమైన అభిమానం చూపిస్తోందనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకనే భారత్-రష్యా రక్షణ ఒప్పందంపై సంతకాల వ్యవహారంపై అమెరికా ఆచితూచి స్పందించింది. ‘మా భాగస్వాములు, మిత్రదేశాల రక్షణ సామర్థ్యాన్ని దెబ్బతీసేలా ఆంక్షలు విధించడం సీఏఏటీఎస్ఏ ఉద్దేశం కాదని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వ్యాఖ్యానించింది. ఆంక్షల నిర్ణయాలపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని చెప్పింది. ఆంక్షల ఎత్తివేతకు కఠిన ప్రమాణాలు ఉన్నాయని.. కొన్నిసార్లు లావాదేవీల ఆధారంగా నిర్ణయాలు ఉండవచ్చని తెలిపింది. అమెరికా స్పందించిన తీరు చూస్తుంటే పెద్ద సంకటంలో పడినట్టే కనిపిస్తోందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు. భారత్ ఎస్-400 కొనుగోలు చేసేందుకు అనుమతిస్తే మిగతా దేశాలు తమనెందుకు అనుమతించడం లేదని ప్రశ్నించే అవకాశం ఉంది. సీఏఏటీఎస్ఏ కొన్ని దేశాలకు మాత్రమే వర్తిస్తుందా? అన్నిటికీ ఒకే చట్టం ఉండదా అని నిలదీస్తే పరిస్థితేంటని అమెరికా సంకటంలో పడిందని భావిస్తున్నారు. ఆయుధాల ఎగుమతిదారులకు భారత్ ఒక ఆకర్షణీయమైన మార్కెట్. ఇజ్రాయిల్ తర్వాత భారత్ అమెరికా నుంచే అత్యధికంగా రక్షణ సామాగ్రి కొనుగోలు చేస్తోంది. ప్రాంతీయ వ్యూహాత్మక బంధంతో పాటు ఆర్థిక వ్యవహారాలు కూడా ముడిపడినందువల్ల అమెరికా భారత్ ఎస్-400 కొనుగోలుని సీరియస్ గా తీసుకోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.