మీడియా -మాఫియా – అమ్రిష్ పురి!!


By : sk .zakeer:

”మనం త్వరలో ఉద్యమం చేయబోతున్నాం సిద్ధంగా ఉండండి” అని తాను అజ్ఞాతవాసంలోకి వెళ్లేముందు తన సన్నిహితులకు రవిప్రకాష్ చెప్పినట్టు ఒక ప్రచారం జరుగుతున్నది. తెలంగాణలో ”మీడియా కబ్జా” కు గురవుతున్నదని అజ్ఞాతవాసం వీడి పోలీసుల ముందు విచారణకు హాజరవుతున్న సందర్భంగా రవిప్రకాష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.ప్రజలు సంఘటితం కావాలని, పిడికిలి బిగించి పోరాడాలని పిలుపునిచ్చాడు. ”మాఫియాకు మీడియాకు మధ్య జరుగుతున్న పోరాటం”గా కూడా తనపై పెట్టిన కేసుల గురించి నిర్వచించాడు.”హైదరాబాద్ అమ్రిష్ పూరి” అనే పేరు ప్రస్తావించాడు.ఆ పేరుతో కాంట్రాక్టర్లు,బిల్డర్లు, ఇతర వ్యాపార ప్రముఖులు ఎవరూ లేనందున రవిప్రకాష్ ఎవరి గురించి ”అమ్రిష్ పురి” అని సంబోధించాడో తెలుసుకోవడం కష్టం. కానీ ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విడుదల చేసిన వీడియో క్లిప్ లో మాట్లాడిన దాన్ని బట్టి సదరు ”అమ్రిష్ పూరి”ని పసిగట్టవచ్చును.”మైహోం గ్రూపు” అధినేత రామేశ్వరరావునే ఆ పేరుతో రవిప్రకాష్ సంబోధించి ఉంటాడని ఒక అనుమానం.రవిప్రకాష్ ను విచారిస్తున్న పోలీసులు బహుశా ఈ విషయమూ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండవచ్చు. రవిప్రకాష్ దృష్టిలో ప్రస్తుతం ‘మైహోం’ రామేశ్వరరావు విలన్ అని జర్నలిస్టుల అంచనా.జర్నలిజం, నైతికవిలువలు,ప్రజా ఉద్యమాలు వంటి వాటి గురించి మంగళ,బుధవారాల్లో రవిప్రకాష్ మాట్లాడుతున్నాడు. మీడియాలో ఒక ‘యోధుని’ వలె అతను చిద్విలాసంగా మాట్లాడుతున్న తీరు తెలంగాణ పోలీసులకు నచ్చినట్టు లేదు.అందువల్ల బుధవారం రాత్రి అతన్ని మీడియాతో మాట్లాడకుండా చూశారు. కాగా లాభాల పంట పండిస్తున్న టీవీ9 సంస్థ నుంచి ఆ సంస్థ యజమాని శ్రీనిరాజు ఎందుకు తప్పుకోవాలని అనుకున్నారు? దాదాపు ఏడెనిమిది సంవత్సరాలుగా అమ్మడానికి ఎందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చారు? టీవీ9ను కొనాలని ఎందరు ప్రయత్నించినా, ఎందుకు సఫలీకృతం కాలేదు? tv9 సొంతదారు శ్రీనిరాజు తన సంస్థను అమ్మకుండా రవిప్రకాష్ పలు విధాలుగా అడ్డంకులు సృష్టించారని ఆరోపణలు ఎందుకు వచ్చాయి? టీవీ9 ను అమ్మే హక్కు శ్రీనిరాజుకు లేదా?శ్రీనిరాజు నారు పోస్తేనే కదా, రవిప్రకాష్ నీరు పోసింది!! టీవీ 9 నిర్మాత శ్రీనిరాజు. ilabs గ్రూపు అధినేత.పలు ఐ.టి.సంస్థలకు అధిపతి.