భూసేకరణకు సహకరించాలి.

భూసేకరణకు సహకరించాలి.

సిద్ధిపేట:

శ్రీ కొమురవెళ్లి మల్లన్న సాగర్ ముంపునకు గురయ్యే గ్రామాలలో ఇళ్లు, ఇంటి అడుగు స్థలాలకు మిగిలిపోయిన స్ట్రక్చర్ వాల్యూ సర్వేకు గ్రామస్తులు సహకరించాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. ఇందుకు గాను వేములఘాట్ గ్రామానికి సికింద్రాబాద్ ఆర్డీఓ రాజాగౌడ్, హుస్నాబాద్ ఆర్డీఓ అనంత రెడ్డిలతో పాటు 4 చిన్నకోడూర్, నంగునూరు, చేర్యాల, బెజ్జంకి తహశీల్దార్ల బృందం, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి 7 ఆర్అండ్ బీ బృందాలతో పాటు రాజన్న సిరిసిల్లా జిల్లా ఆర్డీఓ శ్రీనివాస రావు, 4 దుబ్బాక, సిద్ధిపేట రూరల్, దౌల్తాబాద్ తహశీల్దార్ల బృందం, పల్లె పహాడ్ గ్రామానికి మల్కాజిగిరి ఆర్డీఓ తో పాటుగా 4 తహశీల్దార్ల బృందాన్ని పల్లె పహాడ్ గ్రామాల బాధ్యతలను ఆర్డీఓలకు అప్పగించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ మాట్లాడుతూ.. నిర్వాసిత ఇళ్లు, ఇంటి అడుగు స్థలాల పరిహార చెక్కులను ఈ నెల 30వ తేదీలోపు పంపిణీ చేస్తున్నామని, ఇందుకు గ్రామస్తులు సహకరించాలని, లేనిచో ఆ పరిహారాన్ని కోర్టులో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీలోపు ఇళ్లు కొలతలను చేయించుకోని వారి పేర్లను పీడీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇండ్ల సర్వేకు సహకరించని వారి పేరు డిక్లరేషన్ ఇచ్చాక, అంతకు ముందు ఇచ్చిన ఇంటి పట్టా సర్టిఫికేట్ ను రద్దు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న పరిహారం గజానికి 1600 రూపాయలు అందిస్తుందని, నిరాకరించిన వారి యొక్క పరిహార చెక్కులను కోర్టులో డిపాజిట్ చేస్తామని అట్టి వారికి గజానికి 300 రూపాయలు చొప్పున్న అందుతాయని తెలిపారు. ఈ మధ్య కాలంలో కొత్తగా నిర్మించిన ఇండ్లను పరిగణలోకి తీసుకోబోమని వారికి చెల్లింపులు ఇవ్వడం జరగదని తెలిపారు. గజ్వేల్ పట్టణ పరిధిలో ముట్రాజ్ పల్లి, సంగాపూర్ ప్రాంతాల్లో అతి త్వరలోనే లే అవుట్, ప్లాట్, ఆలాట్మెంట్ పనులను పూర్తి చేస్తున్నామని వివరించారు. మిస్సింగ్ స్ట్రక్చర్ వాల్యూ, అసైన్దు భూముల చెల్లింపులు కూడా త్వరితగతిన పూర్తి చేయిస్తామని తెలిపారు. ముంపునకు గురయ్యే ప్రతి గ్రామానికి ఒక సర్వే బృందంతో పాటు విచారణ బృందం వస్తుందని, గతంలో వచ్చిన ఆర్జీలను జూన్ నెల 1వ తేదీ తర్వాత విచారణ చేయిస్తామని చెప్పారు. ప్రత్యేకించి సంగారెడ్డి, మెదక్ జిల్లా నుంచి 12 మంది ప్రత్యేక ఆర్అండ్ బీ బృందాలకు బాధ్యతలను అప్పగించినట్లు., వీరితో పాటు వేములఘాట్ గ్రామానికి 12 మంది బృందంతో కూడిన అధికారిక బృందం సర్వే, విచారణ చేపట్టనున్నారని పేర్కొన్నారు. ఆయా గ్రామాలలో సర్వే, విచారణకు వచ్చిన అధికారిక బృందాలకు అదే గ్రామాలలో భోజన సదుపాయాలను కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. గ్రామాలలో మిగిలిపోయిన నిర్వాసితుల వారి పేర్లను ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ అందించేలా ప్రభుత్వ ఆమోదం కోసం పంపించామని వెల్లడించారు. పరిహార పంపిణీ చెక్కులను నిలిపివేసిన వాటిలో అర్హులైన వారికి మంజూరు చేసేలా తిరిగి రీ సర్వే చేపట్టి అర్హులైన వారిని గుర్తించి అందిస్తామని పేర్కొన్నారు.