మైనార్టీలకు అండగా ఉంటాం – ఎం.పి. కవిత.

ఆర్మూర్:
మైనార్టీలకు అండగా ఉంటామన్నారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. శనివారం రాత్రి ఆర్మూరు జిరాయత్ నగర్ లో రూ.1కోటితో నిర్మించనున్న షాదీఖాన కు ఎంపి కవిత శంకుస్థాపన చేశారు. అనంతరం ప్లాజా ఫంక్షన్ హాలులో ఈద్ మిలాప్ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు కోసం మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, మైనార్టీల సంక్షేమం ఆపేది లేదన్నారు. సీఎం కేసీఆర్ చేయి పట్టుకుని నడవండి.. బంగారం స్వచ్ఛత లాంటి మనసుతో మీ వెంట నడుస్తారని ఎంపి కవిత చెప్పారు.
మైనార్టీ ల సంక్షేమం కోసం సిఎం ఎప్పుడు ఆలోచిస్తారని మైనార్టీల కోసం అమలుచేస్తూన్న పథకాలను వివరించారు.
తెలంగాణలోని ముస్లిం, క్రైస్తవులు, అన్ని  మతాలకు టీఆరెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మైనార్టీ మహిళలు వెనుకబడి ఉన్నారని వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. సీఎం కేసీఆర్ ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎంపి కవిత చెప్పారు.
క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ పండుగలకు సీఎం కేసీఆర్ ఘనంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. రెండు చేతులను జోడించి హిందువులు పూజ చేస్తారని, ముస్లిం లు అరచేతులను వెనక్కి అంటూ వెడల్పుగా చేసి దువా చేస్తారని వివరించారు. మతాలు వేరయినా సారం మాత్రం ఒకటే అన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదొద్దీన్, రెడ్ కో చైర్మన్ ఎస్.ఏ అలీం, టిఆర్ ఎస్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముజీబొద్దిన్, పలువురు ముస్లిం మత పెద్దలు, స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.