హైదరాబాద్:
రైతు ప్రయోజనాలు, సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే రైసు మిలర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సచివాలయంలో శుక్రవారం నాడు రైస్ మిల్లర్ల సమస్యలపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల్ రాజేందర్, మునిసిపల్, ఐటి శాఖ మంత్రి కె.టి.ఆర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ రైస్ మిల్లర్లతో చర్చించారు.
సమావేశం అనంతరం మీడియాతో సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేపట్టిన మిషన్ కాకతీయ, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం దిగుబడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా, కనీస మద్దతు ధర తప్పనిసరిగా లభించేలా చర్యలు చేపట్టాం. ఇందు కోసం ఒక బిజినెస్ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైస్ మిల్లర్ల పరిశ్రమను కాపాడుకోవడానికి, వారికున్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ విధానాలను పరిశీలించి, అత్యుత్తమ రైస్ ఇండస్ట్రీస్ పాలసీని రూపొందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీనిపై వచ్చే నెల మొదటి వారంలో మిల్లర్లతో మరోమారు సమావేశం నిర్వహిస్తాం. రైస్ మిల్ పరిశ్రమ పూర్తిగా వ్యవసాయ ఆధారితమైనది. దీనిని ఫుడ్ ప్రాసెసింగ్ సబ్ కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ప్రభుత్వం నుంచి మిల్లర్లకు రావల్సిన బకాయిలను దశల వారీగా చెల్లిస్తాం. రాత్రివేళలో విద్యుత్‌ను ఉపయోగించుకుంటే రాయితీ ఇవ్వాలని రైస్ మిల్లర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలుస్తున్నాం.