భారీగా తగ్గనున్న ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య.

న్యూఢిల్లీ:
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్..ట్విట్టర్ లో తమ ఖాతాను వేలల్లో, లక్షల్లో, మిలియన్లలో ఫాలో అవుతున్నారని గర్వంగా మురిసిపోయేవాళ్లకి బ్యాడ్ న్యూస్. ఇక ఈ సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ట్రోలింగ్, స్పామ్ మెసేజెస్ పై ఉక్కుపాదం మోపాలని ట్విట్టర్ నిర్ణయించింది. ఆ దిశగా వేగంగా చర్యలు కూడా చేపట్టింది. అనుమానాస్పద ఫేక్, స్పామ్ అకౌంట్లను తొలగించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నట్టు ట్విట్టర్ ఇండియా ప్రకటించింది. అదే జరిగితే పలువురు యూజర్లకు ఫాలోవర్స్ సంఖ్య తగ్గిపోవచ్చు.
తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పోస్ట్ చేసింది. ఫాలోవర్స్ సంఖ్య తగ్గినంత మాత్రాన ఆ యూజర్లు తామేదో తప్పు చేసినట్టు భావించవద్దని కోరింది. తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఫేక్ అకౌంట్లపై యూజర్లు ఫిర్యాదులు చేయకముందే వాటిని తొలగించనున్నామని తెలిపింది. ట్విట్టర్ లో ద్వేషపూరిత సందేశాలు, ట్రోల్ చేసేవారి ఆచూకీ ఎలా కనిపెట్టాలో ఎప్పటికప్పుడు తెలియజేస్తామని చెప్పింది. ట్విట్టర్ లో ట్రోలింగ్ కి భారత్ అతిపెద్ద అడ్డాగా మారింది. కొందరు ఫేక్ అకౌంట్ల ద్వారా ట్రోలింగ్ చేయడం, ద్వేషపూరిత సందేశాలు పంపడం వంటివి చేస్తున్నారు. పనికొచ్చే విషయాలు, హై క్వాలిటీ ఇన్ఫర్మేషన్ పంపుకోనే చక్కటి వేదికగా ట్విట్టర్ ను చేయాలని భావిస్తున్న సంస్థ.. ఫేక్ అకౌంట్ల అంతానికి పూనుకొంది. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 90 లక్షలకు పైగా స్పామ్ అకౌంట్లు ఉన్నట్టు ట్విట్టర్ గుర్తించింది. త్వరలోనే వీటికి చెల్లుచీటి పాడనుంది.