వందలాది కోట్ల లాభాలు వస్తున్నా తన సంస్థ అమ్మివేయాలని శ్రీనిరాజు నిర్ణయించుకోవడం వెనుక కారణాలేమిటో!! ఆయన ఎన్ని రకాల ‘హింస’ ను అనుభవించారో? టీవీ9 ఎబిసిఎల్ సంస్థకు చెందినది అయితే దాని ‘లోగో’ రవిప్రకాష్ సొంతం ఎలా అవుతుందో రవిప్రకాష్ కే తెలియాలి. ‘లోగో’ రిజిస్ట్రేషన్ ను తన పేరు మీద చేయించుకున్నారంటే మొదటి నుంచే సంస్థపై తన ఆధిపత్యాన్నిచెలాయించడానికి పథకం రూపొందించుకున్నట్టు రవిప్రకాష్ అంటే గిట్టనివారు చెబుతున్నారు. ఆయన టీవీ9 లో వుంటూనే మరో చానల్ కు ఎందుకు అమ్మివేయాలనుకున్నట్టు? టీవీ9 నుంచి ప్రకటనలను మరో ఛానల్ కు మళ్లించారనే ఆరోపణలూ ఉన్నవి. వాటికి సంబంధించి రవిప్రకాష్ పోలీసులకు వివరణ ఇవ్వవలసి ఉంటుంది. నిధుల మళ్లింపు కేసులో ఈ తతంగం ఉన్నది.అసలు ‘మోజో’ టీవీ ఎవరిది? దానికి నిధులెక్కడివి? ”నా మిత్రులు మోజో టీవీ పెట్టుకున్నారు” అన్నది రవిప్రకాష్ కథనం.రవిప్రకాష్ బినామీ సంస్థగానే ‘మోజో’ టీవీ పుట్టుకొచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఉద్యోగులు హక్కులు, సెంటిమెంటుతో పెద్దమొత్తంలో సొమ్మును ‘మోజో’ టీవీ CEO రేవతి స్వాహా చేసిందనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి. ”ఎవరి ఊహకు అందని మరో కోణం తాజాగా బయటకు వచ్చింది. రెండు వారాల క్రితం , తమ సంస్థను కొందరు పెద్దమనుషులు అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు అని మోజో టీవీ సీఈఓ రేవతి ఒక షో చేసారు. మోజో టీవీ మానేజ్మెంట్ ని భయపెట్టి , వారి షేర్స్ ని లాకొన్ని తమ బలంతో ఛానల్ ను కబ్జా చేస్తున్నారని కూడా ఆమె హంగామా సృష్టించారు. సంస్థలో పని చేస్తున్న 200 మంది ఉద్యోగుల భవిషత్తు ప్రమాదంలో పడిందని, దీని అడ్డుకోవటానికి పోరాడుతున్నట్లుగా, లైవ్ షో, డిబేట్లు నిర్వహించింది.ఒక వైపు ఈ హడావుడి చేస్తూనే కొన్ని కోట్ల రూపాయలను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు రేవతి మళ్లించుకున్నారు”. అన్నది ఆ ప్రచారం సారాంశం. ‘మోజో టీవీ’లో ఏమి జరుగుతున్నదో ఇంకా పూర్తిగా బయటకు వెల్లడి కాలేదు.టీవీ 9 వ్యవహారం పూర్తిగా తేలితే తప్ప ‘మోజో’ సంగతి తేలకపోవచ్చు. గురువారం నాటికి ఉన్న సమాచారం ప్రకారం ‘మోజో’టీవీ కూడా చేతులు మారింది.ఆ విషయం రవిప్రకాష్ కూడా చెబుతున్నాడు. ”ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మోజో టీవీని బలవంతంగా లాక్కున్నారు” అన్నది రవిప్రకాష్ ఆరోపణ.