రక్తి కట్టిన ‘కుటుంబ కథా రాజకీయం’. వారసుల పట్ల వాత్సల్యం. ఇది టీ కప్పులో తుపాను కాదు. డి.ఎస్. ‘అంతరాత్మ’ ఇప్పుడు ఏమంటున్నది?

ఎస్.కె.జకీర్.
పొమ్మనకుండా పొగ పెట్టడం అంటే ఇదే. అయితే ఇది ఒక వైపు నుంచి జరుగుతున్నది. మరోవైపు ‘రోగి కోరినది, వైద్యుడు ఇచ్చినది ఒకటే’ అన్నట్టు నిజామాబాద్ కుటుంబ కథారాజకీయం నడుస్తున్నది. పొమ్మనకుండా పొగ పెట్టడం అంటే ఇదే. అయితే ఇది ఒక వైపు నుంచి జరుగుతున్నది. మరోవైపు ‘రోగి కోరినది, వైద్యుడు ఇచ్చినది ఒకటే’ అన్నట్టు నిజామాబాద్ కుటుంబ కథారాజకీయం నడుస్తున్నది. టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ద్రోహి అని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనపై తక్షణం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల టిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ పంపారు. ఈ ప్రక్రియ యావత్తు ఎం.పి. కవిత నాయకత్వంలో జరిగింది. డి.ఎస్.పచ్చి అవకాశవాది అని, కాంగ్రెస్ లో చేరేందుకు మంతనాలు ప్రారంభించారని సి.ఎం.కు పంపిన లేఖలో ఆరోపించారు. డి.ఎస్. వరుసగా మూడు సార్లు నిజామాబాద్ ప్రజల చేతిలో తిరస్కారానికి గురైన వ్యక్తి అని, ఆయన వల్ల టిఆర్ఎస్ కు ఇసుమంత కూడా ప్రయోజనం లేదని టిఆర్.ఎస్ ప్రజాప్రతినిధులు విమర్శించారు. అవకాశవాదంతోనే ఆయన తన చిన్న కొడుకును బిజెపిలోకి పంపించారని, టిఆర్ఎస్ ఎంపీ, ఎం.ఎల్.ఏ.లను అరవింద్ తీవ్ర పదజాలంతో దూషిస్తున్నా ఖండించకపోగా కొడుక్కి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ అర్బన్,రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ”ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎం.ఎల్.సి కూడా ఇవ్వకపోతే పదవికోసం అలమటిస్తూ ఆరు నెలలు పడిగాపులు పది, మిమ్మల్ని వేడుకుంటే ప్రభుత్వసలహాదారుగా నియమించి క్యాబినెట్ హోదా కల్పించారు” అని ఎం.పి కవిత తదితర శాసనసభ్యులు కేసీఆర్ కు గుర్తు చేశారు. మొదటినుంచీ గ్రూపులు నడపడం, పైరవీలు చేయడం, అక్రమార్జన డి.ఎస్. నైజమని కూడా నిందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందస్తుగా తెలియకుండా ఎం.పి. కవిత, ఇతర పార్టీ శాసనసభ్యులు బుధవారం ఉదయం నిజామాబాద్ లో అత్యవసర సమావేశం పెట్టి, డి.ఎస్. పై చర్యకు తీర్మానం చేసి మీడియాకు విడుదల చేశారా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. మంగళవారమే సి.ఎం. కేసీఆర్ అప్పాయింటుమెంట్ ఇచ్చినా ఆయనను డి.ఎస్. కలవలేదని ఒక ప్రచారం సాగుతున్నది. ఈ ప్రచారమే నిజమైతే అధికార పక్షంతో తెగతెంపులకు డి.ఎస్. దాదాపు రెడీ అయినట్టు భావించాలి. ఈ నేపథ్యంలోనే బుధవారం నాటి పరిణామాలుగా కొందరు అంచనా వేస్తున్నారు. కవిత తదితర శాసనసభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖపై స్పందించిన డి.ఎస్. ”ఈ పరిణామం దురదృష్టకరం. క్రమశిక్షణ గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏ పార్టీలో ఉన్న ఓ పద్ధతి ప్రకారం ఉంటాను. నాపై ఆరోపణలు సరికాదు.ముఖ్యమంత్రికి లెటర్ రాయాల్సింది కాదు. నాతో మాట్లాడితే సరిపోయేది. