యుజిసి స్థానంలో ఉన్నత విద్యా కమిషన్.

న్యూ ఢిల్లీ:
దేశంలో ఉన్నత విద్యా విధానంలో భారీ సంస్కరణలు చేపట్టింది మోడీ సర్కార్. ఇందులో భాగంగా యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) ని తొలగించి ఆ స్థానంలో హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ)ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్‌డి) మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక ముసాయిదా బిల్లును తయారు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు మానవ వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యాసంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించడానికి తోడ్పడుతుందని.. విద్యా వ్యయం కూడా అందుబాటులోకి తీసుకొస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
హెచ్ఈసీఐ దేశంలోని విద్యాసంస్థలకు నిధులు సమకూర్చడంపై కాకుండా విద్యాప్రమాణాలు పెంచడంపై దృష్టి పెట్టనుందని హెచ్చార్డీ తెలిపింది. ఇందుకోసం హెచ్ఈసీఐకి విచారణాధికారాలు కూడా ఇవ్వనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థల మూసివేత, జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష వంటి అధికారాలు హెచ్ఈసీఐకి కల్పించనున్నారు. కొత్తగా తీసుకురానున్న హెచ్ఈసీఐ ఏర్పాటుపై కేంద్రం ప్రజల నుంచి సలహాలు కోరనుంది. ఇందుకోసం త్వరలోనే ఈ ముసాయిదా బిల్లును బహిర్గతం చేయనున్నారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తోందనే వార్తలు వచ్చాయి. తాజాగా హెచ్ఈసీఐ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడితే దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన చేయవచ్చని భావిస్తున్నారు.