అది అంత సులువేనా? ఆ ఆరోపణ నమ్మదగినదిగా ఉన్నదా? ఒక టీవీ న్యూస్ ఛానల్ ను వేరొకరు కానీ వేరే సంస్థలు కానీ ఎలాంటి లావాదేవీలు లేకుండా ‘కబ్జా’ చేయడం సాధ్యమేనా? సరే, మొత్తమ్మీద విచారణ సందర్భంగా పోలీసులకు ఆయన ఏమి చెబుతున్నాడో మనకు తెలియదు కానీ బయట మీడియాలో మాత్రం చాలా విషయాలు దాస్తున్నట్టు కనిపిస్తున్నది. జర్నలిజం, విలువలు,సమాజం,ప్రజలు, ఉద్యమాలు, సాహసం, పోరాటం, ధైర్యం, అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతున్న రవిప్రకాష్ పరిస్థితి 2004 వరకు ఎలా ఉండేది!! ఆతర్వాత ఆయన ఆర్ధిక పరిస్థితి ఏమిటి ? కేవలం పదిహేను సంవత్సరాలలో ఒక సాధారణ జర్నలిస్టు ఇంత ఎత్తుకు ఎలా ఎదిగిపోయాడు? అతనికి అల్లాఉద్దీన్ అద్భుత దీపం ఏమైనా దొరికిందా ?పైగా తన సంపదను ప్రదర్శించడానికి ఆయన వెనుకాడకపోగా మరింత ఉత్సాహం చూపుతున్నాడు. లేకపోతే ఇంచుమించు మూడు,నాలుగు కోట్ల విలువ చేసే ‘పోర్ష్’ కారులో పోలీసుల విచారణకు ఎందుకు హాజరవుతాడు!! జర్నలిస్టు అయితే సంపాదించవద్దా? మిగతా రంగాలలో అయితే సంపాదించుకోవచ్చునా? ఆయన పోర్ష్ కారులో వస్తే తప్పేమిటి? రవిప్రకాష్ ‘స్వయంకృషి’ని, అద్భుతమైన ‘ప్రతిభ’ ను గుర్తించకపోతే ఎలా? అని వాదించే ‘రవిప్రకాష్ అభిమాన సంఘం’ నాయకులను కట్టడి చేయడం కష్టం. వాళ్ళతో ఎదురు వాదనలూ కష్టమే. మూడు, నాలుగు దశాబ్దాలకు పైగా మీడియా ‘సాలెగూడు’ లో చిక్కుకొని,’సింగిల్ కాలమ్’ వార్తకు కూడా నోచుకోకుండా అనామకంగా చనిపోయినవాళ్ళు,చనిపోతున్నవాళ్ళు ఎందరో ఉన్నారు.జిల్లాల్లో,గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం. మీడియాలో అవకాశం కోల్పోగానే ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలూ తరచూ వింటున్నాం.ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతోనో, బ్రెయిన్ స్ట్రోక్ తోనో అర్ధంతరంగా ప్రాణం విడుస్తున్న సంఘటనలూ జరుగుతున్నవి. కొన్ని సందర్భాలలో అయితే అంత్యక్రియలకు కూడా డబ్బు లేని జర్నలిస్టులకు సంబంధించిన వార్తలు కూడా వస్తున్నవి. ఇటువంటి వారంతా టాలెంట్ లేక, తగిన నైపుణ్యం,బతకనేర్వడం రాక రవిప్రకాష్ వలె ‘ధనికులు’ కాలేకపోతున్నట్టు భావించవలెను. ‘పోర్ష్’ కారులో ప్రయాణిస్తూ ప్రజా ఉద్యమాల గురించి మాట్లాడినా రవిప్రకాష్ ను గట్టిగా సమర్ధించే అరకొర ‘జర్నలిస్టులూ’ ఉన్నారు.కానీ మీడియా అంటే రవిప్రకాష్ కాదు.జర్నలిజం అంటే రవిప్రకాష్ కాదు. అతనికన్నా ముందూ జర్నలిజం ఉన్నది. అతని తర్వాత కూడా జర్నలిజం ఉంటుంది. రవిప్రకాష్ పిలుపునందుకొని అతని ‘అభిమాన సంఘం’ నాయకులు రోడ్ల మీదకు రాగలరా? ప్రజా ఉద్యమాలు నిర్మించగలరా? అసలు ప్రజలకు, జర్నలిస్టులకు రవిప్రకాష్ ఎపిసోడ్ తో సంబంధమే లేదు.