భారీగా పెరిగిన మద్దతు ధర.

న్యూ ఢిల్లీ:
సాధారణ ఎన్నికలకు ముందు రైతులను ఆకట్టుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలపై ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశమైంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఖరీఫ్ పంటలకు కేంద్రం కనీస మద్దతు ధరను భారీగా పెంచించింది.
రూ. 200 మేర మద్దతు ధర పెంచడంతో క్వింటాలు వరి మద్దతు ధర రూ.1,750కి చేరింది. వరి కనీస మద్దతు ధర భారీగా పెంచడం వల్ల ఉత్పత్తి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2017-18లో 11.1 కోట్ల టన్నులతో వరి పంట ఉత్పాదనలో కొత్త రికార్డును స్థాపించింది. వరితో పాటు మరో 13 పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పప్పుల్లో కందిపప్పు ధర క్వింటాలుపై రూ.225 పెంచారు. దీంతో క్వింటాలు కందిపప్పుకు రూ.5,675 కనీస మద్దతు ధర లభించనుంది. పెసలకు మద్దతు ధరను రూ.1,400 పెంచి క్వింటాలుకు రూ. 6,975గా నిర్ణయించారు. మినుములు క్వింటాలుకు రూ.200 పెంచడంతో రూ.5,600కి చేరనుంది. రాగులు క్వింటాలుకు రూ.997పెంచి రూ. 2,897కి సవరించారు. ప్రత్తి (మధ్యరకం) ధర క్వింటాలుకు రూ.1,130 పెరిగి రూ.5,150కి చేరనుంది. ప్రత్తి (పొడవు రకం) ధర క్వింటాలుకు రూ.1,130 పెంచి రూ.5,450గా నిర్ణయించడమైంది. ఇటీవలే కనీస మద్దతు ధర ఉత్పత్తి ఖర్చుకు కనీసం ఒకటిన్నర రెట్లు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ ఇదే పేర్కొన్నారు. బడ్జెట్‌లో ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేయనున్నారు. సాధారణంగా పంట వేసే ముందు కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. దీనిని బట్టి రైతులు ఏ పంట వేయాలో నిర్ణయించుకుంటారు. ప్రస్తుతం విత్తడం అయిపోయిన తర్వాత ధరను ప్రకటిస్తున్నారు.