మరింత సులువుగా సరుకుల పంపిణీ.

హైదరాబాద్:
ప్రజా పంపిణీ ద్వారా రేషన్‌ సరుకులు తీసుకోవడానికి రేషన్‌ లబ్దిదారులకు మరింత సులువుగా, మరింత ప్రయోజనం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా లబ్దిదారులకు ఐరిస్‌ (కనుపాపలు) ద్వారా రేషన్‌ సరుకులు ఇవ్వాలని నిర్ణయించింది. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయబోతోంది. ఈ నూతన ఐరిస్‌ విధానం ముందుగా ఈ నెల 15వ తేదీ నుండి పెద్దపల్లి, మంచిర్యాల, సిరిసిల్ల, యాదాద్రి జిల్లాల్లో అమలు చేయలాని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.సోమవారం నాడు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పౌరసరఫరాల శాఖ అధికారులతో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ శ్రీ అకున్‌ సబర్వాల్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐరిస్‌ విధానం అమలుపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఆయా జిల్లాల్లో రేషన్‌ షాపులను తనిఖీ చేసి, రేషన్‌ సరుకుల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. మంచిర్యాలలో రేషన్‌ షాపు తనిఖీ సందర్భంగా ఈపాస్‌ మెషిన్‌లో వేలిముద్రల సమస్యను కమిషనర్‌ గారు గమనించారు. వేలిముద్రలు అరిగిపోవడం వల్ల రేషన్‌ సరుకులు తీసుకోవడంలో వస్తున్న ఇబ్బందులను లబ్దిదారులు కమిషనర్‌ గారి దృష్టికి తీసుకువచ్చారు.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేలిముద్రల ద్వారా రేషన్‌ పంపిణీ చేస్తోంది. అయితే ఈ విధానంలో కొంతమందిలో, ముఖ్యంగా వృద్ధులు, మహిళల్లో వేలిముద్రలు అరిగిపోవడం వల్ల ఈపాస్‌ మెషిన్‌లు ధృకీకరించడం లేదు. దీంతో లబ్ధిదారులకు అసౌకర్యానికి గురికావద్దనే ఉద్దేశంతో పౌరసరఫరాల శాఖ రేషన్‌ సరుకులు అందించడం కోసం వేలిముద్రలు సరిపడని చోట ఆయా ప్రాంతాల్లో వీఆర్‌వో, వీఏవో, పౌరసరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్‌లకు అథంటికేషన్‌ సౌకర్యం కల్పించింది. అయితే, ఈ విధానం అక్కడక్కడ కొన్ని చోట్ల దుర్వినియోగం అవుతుందనే విషయాన్ని కమిషనర్‌ గారి పరిశీలనలో వెల్లడైంది. దీంతో ఐరిస్‌ విధానం అమలు ప్రక్రియను వేగవంతంగా చేశారు.
సమీక్షా సమావేశం, రేషన్‌ షాపుల తనిఖీల అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 17,200 రేషన్‌ షాపుల్లో ఐరిస్‌ విధానాన్ని దశలవారీగా అమలు చేయబోతున్నామని తెలిపారు. ముందుగా ఈ నెల 15వ తేదీ నుండి పెద్దపల్లి, మంచిర్యాల, సిరిసిల్ల, యాదాద్రి జిల్లాల్లో ప్రారంభిస్తున్నామని అన్నారు. రెండో దశలో సెప్టెంబర్‌ 1వ తేదీ నుండి సిద్దిపేట, జగిత్యాల, మహబూబ్‌నగర్‌లో అమలు చేస్తామని, మిగతా జిల్లాల్లో సెప్టెంబర్‌ 25 నుండి అమలు అవుతుందని తెలిపారు.సబ్సిడీ ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సరుకులను అర్హులైన వారికి అందించేలా పౌరసరఫరాల శాఖ పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని అన్నారు.
లబ్దిదారులుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, మరింత సులువుగా, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అర్హులైన పేదలకు నిత్యావసర సరుకులు అందించడానికి ఐరిస్‌ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ విధానాన్ని వీలైనంత త్వరగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు.