ముస్లింలపై కమ్ముకున్న ‘నల్లని మూక’ నీడలు.

ముంబయి.
లంచ్ బాక్స్ ల్లో తీసుకెళ్లే ఆహారం మొదలుకొని పిల్లలకు పెట్టే పేర్ల దాకా మధ్యతరగతి ముస్లింల జీవన విధానంలో, భయమూ పరాయీకరణలతో ప్రభావితమైన, ఒకరకం మార్పు గోచరిస్తోంది.
ముందుగా ముస్లింలు తరచుగా ఎదుర్కునే కొన్ని హాస్యోక్తులను చూద్దాం.

పెళ్ళికి సంబంధించి: మీకేంటి సమస్య? నలుగురు భార్యలను కలిగుండొచ్చు.

క్రికెట్టుకి సంబంధించి: మీ టీమ్ పాకిస్థాన్ గెలిచిందిగా! కంగ్రాట్స్.

తీవ్రవాదానికి సంబంధించి: పని కావాలంటే మీరేమీ ఫైళ్లు కదిలించాల్సిన అవసరం లేదు. విమానాన్ని హైజాక్ చేస్తే సరి. ఏమైనా మీకందులో మంచి నేర్పుందిగా.

ఇలాంటి హాస్యోక్తులను స్నేహపూరితంగా తీసుకుని మనస్ఫూర్తిగా నవ్వే పరిస్థితిలో ప్రస్తుతం ముస్లింలు లేరనేది వీళ్లకు పట్టదు. మీరొకసారి ఫోన్ తీసుకుని మెసేజ్లు చూడండి. అందులో ఒక మెసేజ్ ఇలా ఉండవచ్చు. ఇండియాలో స్త్రీల పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందనీ కానీ 95% అత్యాచార కేసుల్లో ముస్లింలే నేరస్తులని. అది ఎంత పెద్ద అబధ్ధమైతేనేంటి మనకేమీ ఇబ్బంది లేదుగా.
ఇదిలా ఉండగా చాలామంది ముస్లింలకు అద్దెకో ఇల్లు దొరకడమే కష్టంగా ఉంది. ఎందుకంటే అద్దెకిచ్చేవాళ్ళు కూడా ముస్లింలంటే భయపడుతున్నారు. ఎక్కడ గోమాంసం అనుకుంటారో అనే భయంతో మాములు మాంసం తినటానికి కూడా ముస్లింలు వెనుకాడే పరిస్థితి ఉంది. వాళ్ళ పేర్లు కూడా ఎప్పుడూ లేనంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
మూక హత్యలు సర్వసాధారణమైన నేటి పరిస్థితుల్లో చాలా మంది మధ్యతరగతి ముస్లింలు ఒక కొత్తరకం అభద్రతాభావాన్ని ఎదుర్కొంటున్నారు. “మదరింగ్ ఏ ముస్లిం (ఒక ముస్లింకు తల్లి కావటం)” అనే పుస్తక రచయిత్రి ‘నజియా యీరం’ తన కూతురుకి ఒక మంచి పేరు పెట్టటానికే ఎంతో కష్టపడి, చివరకు అంతగా ముస్లిం అనిపించని పేరొకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఆవిడ మాటల్లోనే చెప్పాలంటే, “చాలామంది నాతో ఏకీభవించక పోవచ్చు. కానీ నేను నా కూతురి బాల్యం, ఎలాంటి గుర్తింపు సమస్యలతో ఇబ్బంది లేకుండా, సాఫీగా ఉండాలనుకొంటున్నాను. అందరిలోకి తాను భిన్నమనే భావం తనకు రాకూడదు.” తన హౌసింగ్ సొసైటీ తో ఎక్కడ ఇబ్బంది వస్తుందోననే భయంతో స్థానిక కసాయినుండి ఇంటికి మాంసం తెప్పించుకోవటం కూడా మానేసింది యీరం.
ఇలాంటి భయాందోళననే చరిత్రకారిణి ‘రాణా సఫ్వి’ కూడా వెలిబుచ్చారు. గతేడాది బక్రీద్ పండగ ముగిసినవెంటనే ఒక రోజు ఆమె బంధువొకరు ఇంటికి మాంసం తీసుకు వచ్చారు. ప్యాకెట్ లో ఏముందని వాచ్మాన్ అడిగితే పెద్దాయన ఉన్నదే చెప్పాడు. ఆమె ఇల్లు దాద్రీకి సమీపంలో ఉంది. 2015లో జరిగిన దాద్రీ మూక హత్య సంఘటన గుర్తొచ్చి ఆమె భయంతో వణికి పోయారు. ఫ్రిజ్ లో గోమాంసం ఉందేమో చూడాలని ఎవరైనా మగవాళ్ళు తన ఇంట్లోకి బలవంతంగా చొరబడితే ఏంచేయాలో పాలుపోని నిస్సహాయత తనను ఆవరించిందని ఆమె చెప్పారు.
వెంటనే ఆమె తమ సొసైటీ వాట్సాప్ గ్రూపుకి ఈ సంగతి తెలియజేసి కావాలంటే తనిఖీ చేసుకోవటానికి రమ్మని కూడా వాళ్ళను ఆహ్వానించింది. వాచ్మాన్ కి కూడా అది కేవలం మాంసమే అని నిర్ధారించి, ఆ మాంసాన్ని ఫ్రీజర్లో 15 – 20 రోజులపాటు నిల్వ ఉంచింది. ఒకవేళ తర్వాత ఎవరైనా వేలెత్తి చూపితే సాక్ష్యం కోసం అలా చేసిందటావిడ.
మొఘల్ చరిత్ర గురించి ‘సఫ్వి’ తన బ్లాగులో ఏమైనా వ్రాసినా లేక ట్వీట్ చేసినా వేధించటానికి కొంతమంది అంతర్జాల పోకిరీలెప్పుడూ వెంటబడుతుంటారు. గత రెండేళ్లుగా మధ్యతరగతి దృక్ఫథంలో ఒకరకమైన మార్పు గోచరిస్తుందంటారావిడ. వాళ్ళ దృష్టిలో ముస్లింలంటే తస్మదీయులు (మన వాళ్ళు కాదు).
కొంతమంది వ్యక్తులు, సాక్ష్యమేమీ లేకపోయినా, కేవలం అనుమానం మీదనే చంపబడుతున్నారని ‘యీరం’ అంటున్నారు. ఆమె కుటుంబం మొరాదాబాద్ లోని తమ ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు, అడ్డగించబడి వేధింపబడతారనే భయంతో, ఇదివరకుటిలా మాంసం వెంట తెచ్చుకోలేక పోతున్నారు.
ప్రస్తుతం ముంబైలో ఉంటున్న టీవీ సంపాదకుడు ‘అజాజ్ షేక్’ ది కూడా అదే పరిస్థితి. గతేడాది నుండి యూపీ లోని తన స్వంత గ్రామమైన ఫతేపూర్ వెళ్ళటం కూడా మానుకున్నానని ఆయన చెబుతున్నారు. కుటుంబమంతా కలిసి రంజాన్ పండగ జరుపుకోవటానికి అక్కడికి వెళ్లేవారంట. అదీగాక బక్రీద్ పండగప్పుడు బలివ్వటానికి ఒక మంచి మేకను కూడా తెచ్చుకునేవాళ్లంట. కానీ ఇప్పుడలా చేసి లేనిపోని ప్రమాదం కొనితెచ్చుకోవటం ఎందుకంటున్నారాయన. ఈ మధ్య తన తోటి ఉద్యోగి ఒకరు తను తింటున్నది గోమాంసం తో చేసిన కబాబా అని ప్రశ్నించినప్పుడు షేక్ దిగ్భ్రాంతి చెందారు. అది కేవలం రెచ్చగొట్టటానికే అని తెలిసీ అది గుడ్డు కూరని వివరించారంట. అసలలాంటి వివరణ ఇవ్వనవసరం లేదని తనకు తర్వాత తట్టిందన్నారాయన.
వాళ్ళ వంట గదుల్లో ఏం వండుకుంటున్నారో అనే శంకతో ముస్లిముల ఇళ్లల్లో పనిచేయటానికి పనివాళ్ళు కూడా వెనుకాడుతున్నారు. మనమూ వాళ్లు అనే భావం సమాజంలో ఎంత నాటుకుపోయిందంటే ఒక పనిమనిషిని మేము వద్దనుకునే పరిస్థితి లేకపోగా వాళ్లే మమ్మల్ని వెలివేస్తున్నారని వాపోయారు ‘యీరం’. మూక దాడులూ హత్యలూ లాంటివి హిందువులపై ప్రభావమేమీ చూపకపోవచ్చు కానీ ముస్లింలకవి స్పష్టమైన ప్రమాద సంకేతాలు. సమాజంలోని ఇలాంటి చీలికలపై నమ్మకం లేనివారుకూడా ఒక్కోసారి మూసధోరణుల ప్రభావానికి గురవుతున్నారని ఆమె అభిప్రాయం.
రచయిత్రీ సామాజిక కార్యకర్త ఐన ‘సాదియా దేహల్వి’ ఇటీవల అన్ని రకాల శాఖాహార మాంసాహార వంటల గురించి “జాస్మిన్ అండ్ జిన్స్ – మెమోయిర్స్ అండ్ రెసిపీస్ ఆఫ్ మై ఢిల్లీ” అనే పుస్తకం రచించారు. అయితే ఇందులో పశు మాంసానికి సంబంధించిన వంటలేమీ లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. తప్పుడు వార్తల విచ్ఛిన్నకర కార్యకలాపాల ప్రస్తుత వాతావరణంలో పదిమందిలో ఏం మాట్లాడాలో ఏం చేయాలో అనే దానిలో తను చాలా జాగ్రత్త పడుతున్నట్టు చెప్పారావిడ. అసమ్మతి వెలిబుచ్చేకన్నా మౌనంగా ఉండటమే మేలని భావిస్తున్నారావిడ.
ఇది ఒకరకమైన స్వీయ నియంత్రణని ఒప్పుకుంటూనే రచయిత్రిగా 40 ఏళ్ళు గడిపిన తర్వాత ఒక దేశద్రోహిగా ముద్రవేయించుకోవటము లేక అనవసర విద్వేషానికి గురవ్వటం కన్నా తన హుందాతనాన్ని నిలబెట్టుకోవటమే ముఖ్యమని భావిస్తున్నారావిడ. ఈ మధ్య చర్చా వేదికల్లో అలంకారప్రాయంగా పదేపదే వాడబడుతున్న కొన్ని పదాల గురించి చరిత్రకారిణీ రచయిత్రీ అయిన ‘రక్షండా జలీల్’ ఔట్లుక్ మ్యాగజైన్ కోసం వ్రాసిన తన వ్యాసంలో పేర్కొన్నారు. పవిత్ర ప్రేమ యుద్ధం (లవ్ జిహాద్); గోహత్యా గోమాంసం భుజించటం ద్వారా హిందువుల మనోభావాలంటే లెక్కలేనితనం; ప్రతి శుక్రవారం ముస్లింలు అధిక సంఖ్యలో గుమిగూడినప్పుడు శాంతిభద్రతల సమస్య తలెత్తటం; ముస్లింల్లో అంతర్గతంగా దాగియున్న దేశద్రోహ భావనలకు బహిరంగ రూపమే వాళ్ళు వందేమాతర గీతం పాడటానికి తిరస్కరించటము; ఇలా ఎన్నెన్నో అందులో ఉన్నాయి.
ముస్లింలంతా ముట్టడికి గురైన భావనలో ఉన్నారనీ ఎన్నికలు దగ్గరబడేకొద్దీ ఈ భావన మరింత బలపడుతుందనీ సామాజికవేత్త ‘ఆశిష్ నంది’ చెబుతున్నారు. సఫ్వి స్నేహితులు కొన్నిసార్లు ఆమెకు తను ముస్లింలాగా ఉండదని చెప్పుతుంటారు.
బహుశా ఆవిడ బాగా చదువుకుందనీ బాగా మాట్లాడుతుందనే ఉద్దేశంతో చేసే అనుచిత ప్రస్తుతి కావచ్చు. అయితే అది చాలా దయలేని పొగడ్తనీ ఆమె వారికి చెబుతుందట.

(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)