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకే. అది ఆయన చేతుల్లో ఉంది. మా అబ్బాయి ఇండిపెండెంట్. ఆయనకు స్వతంత్రంగ నిర్ణయాలు ఉంటాయి. దానికి నేను ఏం చేయగలను. ఈ స్థాయిలో నాపై లేఖ రాయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కవితను, ఎమ్మెల్యేలను అడగండి. వ్యక్తిగత పని మీద ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ నా క్వార్టర్ రిపేర్ పని చూసుకొని వచ్చాను. ఢిల్లీ వెళ్తే కాంగ్రెస్ నేతలు కాక ఇంకెవరు కనిపిస్తారు. కానీ నేను ఆజాద్ ను కలిశానని చెప్పటం పచ్చి అబద్ధం. నేను టిఆర్ఎస్ లోకి వచ్చాక రాజకీయ నేతలను కలవటమే మానేశాను ” అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో డి. శ్రీనివాస్ కొంతకాలంగా ‘మానసికంగా’ ఇమడలేకపోతున్నారు. ఆ పార్టీతో ఆయన సన్నిహితంగా ఉండటం లేదు. పార్టీలో ఆయన ‘సీనియారిటీకి’ విలువ లేదు. అనుభవానికి ప్రాధాన్యం లేదు. కొన్నీ సార్లు అవమానాలు జరిగినట్టు కూడా తెలుస్తున్నది. డి.ఎస్.లో అసంతృప్తి జ్వాల రగులుతుంది. కానీ దాన్ని బహిర్గతం చేయడం లేదు. పరోక్షంగానే తన నిరసనను ఆయన ప్రకటిస్తున్నట్టు కొన్ని ఘటనలు తెలియజేస్తున్నవి. ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలంగా అధికార పక్షంతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యక్రమాలన్నింటికి ఆయన దూరంగానే ఉంటున్నారు. కెసిఆర్ నిర్వహించిన ఎంపీల సమావేశానికి కూడా హాజరుకాలేదు. థర్డ్ ఫ్రంట్ లో చేరే విషయంపై ఇతర పార్టీల నాయకులతో మాట్లాడే అధికారాన్ని కేకే కు అప్పగించడంతో డి.ఎస్. రగిలిపోతున్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో ఆయన తన ‘సొంత గూటికి’ చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు నాలుగు నెలలుగా ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఓ సీనియర్ నేత ధర్మపురితో మంతనాలు జరుపుతున్నారని, త్వరలోనే ధర్మపురి కాంగ్రెస్ లో చేరతారని కూడా ఊహాగానాలు వస్తున్నవి. అయితే డి.ఎస్. మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. తనకు తెరాస లో ‘కంఫర్ట్’ గా ఉందని ఆయన కొద్దీ రోజుల క్రితం వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన నాయకుడు. కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన పీసీసీ అధ్యక్షుడిగా హైకమాండ్‌ దగ్గర పలుకుబడి ఉండేది. కానీ రెండు సార్లు శాసనసభ్యునిగా ఓటమీ పాలు కావడంతో ఆయన ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని భావించవచ్చును. పైగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయకపోవడంతో కాంగ్రెస్‌ను వీడారు. టిఆర్ ఎస్ నుంచి ఆయనను రాజ్యసభకు పంపారు. క్రమంగా టిఆర్ఎస్ ‘తత్వం’ బోధపడి డీలా పడిపోయారు. డి.ఎస్.కు టిఆర్ ఎస్ లో ప్రాధాన్యం తగ్గిందంటూ వచ్చిన వార్తలపై రాజకీయపరిశీలకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ జాతీయపార్టీ.  ప్రజాస్వామ్య వాతావరణం పుష్కలం. తెలంగాణా రాష్ట్ర సమితి ప్రాంతీయపార్టీ. కేసీఆర్ ది కేంద్రీకృత నాయకత్వం. ఎలా పోల్చుకుంటారు? కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు శీనన్న కళ వేరు. పరపతి వేరు. ఏదో ఒక అంశంపై ఆయన రోజూ మీడియాలో క‌నిపించేవారు. ఇంత అనుభవజ్ఞుడైన డి.