ముందస్తుకు తెలంగాణ సై. ఏపీ… నై.

ఎస్.కే. జకీర్.
కేంద్ర, రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు హాట్ టాపిక్ గా మారాయి. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, ఖజానాకు భారం తగ్గుతుందని మోడీ సర్కారు యోచన. ఇప్పటికే మోడీ సర్కారు ముందస్తుపై ఒక అంచనాకు వచ్చిందనే ఊహాగానాలు ఉన్నాయి. కేంద్రం జమిలీ ఎన్నికల పేరుతో ముందస్తుకు వెళ్లాని ప్రయత్నిస్తోంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ముందస్తు రంకెలు వేస్తుంటే.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు మోకాలడ్డుతున్నాయి. కేంద్రం జమిలి ఎన్నికల పేరుతో లోక్‌సభతో పాటే అన్ని అసెంబ్లీలకు అక్టోబరు, నవంబరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ముందస్తు ఎన్నికల విషయమై ఇప్పటికే కేంద్రం పలు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ బీజేపీయేతర రాష్ట్రాలు అంగీకరించే పరిస్థితులు కనిపించటం లేదు. అసెంబ్లీ రద్దుకు రాష్ట్రాలు అంగీకరించపోతే కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లలేదు. ముందస్తు ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ముందుస్తుకు సైసై అంటుంటే ఏపీ మాత్రం నైనై అంటోంది. ముఖ్యంగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక దూకుడు పెంచిన ఏపీ సీఎం చంద్రబాబు ముందస్తుకు వెళ్లే ఉద్దేశ్యమే లేదంటూ కుండ బద్దలు కొట్టారు. ప్రజలు అవకాశమిచ్చిన ఐదేళ్లు పాలన పూర్తయ్యాక కానీ ఎన్నికలకు వెళ్లబోమని ప్రకటించారు. విభజన కారణంగా ఆరంభంలో అనేక కష్టాలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పుడు ఎన్నికలు వస్తే పనులకు బ్రేక్ పడుతుందనేది అధికార టీడీపీ ప్రభుత్వ వాదన. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటోంది. కానీ కార్యకర్తలకు మాత్రం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని చెబుతోంది. మరోవైపు జగన్ మాత్రం ముందస్తు ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తనకే అధికారం ఖాయమనే విశ్వాసం జగన్ లో కనిపిస్తోంది. వచ్చేది మన ప్రభుత్వమేనని ఆయన పాదయాత్ర పొడవునా పదే పదే చెబుతున్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు జరగాలని ఆశిస్తున్నారు. చంద్రబాబు అంచనాలకు భిన్నంగానే ఉండే మోడీ వ్యవహారం చూస్తే కేంద్రం ముందస్తు ఎన్నికలు ప్రకటిస్తుందని అంచనా వేస్తున్నారు. సరిగ్గా పాదయాత్ర ముగియగానే ఎన్నికలు వస్తే అది వైసీపీకి కచ్చితంగా అందివచ్చిన వరమే అవుతుంది. అందుకే జగన్ ముందుస్తు కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ముందుస్తుకే సై సై అని కాలు దువ్వుతున్నారు. తాజాగా జరిపిన సర్వేలలో తమ ప్రభత్వానికి అనుకూలంగా రిజల్ట్ వచ్చాయని ఆయన చెబుతున్నారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరుతో ఇంకా ఎన్నికలకు సిద్ధం కాలేదనే ఆయన భావిస్తున్నారు. అందుకే ముందుగా ఎన్నికలు వస్తే మరో ఐదేళ్లు కారు జోరుకి తిరుగులేదని గులాబీ బాస్ భావిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్న వేళ… ఎన్నికలు వస్తే విజయం తమదే అని టీఆర్ఎస్ అధినేత అంచనా. అందుకే కేసీఆర్ ముందుస్తు రంకే వేస్తున్నారు. ముందుస్తు ఎన్నికలు వచ్చే మాట పార్టీల్లో హుషారు తెప్పిస్తోంది. ఏ క్షణమైనా ఎన్నికలు ప్రకటిస్తే ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నవి.