మీ జీమెయిల్ మరొకరు చదువుతున్నారు!!

న్యూ ఢిల్లీ:
నా మెయిల్ నాకే సొంతం. అందులోనూ నా జీ-మెయిల్ ఎంతో భద్రం అనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. మీకు వచ్చే మెయిల్స్ మీతో పాటు మరొకరు చదువుతున్నారు. మీ ఇన్ బాక్స్ లో పడే ప్రతి మెయిల్ ను మీ కంటే ముందుగా మరో వ్యక్తి చదువుతున్నాడు. దీనికి సాక్షాత్తూ జీమెయిల్ నిర్వహించే గూగుల్ సంస్థే అనుమతిస్తోంది. కాళ్ల కింద భూమి కదిలిపోయేలాంటి ఈ నిజాలను అంతర్జాతీయంగా ఎంతో ప్రసిద్ధి పొందిన వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ ను 1.4 బిలియన్ల మంది వాడుతున్నారు. అయితే ఇన్ని కోట్ల అకౌంట్లకి వచ్చే మెయిల్స్ పని చూసేందుకు గూగుల్ కొందరిని నియమించింది. నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని గూగుల్ తన అనుబంధ సంస్థలకి మాత్రమే అప్పగించాలి. ఏదైనా దర్యాప్తు విషయంలో విచారణ ఏజెన్సీ మెయిల్స్ తనిఖీ చేయాలనుకొంటే గూగుల్ ఉద్యోగి మాత్రమే ఈమెయిల్స్ చెక్ చేసే అవకాశం ఉండేది. కానీ అలా కాకుండా ఈ సెర్చ్ ఇంజిన్ దిగ్గజ సంస్థ మధ్యలోకి థర్డ్ పార్టీలను తీసుకొచ్చింది. ఇదే వివాదం ఇప్పుడు వినియోగదారుల సమాచార భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేసింది. తన జీమెయిల్ యూజర్స్ ఇన్ బాక్స్ లోని మెయిల్స్ అన్నిటిని స్కాన్ చేసి ఉపయోగించుకొనేందుకు గూగుల్ వందలాది సాఫ్ట్ వేర్ యాప్ డెవలపర్స్ ని అనుమతించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. థర్డ్ పార్టీ డేటా కలెక్టర్లు ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో మెయిల్స్ స్కాన్ చేస్తారు. వాటిలో ఏదైనా వస్తువు విషయంగా ఏవైనా వివరాలు ఉంటే వెంటనే ఆ మూడో సంస్థ ఎగ్జిక్యూటివ్స్ సంబంధింత మార్కెట్లకు సమాచారం అందిస్తారు. అలాగే మీ వ్యక్తిగత వివరాలు, ఇతర అన్ని వ్యవహారాలు ఎప్పటికప్పుడు ఆయా సంస్థలకు చేరిపోతుంటాయి. నిరంతరం జీమెయిల్ తో పాటు ఇతర మెయిల్స్ కూడా స్కాన్ చేస్తారు కనుక మీ సమాచారం ఇంక ఏ మాత్రం వ్యక్తిగతం కాదని.. అంతా బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ హెచ్చరించింది.