ఎస్. కేసీఆర్ వ్యవహారశైలి గురించి, ఆయన పార్టీని నడుపుతున్న పద్ధతి గురించి ముందుగా తెలియదని ఎలా అనుకోగలం? పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా డి.ఎస్.సేవ‌లు వినియోగించుకోవడం లేదనే వాదన ఉండవచ్చును. కానీ ఆవాదనలో పస లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లోను ఆయనకు ప్రాధాన్యత క‌రువైందని బాధపడినా ప్రయోజనం ఉండదు. అక్కడ ముఖ్యమంత్రి కూతురు కవిత పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నప్పుడు సహజంగానే ఆమె ఒక ‘ అధికార కెంద్రమ్’ కాకుండా ఎలా ఉంటారు.? తన అనుభవంలో చాలామందిని డి.ఎస్. చ‌ట్టస‌భ‌ల కు పంపిఉండవచ్చును. అది గతం. వర్తమానం వేరు. త‌న‌ వారసులకు రాజకీయ పాఠాలు నేర్పడంలో ఆయన విఫలమయ్యారనే విమర్శను డి.ఎస్.ఎదుర్కుంటున్నారు. డీఎస్ తో విభేదించిన ఆయన చిన్న కొడుకు అర‌వింద్ త‌న దారి తాను వెతుక్కున్నారు. బీజేపీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు. తండ్రితో క‌లిసి కారెక్కిన నిజామాబాద్ మాజీ మేయర్ సంజ‌య్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మేల్యేల‌కు మళ్లీ టికెట్‌ ఇస్తామని సీఎం పలుమార్లు స్పష్టం చేశారు. కనుక సంజయ్ ఆశలు గల్లంతు కావడానికి అవకాశాలు ఎక్కువ. టీఆరెస్‌ నుంచి సంజ‌య్‌కు ఎలాంటి స్పష్టత లేదు.హామీ అంతకన్నా లేదు. సంజయ్ సందిగ్ధంలో ప‌డిపోయారు. ఇప్పటికే ఓ దఫా మేయ‌ర్‌గా చేసిన సంజ‌య్ 2019లో ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. టీఆర్ఎస్‌ నుంచి టికెట్ రాకుంటే కాంగ్రెస్ నుంచైనా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ నాయకులతోనూ ఆయన సంప్రదింపులు కూడా జ‌రుపుతున్న‌ట్లు నిజామాబాద్ లో ప్రచారం జరుగుతోంది డీఎస్ టీఆర్ఎస్‌లో ఉండ‌గా, చిన్న కొడుకు అర‌వింద్ బిజెపి బాట ప‌ట్టారు. పెద్ద కొడుకు సంజ‌య్ కూడా కారు దిగితే, ఒకే ఇంట్లో మూడు జెండాలు రెపరెపలాడవచ్చును. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కొంత ఫర్వాలేదు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిలో లోకి వలస వెళ్లారు. ధికారపార్టీలో పదవులను అలంకరించారు. కొంతమందికి పదవులు రాకపోయినా, భవిష్యత్తులో ఆదరణ ఉంటుందన్న అభిప్రాయంతో టిఆర్ ఎస్ లో కొందరు కొనసాగుతున్నారు. ” అంతరాత్మప్రబోధం ప్రకారం నేను టిఆర్ ఎస్ లో చేరాను. కాంగ్రెస్‌ను వీడటం బాధాకరంగా ఉన్నది. సోనియా ఎప్పటికీ ఆరాధ్యురాలే. ఎమ్మెల్సీ పదవి నాకో లెక్కా? బీసీ ఎంపవర్‌మెంట్ ప్రస్తుత కర్తవ్యం. రాష్ట్ర అభివృద్ధికి నా అనుభవాన్ని జోడిస్తా. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేను. జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటా. