మహా ప్రాజెక్టు- మహా సంపద.

ఆర్.ఆర్.కంది, హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్ర ముఖ చిత్రం మారనుంది. సీఎం కేసీఆర్‌ నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు భవిష్యత్తులో అద్భుత సంపదసృష్టించే కేంద్రాలవుతాయని, తెలంగాణకు శాశ్వత సంపదను అందిస్తాయన్న నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం భూమి సాగులోకి వస్తే ప్రతి ఏటా సుమారు రూ.1.25లక్షల కోట్ల విలువైన పంటలు పండనుండగా, వ్యవసాయంపైనే ఆధారపడ్డ రాష్ట్రంలోని 70శాతం కుటుంబాల ప్రజల భవిష్యత్తుకు భరోసా లభించనుంది. సమైక్యరాష్ట్రంలో తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు రెండువందల కోట్లు కూడా కేటాయించని బడ్జెట్లు ఉండగా, ఇపుడు ఏటా రూ.20వేల కోట్ల నుండి రూ.40వేల కోట్లవరకు ఖర్చుపెడుతున్న పరిస్థితి ఉంది. సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసుకుని కృష్ణా,గోదావరి జలాలు సమర్ధవంతంగా వాడుకుంటేనే రాష్ట్రం వికసిస్తుంది. కరువుఛాయలు పోతాయి. పల్లె వదిలిన ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళిన వారు తిరిగి సొంత ప్రాంతానికి చేరుతారు. ఇపుడు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించకుంటే తెలంగాణ రాష్ట్రం సిద్దించే అర్ధం లేదని, తెలంగాణకు ఏం కావాలో సమగ్రంగా తెలుసుకాబట్టే సీఎం కేసీఆర్‌ ఈమహాయజ్ఞాన్ని చేపట్టారన్న వాదనను నీటిపారుదల ఇంజనీరింగ్‌ నిపుణులు గట్టిగా వినిపిస్తున్నారు. బడ్జెట్‌లో సాగునీటిరంగానికి అత్యధికంగా రూ.25వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిన అనివార్యతను దృష్టిలో పెట్టుకుని అదనంగా అప్పులు తెచ్చి ప్రాజెక్టులకు వెచ్చిస్తోంది. గతంలో ప్రాజెక్టులంటే ఇరవై ఏళ్ళు, పాతికేళ్ళు అన్న సంప్రదాయాన్ని తుడిచేసి కళ్ళముందే ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తిచేసే అద్భుత, అపురూప విధానానికి సీఎం కేసీఆర్‌ నాందిపలికారు. దేశంలోనే ఈ విషయంలో తెలంగాణ రోల్‌మోడల్‌. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల పూర్తికి పరిశ్రమిస్తుంటే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం లక్షల కోట్ల సంపద సృష్టించే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. తెలంగాణ ఏర్పడక ముందు చాలా జిల్లాల్లో ఎకరం వ్యవసాయ భూమి రూ.2నుండి 3లక్షల మధ్యే ఉంది. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాక ఇది సగటున రూ.10లక్షలకు పైనే ఉంది. కొత్తగా కోటిఎకరాలు సాగులోకి వస్తే ఎకరం ధర రూ.20లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భూముల విలువే మొత్తంగా చూస్తే సాగునీటి ప్రాజెక్టుల వల్ల రూ.15లక్షల నుండి 20లక్షల కోట్లకు పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు. ప్రాజెక్టులతో వ్యవసాయరంగంమీద ప్రత్యక్షంగా 55లక్షల కుటుంబాలకు, పరోక్షంగా మరో 15లక్షల మందికి ఉపాధి లభించనుంది. తెలంగాణలో ఉన్నదే కోటి కుటుంబాలు కాగా 70శాతం మందికి మేలు జరిగితే అంతకుమించి ఏం కావాలని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక వ్యవసాయరంగంలో
ఏటా రూ.1,25,000కోట్ల పంట పండితే ప్రజల కొనుగోలుశక్తి భారీస్థాయిలో పెరుగుతుంది. దాంతో ఆ ప్రభావం వ్యాపారరంగంపై పడుతుంది. వేలకోట్ల టర్నోవర్‌ పెరగడం వల్ల వ్యాపారరంగంలో ఉపాధిభారీగా పెరుగుతుంది. ప్రభుత్వానికి కూడా పన్నులరూపంలో వచ్చే ఆదాయం పెరగడం వల్ల రైతుబంధు వంటి భారీ పథకాలను అమలుచేచేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. మిషన్‌భగీరధతో 4కోట్లమందికి భారీమేలు మిషన్‌భగీరధ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్చమైన తాగునీరు ఇవ్వడం వల్ల ఆరోగ్యతెలంగాణ సాకారమవుతుంది. ప్రస్తుతం స్వచ్చజలం కోసం మధ్యతరగతి వర్గాలు వందల కోట్లు వెచ్చిస్తున్నాయి. కలుషిత జలం తాగి ఆస్పత్రుల పాలై జబ్బులకు వెచ్చిస్తున్న వ్యయం వందలకోట్లే. మిషన్‌ భగీరధ ఈ వ్యయాన్ని తగ్గించి గణనీయ మార్పుతేనుంది. తెలంగాణ ఆర్ధికవృద్దిరేటు భారీగా ఉండడంతో ఆర్ధిక క్రమశిక్షణ కలిగిన రాష్ట్రంగా పేరుతెచ్చుకుంది. దీంతో తెలంగాణ జారీచేసే బాండ్లకు విపరీత డిమాండ్‌ ఉంది. సహజంగా ఏడేళ్ళ బాండ్లు కొనడానికే ఔత్సాహికులు ఇష్టపడతారు. తెలంగాణ ఆర్ధికశాఖ జారీచేసిన బాండ్లకు 10-15ఏళ్ళ పరిమితి ఉన్నా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయి. ప్రతి ఏటా రాష్ట్రం చెల్లించే వాయిదాలు ఒకవైపు పూర్తవుతుంటే మరోవైపు కొత్త రుణాలకు అవకాశం లభిస్తుంది. అభివృద్ది చెందిన దేశాలు ఇలా పెట్టుబడులు పెట్టి సంపద సృష్టించి ప్రగతిబాటలో పరుగెడుతున్నాయని ఆర్ధికరంగ నిపుణులు ఉదహరిస్తున్నారు.