మహిళకు గుండు గీయించిన దారుణం.

భువనేశ్వర్‌ :
ఓ మహిళ కురులను కత్తిరించి, ఆమెపై దాడికి పాల్పడి వివస్త్రను చేసిన అమానుష ఘటన ఒడిశాలోని బొలంగీర్‌ జిల్లా లొహిసింగా ఠాణా పరిధిలోని కొరెకొచియా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొరెకొచియా గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ అక్రమ సంబంధాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన కొందరు ఆమెను దూషించారు. దీంతో ఆమె 3వ తేదీన గ్రామసభలో వారిపై ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన గ్రామపెద్దలు మహిళపై దుర్భాషలాడిన వారిని మందలించి విడిచిపెట్టారు. గ్రామసభలో అవమానం జరిగిందని భావించిన వ్యక్తులు ఏకమై ఒంటరిగా ఇంటికి వెళ్తున్న మహిళను మార్గమధ్యంలో అడ్డగించి కురులు కత్తిరించారు. ఆమెపై దాడికి పాల్పడి వివస్త్రను చేశారు. తర్వాత ఇంటికి చేరుకున్న బాధిత మహిళ లొహిసింగా ఠాణాలో ఫిర్యాదు చేసింది. దాడి జరిగి వారం రోజులైనా ఫిర్యాదుపై పోలీసులు స్పందించపోవడంతో సోమవారం ఆమె విలేకరులను ఆశ్రయించింది. దీనిపై విలేకరులు పోలీసులను ప్రశ్నించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.