మోడీ పులి, విపక్షాలు గాడిదలు. -కేంద్ర మంత్రి అనంతకుమార్.

న్యూఢిల్లీ:
కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే మరోమారు ప్రతిపక్షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓ వైపు పులి, మరో వైపు గాడిదలు, కోతులు ఎన్నికల బరిలోకి దిగనున్నాయని తెలిపారు. కర్వార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని పులితో పోల్చిన అనంతకుమార్ విపక్షాలను గాడిదలు, కోతులతో పోల్చారు. ప్రజలు పులినే ఎన్నుకుంటారని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్‌ 70 ఏళ్ల పాటు దేశాన్ని పాలించినా మనం ఇంకా ప్లాస్టిక్‌ కుర్చీల్లో కూర్చుంటున్నామని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ సుదీర్ఘ పాలనతో మీరు వెండి కుర్చీల్లో కూర్చుని ఉండాల్సిందని అన్నారు. అనంత్‌ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో ఆయన దళితులను కుక్కలతో పోల్చడం పెనుదుమారం రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.