యువత రాజకీయాల్లోకి రావాలి. కోదండరాం పిలుపు.

విక్రమ్.వి.
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గ్రామ స్థాయి నుండే రాజకీయ ప్రక్షాళన అనే లక్ష్యం తో మొదటి అడుగు వేసిన తెలంగాణ జన సమితి పార్టీ, తమ గ్రామాల్లో మార్పు కోసం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్న యువకులని ప్రోత్సహిస్తోంది.అందులో భాగంగా ప్రతీ గ్రామం నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి అప్లికేషన్స్ స్వీకరించటం మొదలు పెట్టిన వెంటనే యువత నుండి అనూహ్య స్పందన వచ్చింది.వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.అప్లై చేసుకున్న యువతీ యువకులకు అవగాహన సదస్సును కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోబోయే యువతీ యువకులకు కూడా త్వరలో అవగాహన సదస్సులను నిర్వహించటానికి తెలంగాణ జన సమితి పార్టీ సన్నద్ధం అవుతుంది.ఐతే ఆ అప్లికేషన్ సదుపాయాన్ని Online లో కల్పించటం వల్ల యువకులు చాలా తేలికగా పార్టీ వెబ్ సైట్ లోకి వెళ్లి, అందులో అప్లికేషన్ Fill Up చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.మిత్రులారా !70 ఏండ్ల స్వాతంత్ర్య భారతదేశ రాజకీయ ప్రస్థానంలో, కొవ్వొత్తుల లాగ కరిగిపోతూ దేశం కోసం, రాష్ట్రం కోసం, సమాజం కోసం మీ జీవితాలను, కుటుంబాలను, మిత్రులను, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సైతం త్యాగం చేసి, పార్టీలకు, సంఘాలకు, ఉద్యమాలకు, పోరాటాలకు ఊపిరిలూది, జెండాలు కట్టి, జేజేలు కొట్టిన యువ ఉద్యమకారులారా, మీకు వందనం!
ఒక్కసారి మన దేశ రాజకీయ చరిత్రలో యువత చేసిన త్యాగాలు, సాధించిన విజయాలను స్మరించుకుందాం…. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన మొదటి తరం ఉద్యమ వీర స్వాతంత్ర్య సమరయోధులు మహర్షి అరబిందో, అష్ఫాకుల్లా ఖాన్, రాం ప్రసాద్ బిస్మిల్, కుదీరామ్ బోస్, చంద్ర శేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్ గురూ, సుక్ దేవ్ ఇంకా ఎందరో వీరులు తమ జీవితాలని ముప్పై సంవత్సరాలు నిండక ముందే దేశం కోసం త్యాగం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులందరూ కూడా యువతీ యువకులే. వారి త్యాగం వెలకట్టలేనిది, మన స్వేచ్ఛ కోసం, మన ప్రగతి కోసం, మన జీవితాలలో ఉన్న కష్టాలను దూరం చెయ్యడానికి వాళ్ళ సొంత జీవితాలనే త్యాగం చేసిన్రు. యువత అంటే మనం, ప్రజాస్వామిక దృక్పథంతో బ్రతుకుతాము, ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు సాధించడానికి, కులాలకి, మతాలకు అతీతంగా, మనవత్వమే మన ఎజెండాగా నిస్వార్ధంగా సేవ చేస్తాము. “ప్రజాస్వామ్యమంటే మనకు కేవలం ఒక రాజకీయ ప్రక్రియ కాదు, అది ఒక సామాజిక ప్రక్రియ, అది మన నైతిక విలువ, అది మన జీవన విధానం.” మనము సమాజంలో మార్పును తీసుకురావడానికి పని చేస్తున్నాము, అంటే సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నాము, సమస్యల పరిష్కారానికి రాజకీయ రంగ ప్రవేశం తప్పదు, ఎందుకంటే మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. మన రాజకీయ లక్ష్యం ఒక్కటే, యువత రాజ్యాధికారం ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధి జరగాలి, ఆ ప్రగతికి యువత అన్ని స్థాయిల్లో ప్రజలకు జవాబుదారీ గా ఉండాలి, రాజకీయ నిర్ణయాధికారం సాధించుకోవాలి.రాజకీయాలంటే కేవలం డబ్బు, పైరవీలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, కాంట్రాక్టులు అనే ఒక తప్పుడు అవగాహన సమాజంలో ఉంది, కానీ అది కొంత మంది మాత్రమే చర్చించే స్థాయిలో ఉన్నది, నిస్వార్థ యువతీయువకులు రాజకీయ రంగ ప్రవేశం చెయ్యకపోతే ఎక్కువ మంది ప్రజలు అలా ఆలోచించే లాగ ప్రోత్సహించిన వాళ్ళమవుతాము. రాజకీయాలను ప్రక్షాళన చెయ్యాల్సిన భాద్యత మనదే! దేశాన్ని, రాష్ట్రాన్ని సాధించిన యువత చెయ్యకపోతే ఇంకెవ్వరు చేస్తారు? రాజకీయ ప్రక్షాళన! మన ఇంట్లో, మన బంధువులు, మన మిత్రులు వాళ్ళకి ఉన్న అవగాహనతో, భయాలతో మనల్ని రాజకీయాలు వద్దు అని చెపుతారు, అక్రమంగా దాడులు చేస్తారని, కుట్ర కేసులు పెడతారని వాళ్ళ భయం, అది సహజమైన భయమే, మనం మార్చల్సింది అదే భయాన్ని, మనకి సమస్యలే శత్రువులు, వ్యక్తిగత వైరుధ్యాలతో మన సమయాన్ని వృధా చేసుకోకుండా పని చేద్దాము. పార్టీలకు, రాద్ధాంతాలు, సిద్ధాంతాలకు అతీతంగా సమాజం మంచి కోరి రాజకీయాల్లోకి రావలనుకునే వారికోసం దారులు వేద్దాం. యువ వార్డు మెంబర్లు, యువ సర్పంచులు, యువ ఎంపీటీసీలు, యువ కౌన్సిలర్లను గెలిపించుకుందాం, యువ నాయకులు, యువ కార్యకర్తలను తయారు చేద్దాం, పల్లెటూరు నుండి పార్లమెంటు దాకా యువతను గెలిపించుకుందాం. రాజకీయాలను ప్రజలకు చేరువ చేద్దాం, రాజకీయ నాయకులు ప్రజలకు సేవకులుగా ఉండేలా మార్పు తెద్దాం! సమాజం మీద ప్రేమ, ప్రజలందరి హక్కుల కోసం పని చెయ్యాలని భాద్యత ఉన్నవాడే నాయకుడు అవుతాడు. కులాలు, మతాలు అనే చర్చ మనల్ని అడ్డుకోవడానికి పన్నిన కుట్రగా భావించాలి. ఆలోచనలకు పదును పెట్టండి. ఆచరణకు సిద్ధం కండి.