ఈ వ్యవహారం పూర్తిగా వ్యక్తిగతమైనది. అతనిపై కొన్ని నేరారోపణలు ఉన్నవి. వాటిపై ఆతను విచారణను ఎదుర్కుంటున్నాడు. న్యాయపోరాటం ద్వారా మాత్రమే తాను నిర్దోషినని అతను నిరూపించుకోవాల్సి ఉన్నది.మాఫియా,మీడియాకు మధ్య పోరాటం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. జర్నలిస్టు సమాజం,ప్రజలు రవిప్రకాష్ కు మద్దతుగా పోరాటాలు చేయాలా? ఎందుకు చేయాలి? ఇప్పటివరకు ఏ జర్నలిస్టు సంఘమూ అతని పక్షాన ఒక ప్రకటన కూడా చేయలేదు. రవిప్రకాష్ పై సానుభూతి చూపలేదు.కారణాలేమిటో రవిప్రకాష్ కనీసం ఆత్మవిమర్శ చేసుకోవడం లేదా? సగటు జర్నలిస్టుల సమస్య కానప్పుడు ఏ సంఘమైనా ఆ సమస్యపై ఎట్లా మాట్లాడుతుంది? abcl, అలందా మీడియా అనే రెండు బడా పెట్టుబడిదారీ సంస్థల మధ్య ఒక టీవీ ఛానల్ అమ్మకం, వాటాల మార్పిడి, యాజమాన్యం బదలాయింపు తదితర అంశాలకు సంబంధించిన వివాదంగానే తెలంగాణ సమాజం చూస్తున్నది.రవిప్రకాష్ నిజాయితీ వివాదాస్పదం కాకపోయి ఉంటే మీడియా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు,కోదండరాం వంటి వాళ్ళు ఖచ్చితంగా స్పందించేవారు. మీడియాను కబళించే ప్రయత్నం చేస్తున్న మాఫియాకు వ్యతిరేకంగా ప్రజాస్వామివాదులు గొంతు విప్పేవారు.అలాంటి సన్నివేశాలను ఊహించుకోవడం సరైనది కాకపోవచ్చు. అత్యాశే కావచ్చును. తనపై పోలీసు కేసులు నమోదైన నాటి నుంచి పరారీలో ఉన్న రవిప్రకాష్ ఎక్కడెక్కడ తలదాచుకున్నాడో అధునాతన టెక్నాలజీ వాడకంలో, నేరపరిశోధనలో అత్యంత నైపుణ్యం కలిగినవారుగా ప్రపంచం గుర్తిస్తున్న తెలంగాణ పోలీసులకు తెలియదని ఎవరూ అనుకోవడం లేదు. కాగా ‘తప్పుడు కేసుల’ బారి నుంచి తనను రక్షించాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకొని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వరకు పైరవీలు చేశారని, తన మద్దతుదారులతో తీవ్రంగా ప్రయత్నించారని కూడా రవిప్రకాష్ విరోధులంటున్నారు. ఆ ప్రయత్నాలు బెడిసికొట్టడం, ముందస్తు బెయిలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల ఎదుట విచారణకు రవిప్రకాష్ హాజరవుతున్నాడు. మామూలుగా రవిప్రకాష్ కు టన్నులకొద్దీ ఆత్మవిశ్వాసం, తనను మించిన తెలివితేటలు మీడియాలో ఎవరూ లేరనే గర్వమూ పుష్కలంగా ఉంటాయి. పోలీసుల విచారణకు హాజరవుతున్నప్పుడు, విచారణ అనంతరం బయటకు వస్తున్నప్పుడు అవి సడలినట్లే కనిపిస్తున్నది. కాగా తన ఆఖరిరోజుల్లో అత్యంత దుర్భర దారిద్య్రంలో చనిపోయిన మా కె.ఎన్.చారి, 2001-2002 ప్రాంతాల్లో ‘అంధ్రజ్యోతి’ మూతపడగానే తట్టుకోలేక vasmol తాగి ఆత్మహత్య చేసుకున్న మా కె.