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో పార్టీలో కొనసాగలేను. కాంగ్రెస్‌లో నాపై కామెంట్ చేసే మొనగాడు ఎవరూ లేరు. నా కమిట్‌మెంట్, పార్టీ పట్ల నేను ప్రదర్శించిన లాయల్టీ కలిగిన నేత కాంగ్రెస్‌లో మరెవరూ లేరు. అలాగే వెళ్తూ వెళ్తూ పార్టీ మీద బురద చల్లాలనే కోరిక కూడా నాకు లేదు. తెలంగాణ సాధనకు పార్టీలో ఉండి నేను చేసిన కృషికి ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు . ఉద్యమాన్ని చివరిదాకా కొనసాగించి నాయకత్వం వహించిన ఘనత కచ్చితంగా కేసీఆర్‌కు దక్కుతుంది. నా అంతరాత్మ చెప్పింది, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బీసీల సాధికారతకు కృషి చేయడమే ఈ వయసులో నా కర్తవ్యంగా భావించి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా. బీసీల సాధికారిత కోసం కాంగ్రెస్‌లో పోరాడే పరిస్థితి లేదు . తెలంగాణ అభివృద్ధిమీద కేసీఆర్ కమిట్‌మెంట్‌తో ఉన్నారు. నూతన రాష్ట్రానికి పక్కరాష్ట్రంనుంచి అనేక ఇబ్బందులు ఎదురవుతున్న వేళ తెలంగాణవాదిగా నా అనుభవాన్ని జోడించి సహకారం అందిస్తా. 1969లో గాంధీభవన్‌లో అడుగుపెట్టి కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నా. నాటినుంచి నేటివరకు కాంగ్రెస్‌లో ఉన్నా. ఇందిర, రాజీవ్, సోనియా హయాంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశా. ఇవాళ కొందరు నేతల చెప్పుడు మాటలకు అనుగుణంగా కాంగ్రెస్ హైకమాండ్ పనిచేస్తున్నది. ఇలాంటి పద్ధతి పార్టీకి ఎంతో నష్టం కలిగిస్తుంది. నా లాంటి వాళ్లు ఎంత చెప్పినా వినే పరిస్థితి లేదు. ఎంతో వివక్షకు గురై మానసిక వేదనతో పార్టీని వదలాల్సి వచ్చింది . కాంగ్రెస్ నాకు చాలా గౌరవం ఇచ్చినమాట వాస్తవం. అలాగే నేను కూడా పార్టీకోసం అదే విధంగా కష్టపడ్డాను. కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధం, అభిమానం మాటల్లో చెప్పలేను. 2000 సంవత్సరం సెప్టెంబర్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎందుకు అవసరమో, ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు కోరుకుంటున్నారో శాసనసభలో వివరంగా మాట్లాడాను. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సీఎం కేసీఆర్‌ కూడా అసెంబ్లీ లోపల, బయట పలుమార్లు చెప్పారు. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి జరగాల్సి ఉంది. బలహీన వర్గాల యువత ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు దక్కుతాయనే ఆశతో ఉన్నారు. అలాగే స్వరాష్ట్రంలో మౌలిక వసతులు, సాగునీరు, తాగునీరువంటి అంశాల్లో ఒక బ్లూప్రింట్ తెలంగాణ మేధావుల మైండ్‌లో తిరుగుతున్నది . అనేక ఆటంకాలు వస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ ఒక్కరే కమిట్‌మెంట్‌తో ఈ దిశగా పనిచేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో వందలమంది వారి జీవితాలను సైతం త్యాగం చేశారు. వైఎస్ హయంలో బీసీలకు కొంతమేరకు న్యాయం జరిపించాను. వైఎస్ నాకు మంచి మిత్రుడు అయినా కొన్ని విషయాల్లో నేను విభేదించాను.