‘మందసౌర్’ నిందితుడి తల నరికితే 5 లక్షలు -బిజెపి నాయకుడు సంజీవ్ మిశ్రా ప్రకటన.

భోపాల్;
ఎనిమిదేళ్ల చిన్నారి బాలికపై అత్యాచారానికి పాల్పడి, అత్యంత కిరాతకంకా హింసించిన ‘మానవ మృగం’ తల నరికి తీసుకువస్తే 5 లక్షల రూపాయలు బహుమతి ఇస్తానని బిజెపి నాయకుడు సంజీవ్ మిశ్రా ఆదివారం సంచలన ప్రకటన చేశారు. ‘నిర్బయ’ ఘటనను తలదన్నేలా ఈ సంఘటన మందసౌర్ జరిగింది. అత్యాచారం తర్వాత ఏకాంత ప్రదేశంలో పడేసి వెళ్ళిపోయిన నిందితునికి కోర్టు ఉరిశిక్ష విధించని పక్షంలో అతని తల నరికి తీసుకువస్తే బహుమానం ఇస్తానని సంజీవ్ మిశ్రా ఆవేశపూరితంగా అన్నారు. ఈ దారుణంపై దేశం యావత్తూ ఉలిక్కిపడింది. మందసౌర్ అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని ఉరితీయాలని అయన కోరారు. ఈ కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు.దీనిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. బాధిత బాలికకు చికిత్స చేసే సందర్భంలో డాక్టర్లు తీవ్రంగా చలించిపోయారంటే ఆ పాపను ఎంత క్రూరంగా హింసించారో అంచనా వేయవచ్చు.