పి. రామస్వామి(గోదావరిఖని) వంటి వారి ఆత్మలు ఎంత ఘోషిస్తున్నవో!! ఈ రెండు సందర్భాలకు నాతో పాటు అమర్ సార్, ఘంటా చక్రపాణి,అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, ఎన్.వేణు వంటి చాలామంది మిత్రులూ సాక్షులే. ఇప్పుడా విషాదభరిత ఘటనల ప్రస్తావన అసందర్భమూ కావచ్చును.’రవిప్రకాష్ అభిమాన సంఘాని’కి చీదరింపుగానూ, అసహ్యంగానూ ఉండవచ్చును. ఇక ‘పోలీసుల్లో చాలా మంది మంచివాళ్ళు ఉన్నారు,మీడియా సంస్థలను కబ్జా చేస్తున్న అమ్రిష్ పురికి కొందరు సత్ప్రవర్తన లేని పోలీసులు మాత్రమే సహకరిస్తున్నారు’ అని రవిప్రకాష్ విభజించడంతో ‘మంచిపోలీసుల’ గురించి పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తుచేస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికే చెందిన కొందరు పోలీసు అధికారులు ఇటీవల సమావేశమై రవిప్రకాష్ ను రక్షించే మార్గాలను అన్వేషించారని ప్రాధమికంగా క్లూ దొరికినట్టు తెలియవచ్చింది. సదరు ‘మంచి పోలీసుల’లో నయీమ్ ముఠాతో కుమ్మక్కు అయి అప్రదిష్టపాలైన వారూ ఉన్నట్టు మరొక సమాచారం. ఈ పోలీసు బృందమే రవిప్రకాష్ అజ్ఞాతవాసంలో ఉండడానికి తోడ్పాటు అందించారని,పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి అనే అంశాలపై రవిప్రకాష్ కు తర్ఫీదు ఇచ్చారని అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి రావడం పట్ల తెలంగాణలోని కమ్మ సామాజికవర్గం సహజంగానే హడలిపోతున్నది. ఇక కమ్మ పోలీసు అధికారులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు పోలీసువర్గాలలో ప్రచారం ఉన్నది. భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ‘కమ్మ’ పోలీసులు రవిప్రకాష్ కు సలహా ఇచ్చారని తెలుస్తున్నది.

రవిప్రకాష్ కు పోలీసుల ప్రశ్నావళి:

1. మీడియా తరపున ధైర్యంగా పోరాడుతామన్న మీరు పోలీసు నోటీసులను తిరస్కరించి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు.?
2. మీరు ధర్మ యుద్ధం చేస్తే పారిపోవాల్సిన అవసరం ఏముంది.?
3. ABCLలో 90శాతం పెట్టుబడి దారు అయిన యజమాని, ఆయన షేర్‌ అమ్ముకోవడం తప్పా?
4. మెజార్టీ ఓనర్‌ మీ అనుమతితోనే నిర్ణయాలు తీసుకోవాలా.?
5. 8.5 శాతం వాటాదారు అయిన మీరు మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా మీ షేర్లు అమ్ముకోవడం న్యాయమా.?
6. 20/02/2018 లోనే శివాజీ మీకు మొత్తం డబ్బు చెల్లిస్తే 17/03/2019 దాకా అతనికి షేర్లు బదిలీ చేయకుండా ఉంచడంలో
ఆంతర్యం ఏమిటి? ఆయనను బెదిరించి బదిలీని ఆపారా? లేదా ఈ మొత్తం వ్యవహారంలో కుట్ర ఏమిటి.?
