యాపిల్ యాప్ స్టోర్ కి పదేళ్లు.

న్యూఢిల్లీ:
దశాబ్దం క్రితం యాపిల్ తన ఐఫోన్ యాప్స్ కోసం యాప్ స్టోర్ ను ప్రవేశపెట్టింది. తమ ఫోన్లలో తమకు నచ్చిన ఫీచర్లు ఉండాలని కోరుకొనే యూజర్ల అభిరుచికి సాఫ్ట్ వేర్ డెవలపర్స్ సృజనాత్మకత తోడై ఫోన్ యాప్స్ విస్ఫోటం జరిగింది. కేవలం 500 యాప్స్ తో ప్రారంభమైన యాప్ స్టోర్ లో ఇప్పుడు 2 మిలియన్లకు పైగా యాప్స్ ఉన్నాయంటే ఇది సాంకేతిక విస్ఫోటం కాక మరేంటి? పని, ఆట.. రెండిటిని ఐఫోన్ లో ఒకేసారి చేసుకొనే వెసులుబాటు వచ్చాక చాలా మంది తమ ఎదురుగా ఉన్నవారి గురించి మరిచిపోయి చేతిలోని స్క్రీన్ నుంచి చూపు మరల్చడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల దైనందిన జీవితాలను మార్చేస్తున్న ఈ యాప్ స్టోర్ ప్రారంభించేటపుడు తనో యాప్ ఎకానమీని సృష్టిస్తున్నానని యాపిల్ ఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ కూడా ఊహించి ఉండకపోవచ్చు.

యాపిల్ ఆవిర్భావం
యాప్ స్టోర్ ఆవిర్భావం కొత్త కొత్త రంగాలను ఆవిష్కరించింది. ఎక్కడికైనా వెళ్లాలంటే ట్యాక్సీ ఆగ్రిగేటర్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ యాప్స్ లేకుండా ఈ సేవలను కలలోనైనా ఊహించలేము. లెక్కకు మిక్కిలిగా పుట్టుకొస్తున్న యాప్స్ తో సాఫ్ట్ వేర్ డెవలపర్స్, కోడింగ్ స్కూళ్లకు ఎక్కడలేని డిమాండ్ పుట్టుకొచ్చింది. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు యాప్ స్టోర్ ప్రవేశించక ముందు రోజు వరకు మొబైల్ ఫోన్లు అంటే తయారీదారులు ఇచ్చిన ఫీచర్లతో తంటాలు పడాల్సిందే తప్ప మనకు నచ్చినట్టు మార్చుకొనే వీలే లేదు. ఐఫోన్ మార్కెట్లోకి వచ్చాక కూడా మొదటి ఏడాది ఇదే పరిస్థితి. దీంతో 500 ప్రోగ్రామ్స్ తో కూడిన యాప్ స్టోర్ ని ప్రవేశపెట్టింది యాపిల్. వీటిలో తమకు నచ్చిన వాటిని ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వద్దనుకున్న వాటిని వదిలేయొచ్చు. ఈ కొత్త ఆలోచన ప్రజలకు ఎంతగా నచ్చిందంటే మొదటి వారంలోనే 10 మిలియన్ డౌన్ లోడ్స్ వచ్చాయి. దీంతో యాపిల్ పోటీదారులైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ కూడా తమ సొంత యాప్ స్టోర్స్ ప్రారంభించాల్సి వచ్చింది.

యాపిల్ ఎకానమీ ఇప్పుడు యాపిల్ కాకుండా మిగతా సంస్థలు అందిస్తున్న యాప్స్ సుమారుగా 7 మిలియన్ల పైమాటే. యాపిల్ కూడా కలుపుకుంటే దాదాపు 9 మిలియన్ల పై చిలుకు యాప్స్ యాప్ స్టోర్లలో ఉన్నాయి. పదేళ్లుగా వెల్లువెత్తుతున్న ఈ యాప్ సునామీ రోజురోజుకీ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. దీంతో కొత్త వ్యాపారాలు పుట్టుకొచ్చాయి. కొత్త ఆలోచనలతో ప్రారంభమవుతున్న స్టార్టప్స్ లోకి బిలియన్ల కొద్దీ డాలర్లు ప్రవహిస్తున్నాయి. ఊబర్, స్నాప్ చాట్, స్పాటిఫై, యాంగ్రీ బర్డ్స్.. ఇలా వివిధ రకాలైన యాప్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో సాఫ్ట్ వేర్ డెవలపర్స్ పంట పండుతోంది. వీటన్నిటిలో యాపిల్ ఎక్కువగా లాభపడింది. ఫ్రీ యాప్స్ పేరిట అందిస్తున్న ఈ యాప్స్ లో అడ్వర్టయిజింగ్, సబ్ స్క్రిప్షన్స్, యాప్ కొనుగోళ్ల రూపంలో వందల కోట్ల డాలర్లు ఆర్జిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో యాప్ స్టోర్ నుంచి యాపిల్ 33 బిలియన్ డాలర్లు సంపాదించిందంటే దీని పవరేంటో ఊహించవచ్చు.