రాజకీయాల్లోకి ‘నెంబర్ వన్ గూఢచారి’ కొడుకు!

డెహ్రాడూన్‌:
కేంద్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు, ఒకప్పటి ‘నెంబర్ వన్ గూఢచారి’గా పేరు ప్రఖ్యాతులు పొందిన అజిత్ దోవల్ కుమారుడు శౌర్య దోవల్ రాజకీయాల్లోకి రావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాఖండ్ లోని ‘ ఘర్వాల్’ లోక్ సభ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా 43 ఏళ్ల శౌర్య దోవల్‌ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఆయన ‘ఇండియా ఫౌండేషన్‌’ అనే సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు. ‘బే మిసాల్ ఘర్వాల్ అభియాన్’ పేరిట శౌర్య దోవల్ కొంతకాలంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో హడావిడి చేస్తున్నారు. ఈ పథకంలో ప్రజల్ని పెద్దఎత్తున భాగస్వాముల్ని చేస్తున్నారు. ఫ్లెక్షీలు, కటౌట్లలో రెండు మొబైల్ నెంబర్లను దోవల్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఒక మిస్డ్‌ కాల్‌ ఇస్తే అభియాన్‌లో భాగస్వామ్యులు కావాలని తెలియజేస్తారు. మరో నంబర్‌ ద్వారా ‘ మెరుగైన ఘర్వాల్‌ గురించి ఆలోచిస్తున్న వారు ఈ ప్రచారంలో పాల్గొనవచ్చు, ఇది శౌర్య దోవల్‌ చొరవ’ అని ఉంటుంది. ‘ఘర్వాలి’ భాషలో కూడా ఈ ప్రచారం సాగుతున్నది. ఘార్వాలి జిల్లాతోపాటు చుట్టుపక్కల మరో ఏడు జిల్లాల్లో కూడా శౌర్య పోటోలతో బ్యానర్లు, కటౌట్లు కనబడుతున్నవి. గతంలో శౌర్య దోవల్‌ బీజేపీలో చేరతారన్న ఊహాగానాలొచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు ఆయన చేరతారని పార్టీ వర్గాలు అన్నాయి. 2017 డిసెంబర్‌లో ఉత్తరాఖండ్‌ రాష్ట్ర బీజేపీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో కూడా శౌర్య పాల్గొన్నారు. అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలేదని శౌర్య అప్పట్లో అన్నారు. ‘ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. అది నా చేతుల్లో లేదు. కానీ ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రాజకీయ బలం కూడా అవసరం ’ అని శౌర్య దోవల్ అంటున్నారు. బీజేపీ ఉత్తరాఖండ్ నాయకులు దోవల్ కు మద్దతునిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ సమస్యలపై ఆయనకు పట్టు ఉందని, ఇలాంటి తెలివైన వాళ్లు రాజకీయాల్లోకి రావాలని ఉత్తరాఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు అజయ్‌ భట్‌ కోరారు.