7. మీరు తయారు చేసుకున్న, మీ మధ్య సాగిన అన్ని మెయిల్స్‌ లో కూడా 13/04/2019 నాడే మొత్తం కుట్రకు సంబంధించిన దస్తావేజులను తయారు చేశారు కదా? 13/04/2019 నాడు మీరు తయారు చేసిన డాక్యుమెంట్లు 20/02/2018 నాటి తేదీలో ప్రింటు చేసి, కేసు వేయటం చట్టాన్ని 99 శాతం షేర్‌ హోల్డర్స్‌ని, ప్రజలని మోసం చేయటం కాదా.?
8. మీ ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయనను తీసేయటం, దాన్ని MCA వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయటం మోసం కాదా?
9. తాను రాజీనామా చేయలేదని మీ కంపెనీ సెక్రటరీ MCAకు ఫిర్యాదు చేయటం వాస్తవమా? కాదా?
10. మీరు కంపెనీలో ఉద్యోగిగా ఉంటూ మొత్తం కంపెనీ నాదే అని వాదించడం, తప్పుడు ప్రచారం చేయడం, మీరు ఆ కంపెనీని కబ్జా చేయడం కాదా.?
11. ఒక సంస్థలో యజమానికి, ఉద్యోగి (మీకు) మధ్య వివాదాన్ని మీడియా యుద్ధంగా చూపించడంలో వాస్తవం ఏమిటి.?
12. అలాందా మీడియాకు శ్రీనిరాజుకి జరిగిన ఒప్పందంలో మీరు కూడా సంతకం చేశారు కదా. మరి అది మోసం ఎలా అవుతుంది.?
13. అలందా వాటాల మార్పిడి, వారి డైరెక్టర్ల నియామకానికి సంబంధించిన అన్ని రిజల్యూషన్లపై మీరే సంతకం చేశారా..? లేదా.?
14. మీ సంతంకంతోనే డైరెక్టర్లుగా నియమితులైన వారు కంపెనీ కార్యకలాపాలలో పాల్గొనకుండా మీరు అడ్డుకున్నారా.? లేదా.?
15. కంపెనీలో 90 శాతం వాటా ఉన్న వాళ్లను కంపెనీలోకి అడుగుపెట్టకుండా మీరు ఇబ్బందులకు గురి చేసేందుకు దొంగ కేసులు వేశారా.? లేదా.?
16. కోట్ల విలువ చేసే కంపెనీ లోగోని రూ.99,000లకే మీరు ప్రమోట్‌ చేసుకున్న మోజో టీవీకి బదిలీ చేసినట్లు దొంగ డాక్యుమెంట్లు సృష్టించారా.? లేదా.?
17. అక్టోబర్‌ 2018లో మీ సంతకంతోనే డైరెక్టర్లను నియమించి వారికి తెలుపకుండా దొంగచాటుగా 30/12/2018న లోగోని అమ్మినట్లు పత్రాలు సృష్టించడం ధర్మం అవుతుందా.?
18. మీ తప్పుడు చర్యలతో కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా వందలాది మంది ఉద్యోగుల జీవితాలను మీ స్వార్థానికి బలిచేయడం ధర్మయుద్ధం అవుతుందా.?
19. మొన్న ఈ మధ్య వచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ, రవిప్రకాశ్‌ నాకు మా జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువు అని చెప్పాడు కదా. అలా అయితే ఆయన వేసిన కేసు డ్రామానా.? కుట్రనా.?
20. మీకు శివాజీకి మధ్య ఒప్పందం వివాదమైతే మీపై కేసు వేయాలి కానీ దారినపోయే దానయ్య మీద కేసు వేయించడం ధర్మ యుద్ధమా.?
21. జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని సంస్థ యజమానిని, తోటి ఉద్యోగులను ఇన్నాళ్లు మోసం చేసిన మీరు.. ఇప్పుడు అదే జర్నలిజంపై వ్యాఖ్యలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించడం లాంటిది కాదా.?
22. ఆఖరుగా మీది ధర్మయుద్ధమైతే పోలీసులు ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోకుండా గోడ దూకి పారిపోవాల్సిన అవసరం ఏంటి.? చాటుమాటుగా బెయిల్‌ పిటీషన్లు దాఖలు చేయడం ఎందుకు.?