ఎమ్మెల్సీ పదవి దక్కనందుకే అలిగి పార్టీని వదులుతున్నట్లు నాపై విమర్శలు వస్తున్నవి. ఎమ్మెల్సీ పదవి నాకో లెక్క కాదు. పీసీసీ చీఫ్‌గా 300 మందికి పార్టీ బీ-ఫారాలు అందజేశాను. పదవుల కోసం నేను ఏనాడు పాకులాడలేదు. కాంగ్రెస్ సీఎంల వద్ద కూడా వెళ్ళి ఏనాడు పైరవీలు చేయలేదు. ఎన్నికల్లో నేను ఒక్కడినే ఓడిపోలేదు. రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్ నేతలు ఓడిపోయారు. వాస్తవానికి రాష్ట్రం రాగానే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయంలో మాట నిలుపుకునేందకు కేసీఆర్ ముందుకు వచ్చారు. అయితే కాంగ్రెస్ నాయకులూ సరిగ్గా డీల్ చేయలేదు. అది కార్యరూపం దాల్చలేదు . కేసీఆర్ కుటుంబంతో సహా వెళ్లి మేడమ్‌ను కలిశారు. విలీనంపై ఆమెతో మాట్లాడారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు. నాయకులు విఫలమయ్యారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఆనాడు వైఎస్ వ్యతిరేకించినా నేను పీసీసీ చీఫ్‌గా ఉండి ఒప్పించాను. టీఆర్‌ఎస్‌లో నా సేవలు ఏరకంగా ఉపయోగించుకుంటారో కేసీఆర్ చేతిలో ఉంది. దిగ్విజయ్ ఒక మోసగాడు, వంచకుడు, చెప్పుడు మాటలు వినే రకం” అని డి.శ్రీనివాస్ టిఆర్ఎస్ లో చేరికపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా పంపిన సందర్భంలో మీడియా సమావేశంలో చెప్పారు.
టిఆర్ఎస్ ఎం. పి. కవిత ఆరోపించినట్టు తన చిన్న కొడుకు అరవింద్ ను డి.ఎస్. స్వయంగా బిజెపిలోకి పంపారో! లేక అరవింద్ స్వతంత్ర నిర్ణయంతో వెళ్లారో! బహిర్గతం కావడం కష్టం. కానీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కవితను బలంగా డీ కొంటున్న వ్యక్తిగా తక్కువ సమయంలోనే ధర్మపురి అరవింద్ కు గుర్తింపు వచ్చింది. ఆయన దూకుడు కవితకు, టిఆర్ ఎస్ నాయకులకు ఇష్టం లేదు. పైగా రాజ్యసభ సభ్యుడు డి.ఎస్ కొడుకు అయినందున ఇంకా చెలరేగిపోతున్నట్టు టిఆర్ఎస్ నాయకుల భావన. కొడుకుల రాజకీయభవిష్యత్తు కోసం డి.ఎస్. వెంపర్లాడుతున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. వారసుల పట్ల వాత్సల్యం లేనిదెవరికి?
డి.ఎస్. 1989 లో నిజామాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.సత్యనారాయణ పై గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందారు . 1998లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు . 1999లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ ను ఓడించి రెండవసారి శాసనసభ కు గెలుపొందారు. కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా పనిచేశారు . 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండవసారి నియామకమయ్యారు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీష్ పవార్ ను ఓడించి మూడవసారి శాసనసభకు ఎన్నికై వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పొందారు . తెలంగాణ సాధనకోసం లక్ష్మీనారాయణ రాజీనామా చేయగా 2010లో జరిగిన ఉప ఎన్నికలలో డి.శ్రీనివాస్ మరోసారి లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు. 2014లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి పోటిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయారు . 2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారన్న గుర్తింపు పొందారు. 2015, జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.