మరో నాలుగు నెలలు గుహలోనే?

థాయ్లాండ్:
థాయ్‌లాండ్‌లోని థామ్ లూయాంగ్ గుహలో 12 మంది బాలురు, వారి కోచ్ చిక్కుకొని 13 రోజులైంది. వారందరిని బయటికి తెచ్చేందుకు థాయ్ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగులేస్తోంది. భద్రంగా బయటికి తీసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలపై పగబట్టినట్టు ప్రతికూల వాతావరణం ఎదురవుతోంది. మరోసారి కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో థాయ్ ప్రభుత్వ యంత్రాంగం పరిమిత సమయంలో అడుగడుగునా అడ్డుపడుతున్న వాన నీటికి ఎదురీదాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది. జూన్‌ 23న ఫుట్ బాల్ కోచ్, 12 మంది పిల్లలు సమీపాన ఉన్న థామ్ లూయాంగ్ గుహకు వెళ్లారు. భారీ వర్షం కురవడంతో గుహలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరి వారంతా లోపల చిక్కుపడ్డారు. మర్నాడు గుహ బయట ఉన్న సైకిళ్లు, బ్యాగులు చూసిన థాయ్‌ సైన్యం, వారు గుహలో చిక్కుకున్నారని గుర్తించింది. ప్రత్యేకంగా బ్రిటన్ నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు వాళ్లంతా గుహలో నాలుగు కిలోమీటర్ల లోపల ఎత్తైన ప్రదేశంలో ఉన్నట్లు గుర్తించారు. ఆహారం, మందులతో చేరుకున్న డైవర్స్ బృందం, గుహ లోపల పిల్లలు సురక్షితంగా ఉన్న వీడియోను పంపింది. గుహలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల దగ్గరున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కోరింది. థాయ్ ప్రభుత్వ వినతి మేరకు ఈ సహాయ కార్యక్రమాల్లో చాలా దేశాలు పాల్గొంటున్నాయి. సైన్యం, స్థానిక సిబ్బంది, దేశవిదేశీ నిపుణుల వెయ్యి మంది సభ్యుల సహాయ బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ప్రత్యామ్నాయ మార్గాలన్నిటి ద్వారా వారిని బయటికి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రత్యేకమైన పరికరాలతో వెళ్లిన బ్రిటన్ నేవీకి చెందిన సీల్స్ వారు సురక్షితంగా ప్రాణాలతో ఉన్నట్టు గుర్తించింది. అసలే అడుగుతీసి అడుగేయలేని దుర్గమ మార్గం. రెండు కిలోమీటర్ల ఇరుకైన దారి. అది దాటితే దాదాపు కిలోమీటర్ లోయ. ఇలాంటి దారిలో ప్రయాణమే కష్టమైతే ఇప్పుడు మరోసారి కుండపోత వానల కురిస్తే కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. దీనికి తోడు పెద్ద ఎత్తున్న చేరిన వరదనీరు, బురద.. సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. గుహలోని నీటిని నిరంతరాయంగా తోడి పోస్తున్నారు. అయితే కొండలపై నుంచి నీళ్లు వచ్చి చేరుతుండడంతో వృథా ప్రయాసగా మారుతోంది. గుహ గోడలు దళసరిగా ఉన్నందువల్ల రంధ్రాలు చేయాలన్న ప్రయత్నాన్ని విరమించారు. గుహ పైకి భారీ యంత్రాలను తరలించి అక్కడ తొలిస్తే వారిని పైకి లాగవచ్చనే ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ డ్రిల్లింగ్ లో రాతి శిథిలాలు పడి, గుహ పైకప్పు కూలితే పిల్లల ప్రాణాలకు ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుహలోని పిల్లలకి ఫుల్ ఫేస్ మాస్కులు, ఆక్సిజన్ ట్యాంకులు, లైట్లు అందించి డైవర్ల మార్గదర్శనంలో బయటికి రప్పించాలని సహాయ బృందాలు భావిస్తున్నాయి. అయితే అసలే ఈత రాని పిల్లలు కావడంతో ఈ డైవింగ్ ప్రత్యామ్నాయం అత్యంత ప్రమాదకరమని భావిస్తున్నారు. అది వీలు కాకపోతే వానలు తగ్గే వరకు లేదా కనీసం ఆ ప్రాంతంలో నీళ్లు తగ్గేవరకు వేచిచూడాలని సహాయ బృందాలు భావిస్తున్నాయి. ఆ తర్వాత వారిని కాలినడకన బయటికి తీసుకురావచ్చని భావిస్తున్నారు. అలాగైతే వారిని బయటికి తెచ్చేందుకు కనీసం నాలుగు నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు లోపల ఉన్నవారికి డైవర్ల ద్వారా ఆహారం, నీళ్లు, తదితరాలు అందిచే ఏర్పాట్లు చేస్తున్నారు.